ప్రీతికి ధైర్యం చెప్పిన అభిమన్యు.. చివర్లో అతడినే కుదిపేసిన ఫొటో! | Inspector Abhimanyu Blackmail Mystery | Sakshi
Sakshi News home page

ప్రీతికి ధైర్యం చెప్పిన అభిమన్యు.. చివర్లో అతడినే కుదిపేసిన ఫొటో!

Nov 22 2026 4:17 AM | Updated on Nov 22 2026 4:17 AM

Inspector Abhimanyu Blackmail Mystery

ఫండే

క్లూషియల్‌

గీతా పాఠశాల వార్షికోత్సవ ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగుతోంది. వేదికపై ఉన్న వక్తలు ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ‘‘ఈరోజు మన ముఖ్య అతిథి ఏ మంత్రీ కాదు, ఏ సినీ సెలబ్రిటీ  కాదు. చట్టాన్ని కాపాడుతూ, మహిళలపై జరిగే అకృత్యాలను ఎదిరించి నిలబడిన నిజమైన హీరో... ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు!’’

అభిమన్యు మైక్‌ అందుకున్నాడు. అతని మాటలు విద్యార్థినులలో ఒక సరికొత్త స్ఫూర్తిని రగిలించాయి. ‘‘మహిళలు ధైర్యంగా ఉండాలి. విద్యార్థినులు ఇప్పటి నుంచే ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే తెగువను అలవరచుకోవాలి.’’ అని ముగించాడు.

ప్రసంగం అనంతరం విద్యార్థినులు ఒక్కొక్కరుగా వచ్చి అభిమన్యుకు గులాబీలు ఇస్తున్నారు. పదవ తరగతి చదువుతున్న ప్రీతి వంతు వచ్చింది. గులాబీ ఇస్తున్న ఆమె చేతులు వణుకుతున్నాయి. ముఖంలో ఏదో తెలియని తీవ్రమైన భయం. అప్పుడే, నిబంధనలకు విరుద్ధంగా ఆమె యూనిఫామ్‌లో ఉన్న మొబైల్‌ మోగింది. భయంతో వణికిపోతూ ఆమె వెంటనే దాన్ని ఆఫ్‌ చేసింది. ఆ క్షణంలో ఆమె కళ్లలో కనిపించిన భయాన్ని అభిమన్యు తీక్షణమైన చూపులు పసిగట్టాయి.
∙∙ 
రాత్రి ఎనిమిది   గంటలు..
ప్రీతి ఇల్లు.
‘‘ఎప్పుడూ చదువులో ఫస్ట్‌ ఉండేదానివి, ఈమధ్య ఎందుకిలా ఉంటున్నావు? గడియ పెట్టుకుని గదిలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు?’’ అంటూ  ‘‘తల్లిదండ్రులు ప్రీతిని మందలిస్తున్నారు.’’
‘‘ఆమె ఎందుకు అలా ఉందో నేను చెబుతాను...’’ అంటూ గుమ్మంలోంచి గంభీరమైన స్వరం.
అభిమన్యు అడుగుపెట్టాడు! అతడిని చూసి ఇంట్లో వాళ్లు థ్రిల్‌ అయ్యారు. 
‘‘మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం సార్‌...’’ అంటూ మర్యాదలు చేయబోయారు. వాళ్లని వారించి ప్రీతి వైపు చూశాడు అభిమన్యు.

