ఫండే
అగడం బగడం
పున్నమి రోజుల్లో పొద్దు గూకితే చాలు, వియత్నాంలోని హోయ్ ఆన్ నగరం రంగురంగుల వెలుగులతో మెరిసిపోతుంటుంది. సాయంత్రం కాగానే వీధివీధినా కనిపించే రంగురంగుల ఆకాశ దీపాలు, నీటిలో తేలియాడుతుండే ఆశల దీపాలు అక్కడ కనువిందు చేస్తుంటాయి.
వందల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, నమ్మకాలు, కళానైపుణ్యాలతో కూడిన ఈ వేడుకను ఇక్కడి ప్రజలు ప్రతినెలా పౌర్ణమి రోజుల్లో సంబరంగా జరుపుకుంటారు. అందుకే ఈ వెలుగుల వేడుకలను చూసేందుకు పౌర్ణమి రోజుల్లో హోయ్ ఆన్ నగరానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు.
వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రాంతంలో ఉన్న హోయ్ ఆన్ ఓ చారిత్రక పట్టణం. ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి ముఖ్యమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. 16, 17 శతాబ్దాల్లో జపాన్, చైనాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేవారు. అలా వారితోపాటు వారి సంస్కృతులు, సంప్రదాయాలను కూడా వెంటబెట్టుకుని వచ్చేవారు.
ముఖ్యంగా చైనా నుంచి వచ్చిన ఫుజియాన్, గ్వాంగ్‌డాంగ్, చావోజౌ ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల ముందు కాగితపు దీపాలను వేలాడదీసేవారు. జపాన్ వ్యాపారులు కూడా వివిధ ఆకారాల్లోని దీపాలను ఇళ్ల ముందు అలంకరించేవారు. వారిని చూసిన స్థానికులు కూడా తమ ఇళ్ల ముందు దీపాలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఈ దీపాలు తమ కుటుంబాలకు అదృష్టం, శ్రేయస్సు తీసుకొస్తాయని నమ్మేవారు. అలా మొదలైన ఈ సంప్రదాయం క్రమంగా హోయ్ ఆన్ సంస్కృతిలో ఒక భాగమైంది. ఈ నగరానికి దీపాల నగరంగా పేరు తెచ్చిపెట్టింది.
ప్రతి నెలా పౌర్ణమి వెలుగుల్లో..
హోయ్ ఆన్ దీపాల పండుగకు ప్రత్యేకమైన తేదీ ఉంటుంది. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలా 14వ రోజున ఈ వేడుక నిర్వహిస్తారు. సూర్యాస్తమయం తర్వాత 6 నుంచి 10 గంటల వరకు నగరమంతా దీపాల వెలుగులతో కళకళలాడుతుంటుంది. అయితే ఈ దీపాల వెనుక కళాకారుల శ్రమ ఎంతగానో ఉంటుంది. చేతి వృత్తుల వారు వీటిని విభిన్న ఆకృతుల్లో నెలల పాటు శ్రమించి తయారుచేస్తుంటారు. మధ్యలో చిన్న ఆధారాన్ని ఏర్పాటు చేసి, సంప్రదాయ పద్ధతిలో కొవ్వొత్తిని అమరుస్తారు. ప్రస్తుతం ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ దీపాలను కూడా ఉపయోగిస్తున్నారు.
నదిలో తేలే దీపాలు.. కోరికల సందేశాలు!
ఈ వేడుకలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే దృశ్యం నదిలో తేలే దీపాలు. చిన్న చిన్న కాగితపు పడవల్లాంటి దీపాలను కొవ్వొత్తులతో వెలిగించి నీటిలో వదులుతారు. ఒక్కో దీపం వెనుక ఒక్కో కోరిక ఉంటుంది. కొందరు ఆరోగ్యం కోసం, మరికొందరు కుటుంబ సంతోషం కోసం, ఇంకొందరు అదృష్టం, ప్రేమ, శాంతి కోసం ప్రార్థిస్తారు. పర్యాటకులు కూడా ఈ సంప్రదాయంలో భాగస్వాములవుతారు. మనసులోని ఆశలను వెలుగుల రూపంలో వ్యక్తం చేసే విలక్షణ సంప్రదాయం ఇది.
సాంస్కృతిక కార్యక్రమాల సందడి..
దీపాల వెలుగులతోపాటు హోయ్ ఆన్ పండుగలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలూ సందడి చేస్తాయి. నదీ తీరంలో వేణువులు, డప్పులు, సంప్రదాయ వాయిద్యాల సంగీతం వినిపిస్తుంది. వీటిలో సాంప్రదాయ జానపద కళారూపం అయినటువంటి ‘బాయి చోయ్’ ప్రత్యేకమైనది. ఈ కళారూపానికి 2017లో యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా లభించింది.
దీపాల వెనుక ఆధ్యాత్మికం
బౌద్ధ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బుద్ధుడు జన్మించిన రోజు, జ్ఞానోదయం పొందిన రోజు కూడా పౌర్ణమి రోజేనని విశ్వసిస్తారు. అందుకే ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. పూర్వం నుంచీ ఆసియా దేశాల్లో పౌర్ణమి రోజున పూజలు, ధ్యానం, పితృదేవతల స్మరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయానికి దీపాల అలంకరణ తోడవడంతో హోయ్ ఆన్ వేడుక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఒకప్పుడు వ్యాపారులు తమ సంస్కృతి, సంప్రదాయాల కోసం ఇళ్ల ముందు వెలిగించిన దీపాలు... నేడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే వేడుకగా మారాయి. తరతరాలుగా వస్తున్న చేతివృత్తులు, స్థానికుల విశ్వాసాలు, కుటుంబ సంప్రదాయాలు ఈ దీపాల రూపంలో నేటికీ కొనసాగుతున్నాయి. హోయ్ ఆన్ వేడుకను అందమైన దృశ్యంగా మాత్రమే చూడలేం. అది ఓ చరిత్ర.. ఓ సంస్కృతి.. ఓ సంప్రదాయం.
- రమా జంబుల
ఇదీ చదవండి: ప్రీతికి ధైర్యం చెప్పిన అభిమన్యు.. చివర్లో అతడినే కుదిపేసిన ఫొటో!


