ఫండే
హెల్త్
సందేహం
బిడ్డ రాకతో ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ ఆ చిన్నారి ఆలనాపాలనలో అమ్మ తనను తాను పట్టించుకోవడం మర్చిపోతుంది. నిద్రలేని రాత్రులు, అలసట, హార్మోన్ల మార్పులు.. ఇలా శరీరంలో వచ్చే ప్రతి మార్పు మరో సవాలుగా మారుతుంది. అందుకే, మహిళలు ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం!
అమ్మగా మారడం అంటే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడమే! అందుకే, ప్రసవం తర్వాత మొదటి కొన్ని రోజులు తల్లికి చిరాకు, ఆందోళన, అకారణంగా ఏడుపు రావడం వంటివి కనిపించవచ్చు. వీటిని ‘బేబీ బ్లూస్’ అంటారు. సాధారణంగా రెండు వారాల్లో తగ్గిపోతాయి. అయితే రెండు వారాలకు మించి విచారం, నిరాశ కొనసాగడం, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం, బిడ్డను చూసుకోవాలనే ఆసక్తి తగ్గడం, బిడ్డతో అనుబంధం ఏర్పరచుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే అది ప్రసవానంతర డిప్రెషన్ (పీ.పీ.డీ.) కావచ్చు.
అంతేకాదు, ప్రసవం తర్వాత ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయులు వేగంగా తగ్గడం, నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలు వంటివి దీనికి దోహదపడవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కౌన్సెలింగ్, అవసరాన్ని బట్టి మందులు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలతో ఉపశమనం పొందవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం, తగిన విశ్రాంతి, నడక, స్నేహితులతో మాట్లాడటం కూడా మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. తనకు లేదా బిడ్డకు హాని చేసుకోవాలనే ఆలోచనలు వస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
పెరి మెనోపాజ్... మార్పుల దశ!
మెనోపాజ్‌కు ముందు వచ్చే దశనే పెరి మెనోపాజ్ అంటారు. సాధారణంగా నలభైల మధ్య నుంచి చివరి దశలో ప్రారంభమయ్యే ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఈ మార్పులు కొన్నేళ్లపాటు కొనసాగవచ్చు. నెలసరి క్రమం తప్పడం, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు, అకస్మాత్తుగా వేడి ఆవిర్లు రావడం (హాట్ ఫ్లషెస్), రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సున్నితంగా మారుతుంది. దాంతో ముఖం ఎర్రబడటం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు వస్తాయి. ఇవి కొద్ది సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు. కాఫీ, టీ ఎక్కువగా తాగడం, మసాలా ఆహారం, ఒత్తిడి కొందరిలో వీటిని పెంచవచ్చు. వదులైన కాటన్ దుస్తులు ధరించడం, గది చల్లగా ఉండేలా చూసుకోవడం, తగినంత నీరు తాగడం ఉపశమనం కలిగిస్తాయి.
వయసు పెరిగే కొద్దీ జాగ్రత్త!
వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం తగ్గడం, శరీర జీవక్రియ మందగించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవచ్చు. ఈ కొవ్వు గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యల ముప్పును పెంచుతుంది. అందుకే పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలి. పప్పులు, గుడ్లు, పనీర్, చికెన్ వంటి ప్రొటీన్ ఆహారాలను చేర్చుకోవాలి.
చక్కెర పదార్థాలు, మైదా, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వేగంగా నడవడం, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. వారానికి రెండు రోజులు కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు చేయడం మంచిది. రోజుకు 7–8 గంటల నిద్ర, యోగా, ధ్యానం కూడా బరువు నియంత్రణకు తోడ్పడతాయి.
ఎముకల బలానికి భరోసా!
ఎముకల ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ కీలకం. మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్ తగ్గడంతో ఎముకల సాంద్రత క్రమంగా తగ్గి, అవి పెళుసుగా మారవచ్చు. ఈ పరిస్థితినే ఆస్టియోపోరోసిస్ అంటారు. చాలాసార్లు ఎముక విరిగే వరకు స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే ముందస్తు జాగ్రత్తలు అవసరం. పాలు, పెరుగు, ఆకుకూరలు, కాల్షియం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ డి కోసం తగినంత సూర్యరశ్మి పొందాలి.
నడక, బరువుతో చేసే వ్యాయామాలు, కండరాల బలాన్ని పెంచే శిక్షణ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసు, కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుల సూచనతో డెక్సా స్కాన్ చేయించుకోవాలి. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్లు అవసరమైతే వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.
చివరగా.. మహిళల జీవితంలోని ప్రతి దశలోనూ శరీరంలో మార్పులు సహజమే. అయితే వాటిని భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. లక్షణాలను గుర్తించి, సరైన సమయంలో వైద్య సలహా తీసుకుంటే ప్రతి దశనూ ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
ఇదీ చదవండి: పుచ్చిపోయిన పళ్లు మళ్లీ పెరుగుతాయా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం!