‘‘ఈ అన్నయ్యకు కనీసం మంచినీళ్లు అయినా  ఇవ్వవా?’’ అని ఆప్యాయంగా అడిగాడు. ప్రీతి భయంతో ఏడుస్తుంటే... ‘‘ఈ అన్నయ్య నీకోసం ఏం తెచ్చాడో చూడు,’’ అంటూ ఓ కవర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. వణుకుతున్న చేతులతో ఆ కవర్‌ తెరిచి, అందులోని ఫొటోలు చూసిన ప్రీతి ఒక్కసారిగా భోరుమంటూ అభిమన్యుని గట్టిగా హత్తుకుంది. 
‘‘కన్నీళ్లు కాదు... నిన్ను బ్లాక్‌ మెయిల్‌ చేసిన వాడిని కసిదీరా కొట్టాలి,’’ అన్నాడు అభిమన్యు.
అప్పుడే పోలీసులు ముప్పై ఏళ్ల దుర్జన్‌ అనే అగంతకుడిని లాక్కుంటూ లోపలికి వచ్చారు. వాడిని చూడగానే ప్రీతిలో భయం స్థానంలో కోపం కట్టలు తెంచుకుంది. వెళ్లి కసిదీరా వాడి చెంపలు వాయించింది. తల్లిదండ్రులు నివ్వెరపోయారు.
∙∙ 
అభిమన్యు అసలు విషయం చెప్పాడు. ‘‘ప్రీతి బ్రిలియంట్‌ స్టూడెంట్‌. ఆన్‌ లైన్‌ లో ఉన్నప్పుడు పొరపాటున ఈ దుర్జన్‌ పరిచయమయ్యాడు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ భయంతోనే స్కూల్‌కు ఫోన్‌ తీసుకెళ్లింది. నాకు గులాబీ ఇస్తున్నప్పుడు ఆమె చేతులు వణకడం, మొబైల్‌ రింగ్‌ అవ్వగానే ముఖంలో భయం చూసి స్కూల్‌లో విచారించాను. తను ఫస్ట్‌ ర్యాంకర్‌ అని తెలిసింది. వెంటనే ఆమె నంబర్‌ ట్రాక్‌ చేసి, ఈ బ్లాక్‌మెయిలర్‌ గాడిని పట్టుకున్నాం. వీడు ఇలా ఎంతో మందిని బెదిరించాడు. మీలాంటి అమ్మాయిలు చదువులోనే కాదు, ధైర్యంలోనూ ముందుండాలి. అప్పుడే ఇలాంటి వాళ్ల ఆటలు సాగవు!’’ అన్నాడు.

పోలీసులు దుర్జన్‌ ను లాక్కువెళుతున్నారు. బయల్దేరబోతున్న అభిమన్యును ఆపిన ప్రీతి, తన పెరట్లోని గులాబీ మొక్కను తన చున్నీతో కట్టి బహుమతిగా ఇచ్చింది. ‘‘నన్ను క్షమించు అన్నయ్యా... ఈ చెట్టుకు పూచే ప్రతి గులాబీ, నీ చెల్లి ప్రేమతో ఇస్తున్నదే అనుకో,’’ అంది నీళ్లు నిండిన కళ్లతో.
‘‘ప్రతి అమ్మాయి ఇలా  తెగువ చూపించాలి. భయం మీ బలహీనత కాకూడదు. మీరు కూడా గులాబీ లాంటి వారే.  కానీ అవసరమైనప్పుడు గులాబీ ముల్లులా మీ రక్షణ కోసం తిరగబడాలి. ధైర్యాన్ని ప్రదర్శించాలి’’ అన్నాడు అభిమన్యు.
ఆ క్షణం అభిమన్యుకు చెల్లి గుర్తొచ్చింది.
∙∙ 
అర్ధరాత్రి... నిశ్శబ్దంగా ఉన్న గదిలో లాప్‌టాప్‌ స్క్రీన్‌ వెలుతురులో అభిమన్యు ముఖం తీవ్రంగా కనిపిస్తోంది. దుర్జన్‌ మొబైల్‌ డేటాను, బ్లాక్‌మెయిల్‌ ఫొటోలను శాశ్వతంగా తొలగిస్తున్నాడు. ఒక్కొక్క ఫైల్‌ డిలీట్‌ అవుతోంది. కానీ, చివరన ఒక ఫొటో దగ్గర అతని వేళ్లు ఆగిపోయాయి.

ఆ ఫొటో చూడగానే అభిమన్యు చేతులు వణికాయి. ఆ ఒక్క ఫొటోను మాత్రం డిలీట్‌ చేయకుండా ‘సేవ్‌’ బటన్‌ నొక్కాడు. అతని కళ్లు కన్నీళ్లతో తడిబారాయి... కానీ మరుక్షణమే ఆ కన్నీళ్లు ఆవిరైపోయి, కళ్లు అగ్నిగోళాల్లా ఎర్రబడ్డాయి. అసలు ఆ ఫొటోలో ఉన్నది ఎవరు? ఆ బ్లాక్‌మెయిలర్‌ వలలో చిక్కిన ఆ మరొక అమ్మాయికి అభిమన్యుకు ఉన్న సంబంధం ఏమిటి? అభిమన్యు ఆ ఫోటోను సేవ్‌ చేశాడు. ఫొటోకు ‘ది క్లయిమాక్స్‌’?! అని పేరు పెట్టాడు.

- శ్రీసుధామయి

ఇదీ చదవండి: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన కొడుకు.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement