ఫండే
ఈ వారం కథ
‘గాలి తోడుకే పారిజాతాలు రాలుతాయెందుకో...’ వరండాలో పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ నిట్టూర్చాడు రాఘవ. వానతో పోటీబడి ఇంటి ముందు పారిజాత చెట్టు పూలవానను కురిపిస్తుంది. రాలిపోయిన పూలు పరిమళం మరువనితనం గురించి ఆలోచిస్తూ, జ్ఞాపకాలలో కాలం వెనక్కి వెళ్తున్నట్లు అనిపించింది. బయట హోరున గాలివాన కురుస్తున్నా, మేఘాలు గర్జిస్తున్నా రాఘవ భార్య వాణి ఇంట్లో ఉన్నా లేనట్టుగానే ఉంది. వారిద్దరి మధ్య మౌనం గెలిచి సరిగ్గా పదకొండు రోజులయింది.
రాఘవకు మందులు వేసుకునే సమయం అది. వాణి వేగంగా వచ్చి, గ్లాసులో నీళ్ళు తెచ్చి అతని పక్కనే పెట్టి అంతే వేగంగా వెళ్ళింది. అతని ముఖం కూడా చూడలేదు. పక్కగదిలో ఏదో సర్దుతోంది. రాఘవ మందుబిళ్ళను నోట్లో వేసుకుని, తలుపు సందులోంచి అద్దంలో గమనిస్తున్నాడు. పాత గచ్చకాయ నీలం రంగు చీరను జాగ్రత్తగా మడిచి పెట్టెలో పెడుతోంది. ఆమె చివరిసారి వేదికను ఎక్కినప్పుడు కట్టుకున్న చీర అది. అలా వంగి చూస్తూ ఉండగా, హఠాత్తుగా అతనికి కళ్లు తిరిగినట్లవడంతో ముందుకు తూలబోయి కుర్చీని గట్టిగా పట్టుకుని, స్థిమితపడ్డాడు.
సరిగ్గా పదకొండురోజుల క్రితం వాణి పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని తెచ్చి భోజనాల బల్లమీద పెట్టింది. కళ్లద్దాలు వెతుకుతూ కవరును విప్పాడు రాఘవ. నెల రోజుల ప్రత్యేక నాట్య శిక్షణ శిబిరంలో పాల్గొనాలని, చివరిరోజు జరిగే ప్రదర్శనలో సత్యభామ పాత్రను పోషించాలని వాణిని నిర్వాహకులు ఆహ్వానిస్తూ ఉత్తరం పంపారు. అదే విషయం అతను గట్టిగా చదివి వినిపించాడు.
‘‘నా గురించి వాళ్లకు ఎలా తెలిసింది?’’ అడిగింది వాణి. ఆమె కంఠంలో వరద బారిన ప్రాజెక్టు నీళ్ళలా, కళ్ళల్లో ఆనందం ఉప్పొంగుతుంది.
‘‘నీ గురువు సుభద్రమ్మగారు పంపి ఉంటారులే.’’
‘‘ఆవిడకు ఎనభై దాటాయి. ఇంకా నా గురించి గుర్తుందంటావా?’’ అనుమానంగా అడిగింది.
‘‘నువ్వు మరిచిపోయావని అందరూ మరిచిపోతారా!?’’ ఆ మాటకు వాణి అతని ముఖంలోకి చూసింది. కృతజ్ఞత ఆమెలో మొలకెత్తేలోపే రాఘవ ఉత్తరంలోని చివరి పంక్తులను ‘‘నెల రోజులు’’ అన్నాడు.
‘‘వామ్మో! నెలరోజులా?’’ వాణిలో ఆందోళన మొదలైంది.
‘‘అవును. నెల రోజులు’’
‘‘అన్ని రోజులు అక్కడే ఉండాలా?’’ ఇది అయ్యేది కాదని వాణి నీరసపడిపోయింది.
‘‘వసతి కూడా ఇస్తారట.’’ అతని చూపులు ఆహ్వాన పత్రికపై నిలిచిపోయాయి.
ఆరు నెలల కిందట వచ్చిన పక్షవాతం నుంచి రాఘవ దాదాపుగా కోలుకున్నాడు. ఇప్పుడు నడవగలడు. స్నానం చేయగలడు. పుస్తకాలను చదవగలడు. కానీ చొక్కా గుండీలు పెట్టుకునేటప్పుడు ఎడమచేయి ఒక్కోసారి అతని మాట వినదు. రాత్రివేళ ఒంటికి వెళ్ళాల్సివస్తే, మంచం దిగి గోడను పట్టుకుంటాడు. ఆ విషయాలేవీ ఆమెకు చెప్పడు. బయట ప్రకృతిలో అలజడిలా, అతనిలో ఆందోళన మొదలైంది.
‘‘నువ్వేమో, మోకాళ్ళ నొప్పులు అంటున్నావు.’’ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు రాఘవ. వర్షపు మబ్బులకు చంద్రుని వెన్నెల మసకబారినట్టు, ఆ మాటతో వాణి ముఖంలో వెలుగు తగ్గింది.
‘‘నొప్పులున్నా, కాళ్లు అసలే లేకుండా పోలేదు కదా!’’ నిష్టూరమాడింది. బయట ఈదురు గాలికి ఊయల ఊగినట్టు, వారిద్దరిలో ఊగిసలాట మొదలైంది.
‘‘ఇరవై ఆరేళ్ల నుంచి వేదికెక్కలేదు. మళ్లీ గజ్జెలు కట్టుకుని ఈ వయసులో నువ్వు చేయగలవా!?..’’
‘‘అది తెలుసుకోవడానికైనా వేదికను ఎక్కాలి.’’ వాణి గొంతు స్థిరంగా పలికింది. గాలివాన పెరగడంతో ఇంట్లో కరెంటు పోయింది. మౌనానికిప్పుడు చీకటి జత కలిసింది. అప్పుడప్పుడు మెరిసే మెరుపులకు పారిజాతచెట్టు గాలికి ఊగుతూ పూలను రాలుస్తోంది. బలవంతంగా మౌనం మాట్లాడితే, మదిని గాయపరుస్తుందని మేఘాలు గర్జిస్తూ చెబుతున్నాయి. ఆలోచనతో ఆ రాత్రికి నిద్రకరువైంది. పదకొండు రోజులుగా వర్షాకాలం చినుకులు పలకరిస్తున్నా, వాణి నుంచి పలుకు లేదు.
∙∙
పన్నెండో రోజు... సూర్యుడికంటే ముందే లేచిన వాణి స్నానం చేసి, తడి జుట్టును కొప్పుగా చుట్టుకుంది. ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుంది. నుదుటన ఎర్రని బొట్టును పెట్టుకుంది. బీరువా అద్దంలో తనను తాను కాసేపు చూసుకుంది. ఆమె చూపు ఆత్రుతగా గతంలోని ఆమెను వెతుకుంది. బ్యాగులో అన్నీ సర్దుకుంది. ఏదో మరచినట్టు వెతుకుతోంది.
‘‘ఇదిగో, ఇదేనా!?’’ అంటూ రాఘవ చిన్న బ్యాగును ఆమె చేతికిచ్చాడు. ఆ నాట్యానికి సంబంధించిన వస్తువులన్నీ అందులోనే ఉంటాయి. సంతోషంతో బ్యాగును అందుకుంది. తీసుకుంటూ, అతని చేతి వేళ్ళకు నెత్తుటి గాయాలను గమనించింది.
‘‘ఏదీ! చూపించు. ఇప్పుడు తగిలిందా?’’
‘‘ఏమీ లేదు.’’ అన్నాడు రాఘవ. ఆమె అతని చేతిని వదల్లేదు. ‘‘ఏం కాదులే. ఇది నిన్నటి గాయం. నువ్వెళ్ళు.’’ ఏటో చూస్తూ అంటున్న అతడి మాటలకు, వాణి చేతిలో పెట్టెను కింద పెట్టింది. చిన్న బ్యాగును తెరిచి చూసింది. అందులో పాదాలకు కట్టుకునే గజ్జెలను సరిచేసి, దానికి ఎరుపు బట్టను సూదితో కుట్టినట్టు, అవి తళతళా మెరుస్తూ కొత్తగా కనబడుతున్నాయి.
ఒక్కో గంటను జాగ్రత్తగా శుభ్రంగా తుడిచినట్టు, తెగిపోయిన కొక్కెం స్థానంలో కొత్త కొక్కెం అమర్చినట్టు గ్రహించింది. అతని చేతి బొటనవేలు పక్కన సూదులు గుచ్చుకున్నట్టుగా అనేక గాయాలున్నాయి. అతని ఎడమచేతిని తన అరచేతిలోకి తీసుకుంది. మబ్బులు లేవు. వర్షం అందుకోలేదు. ‘‘ఈ పని నువ్వు చేశావా?’’ ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. రాఘవ పారిజాతం చెట్టు పైవైపు చూస్తున్నాడు. అతని మదిని కురవడానికి సిద్ధంగా ఉన్న కారుమబ్బులు కమ్మేశాయి. ‘‘అవును. రాత్రి నిద్రబట్టలేదు. ఏం చేయాలో తెలియక ఆ పని చేశాను. అయినా వాటి తాడు బలహీనంగా ఉంది.’’
‘‘నా మోకాళ్లకంటేనా!?’’ ఆమె మాటలు నిజాయితీగా ఉన్నాయి. ఒకరికొకరు ఓడిపోయినట్టు వారి ముఖం నిర్వేదంతో చిన్నబోయింది. గాలి ప్రేమకు, గర్జించే మేఘం యొక్క కోపం కూడా కరిగి నీరైపోతుంది.
‘‘నన్ను వెళ్లొద్దని ఎందుకు అడగలేదు?’’ వాణి కిందకు చూస్తూ అడిగింది.
‘‘అడిగితే... ఆగిపోతావా?’’
‘‘తెలీదు.’’ అతడి కనుగుడ్లల్లో కన్నీరు నేలపాలవడం ఇష్టంలేనట్టు చిన్నపిల్లాడిలా ఆకాశం వైపుకు చూస్తున్నాడు.
‘‘అందుకే, అడగలేదు. అయినా..!’’ అతడిలో మాటలు పెగల్లేదు. మధ్యలోనే ఆపేశాడు.
‘‘అందుకే నావల్ల కాదని అవమానించావా?’’ వాణి ప్రశ్నకు, రాఘవ జవాబు చెప్పలేదు. దూరంగా ఆటో హారన్ వినిపించింది. వాణి పెట్టె తీసుకొని గుమ్మం దాటింది. ఆటోడ్రైవరు ఎదురొచ్చి సామాను తీసుకెళ్ళి ఆటోలో పెట్టాడు. ఆమె ఆటోలో కూర్చునే ముందు రాఘవవైపు చూసింది. వరండా స్తంభాన్ని కుడిచేత్తో పట్టుకొని, ఆమె వంకే చూస్తూ బేలగా నిలబడ్డాడు. నెత్తుటిగాయంతో ఉన్న ఎడమచేయి స్వాధీనంలో లేనట్టుగా పక్కకు వేళ్లాడుతోంది. అతడి చూపుల్లో కానీ, బుర్రలో కానీ, ‘వాణిని వెళ్లకుండా ఆపాలనే ఆలోచన లేదు. ఆమె వెళ్లిన తరువాత అతన్ని వెక్కిరించే వెలితి భయం కనబడుతోంది.’
‘‘సరే నేను వెళ్ళొస్తా. మీరు జాగ్రత్త. నా ప్రదర్శన వచ్చే నెల మూడో తేదీ’’ అంది.
‘‘హా. ఉత్తరంలో చదివాను.’’
‘‘చదవడం వేరు. గుర్తుపెట్టుకోవడం వేరు.’’ అంటూ ఆటో ఎక్కగానే, ఆటో ఆత్రం ఆగకుండా ముందుకు కదిలింది. వెళ్తున్న ఆటో దగ్గరికి వెళ్ళబోయి, ఒక అడుగును ముందుకు వేశాడు. మళ్ళీ ఏదో గుర్తుకువచ్చినట్టుగా ఆగిపోయాడు. పొగను చిమ్ముతూ వెళ్తున్న ఆటో తాకిడికి ఇంటి బయట పారిజాతం చెట్టు కొమ్మ ఒకటి ఆటో పైకప్పును తాకి, రాఘవ కన్నీళ్ళలా, పువ్వులను జారవిడిచింది. ఆకాశం రోదిస్తూ చినుకులను నేల రాల్చింది.
∙∙
శిక్షణ ముగిసిన ప్రతి సాయంత్రం, గదికి చేరుకోగానే వాణి అద్దం ముందు నిలబడి అలసటతో ఉన్నా తన మొండిపట్టుదలకు తానే నవ్వుకునేది. పాదాలు ఎర్రగా కందిపోతుండేవి. బొబ్బలు చిట్లి రక్తం కారుతూ మంట పుట్టేవి. కళ్లు మూసుకుని కాసేపు గోడను పట్టుకుని ఓర్చుకుంటూ నిలబడిపోయేది. కానీ అద్దంలోకి చూసుకున్నప్పుడు, స్నేహితురాలిలా ఆమె గతాన్ని గుర్తుచేసి ఆమె అలసటను మరిపించేది. అగ్ని పరీక్షకు సిద్ధపడిన పడతిలాగే, వాణి కాలపరీక్షకు నిలబడింది. కాళ్ళలోని నొప్పి కళ్లకు చేరినా, కన్నీటిని వృథా చేయలేదు. గమ్యం గెలిచి తీరాలనే కసి ఆమెలో స్పష్టంగా ఉండేది. ఒకరోజు రాఘవ నుండి మెసేజ్ వచ్చింది.
‘‘ఇంట్లో ఉప్పు ఏ డబ్బాలో ఉందో కనిపెట్టాను.’’ వాణి పెదవుల చివర నవ్వు కదిలింది. బొబ్బకట్టిన తన పాదం చిత్రాన్ని జవాబుగా పంపింది. ఐదు నిమిషాల తరువాత మళ్ళీ అతని నుండి సందేశం వచ్చింది.
‘‘పసుపు రాసుకో. నీ కఠిన సాధనను కొంచెం తగ్గించు.’’
‘‘ఎలా ఉన్నారు? వేళకు తింటున్నారా!?’’ ఆమె టైప్ చేసింది. అతని నుంచి జవాబు రాలేదు. మరుసటి ఉదయం పారిజాతం చెట్టుకింద ఖాళీ కుర్చీ చిత్రం పంపాడు. కుర్చీ చేతిమీద ఒక పువ్వు ఉంది. వాణి ఆ చిత్రాన్ని చాలాసేపు చూసింది. ప్రతిరోజూ ఒక పారిజాత పువ్వును ఆమెకు ఇవ్వడం రాఘవకు అలవాటు.
‘‘మాత్ర వేసుకున్నావా?’’ అడిగింది.
‘‘హా. వేసుకున్నాను.’’
‘‘గుండీలు పెట్టుకున్నావా!?’’ కొంతసేపటికి అతడు చొక్కా వేసుకున్న చిత్రం పంపాడు. పై రెండు గుండీలు ఒక గుండీవద్ద తప్పుగా ఉన్నాయి. ఫోన్ ను గుండెల దగ్గర పెట్టుకొని నవ్వింది వాణి. నవ్వుతూనే కళ్ల మూలల్లో వచ్చిన తడిని చీరకొంగుతో తుడిచింది. ఆ రోజు సాధనలో సత్యభామ కోపాన్ని ఆమె సరికొత్తగా అర్థం చేసుకుంది. ఇంతకాలం భామ కోపంలో తన అందంపై గర్వాన్ని మాత్రమే చూసింది. ఆ గర్వం అడుగున దాగిన భయం ఇప్పుడు ఆమె అభినయంలో కనిపించింది. చూసినవారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ‘ప్రేమలో కూడా కోపం స్వీయశత్రువే.’
సాయంత్రం రాఘవకు ఫోన్ చేసింది. ‘‘తిన్నావా?’’
‘‘హా. తిన్నాను.’’
‘‘ఏం వంట చేసుకున్నారు?’’
‘‘ఏం చేసుకోలేదు. పెరుగుతోనే కానిచ్చేశాను.’’ ఏదో అనబోయి వాణి ఆగింది.
‘‘నువ్వు లేకపోవడంతో ఇల్లు పెద్దదైపోయింది’’ రాఘవ గొంతులో నీరసం ఉంది. ఆ మాటకు వాణి నేలమీద కూలబడింది. ఆమె వీపును గోడకు ఆనించింది. ప్రేమపూర్వకంగా అనే ఆ ఒక్క మాట కోసం ఆమె పదకొండు రోజులు ఎదురుచూసింది.
‘‘ఇల్లు ఎందుకు పెద్దదవుతుంది? నేను వెళ్లినందుకా!?’’ అనడిగింది.
‘‘కాదు. నువ్వు లేనందుకు. వాణి, నీ లోటు ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలిసివస్తోంది.’’ ఫోన్లో కొద్దిసేపు ఇద్దరి ఊపిరి మాత్రమే వినిపించింది. మాటలను మించిన అర్థం పరమార్థం మౌనం వారిద్దరికీ అందజేసింది. రాఘవ గొంతు సవరించుకున్నాడు.
‘‘నువ్వు లేకపోతే ఏం!? ఉండలేనా అనుకున్నాను.’’
‘‘హా..!?’’ వాణి కళ్లుమూసుకుంది. కిటికీ బయట పెద్దేరు నుంచి వచ్చిన గాలి తెరను పైకెత్తింది. వర్షపు తడినేల వాసన ఆమె గదిలోకి చేరింది.
‘‘నువ్వు లేకపోతే ఇక్కడ శూన్యంగా ఉంది వాణి.’’ రాఘవ మాటకు వాణి ఏమీ మాట్లాడలేదు. రాఘవ మాటలను తిరిగి చెప్పడం ఇష్టంలేక వాణి మౌనంగా ఉండిపోయింది. ఈసారి వారి మధ్య మౌనం అడ్డుగోడలా కాకుండా, ప్రేమకు వారధిని నిర్మించింది.
∙∙
ప్రదర్శన రోజు సభామందిరం జనంతో నిండిపోయింది. వేదిక వెనుక వాణి సత్యభామ వేషంలో కూర్చుంది. ముదురు ఎరుపురంగు చీర. ఆకుపచ్చ అంచు. నడుముకు వడ్డాణం. జడలో బంగారు పూలు. నుదుట చంద్రవంక దిద్దుకుంది. కళ్లకు గీసిన కాటుక ఆమె చూపుకు మరింత అందాన్ని తెచ్చింది. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు వయసు పెరిగిన వాణి కనిపించలేదు. ఇరవై ఆరేళ్ల కిందటి నర్తకి కూడా కనిపించలేదు. వారిద్దరి మధ్య నడిచిన కాలంలో ఎన్నో గాయాలను తట్టుకున్న వాణి కొత్తగా కనిపించింది.
ఆమె మోకాళ్లకు నొప్పి ఇంకా ఉంది. పాదాల కింద బొబ్బలున్నాయి. కానీ కళ్లలో దాచుకున్న కసి ఉంది. నిరూపించు కోవాలనే తపన ఉంది. వాణి సమయం రానే వచ్చింది. తెర పైకి లేచింది. వేదికపైకి వాణి ధైర్యంగా ప్రవేశించింది. నాట్యం మొదలైంది. మొదటి రెండు వరుసల్లో అతిథులు, న్యాయ మూర్తులు, పెద్దలు కూర్చున్నారు. ఆమెను వెక్కిరిస్తూ మూడో వరుస చివరి కుర్చీ ఖాళీగా ఉంది. రాఘవ రాలేదు. ఆ నిరుత్సాహం క్షణకాలం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. శరీరాన్ని మొదట కొంచెం జాగ్రత్తగా, తరువాత జ్ఞాపకం నడిపించినట్లు వేగంగా, నృత్యంలో ఆమె పాదాలు నేలతో మునుపటిలా మాట్లాడటం ప్రారంభించాయి.
చేతివేళ్లలో పువ్వులు వికసించాయి. కనుబొమ్మల్లో ప్రశ్నలు ఉద్భవించాయి. పెదవుల చివరన సాధించిన గర్వం నిలిచింది. మెడ తిప్పిన ప్రతిసారీ జడలోని పూలు కంపించాయి. ప్రణయకలహ ఘట్టం మొదలైంది. సత్యభామ కోపంతో ముఖం తిప్పుకునే సందర్భం. వాణి ఎడమవైపు తిరిగింది. సభామందిరం వెనుక తలుపు దగ్గర రాఘవ నిలబడి ఉన్నాడు. తెల్లని చొక్కా పై గుండీలు ఈసారి సరిగ్గానే ఉన్నాయి. భుజాన పాత గోధుమరంగు శాలువా.
కుడిచేతిలో కర్ర. ఎడమచేయి కొద్దిగా వణుకుతోంది. వాణి కుడిపాదం అరమాత్ర ఆలస్యంగా నేలను తాకింది. మృదంగం ముందుకెళ్లింది. ఆమె గజ్జెలు వెనుకపడ్డాయి. ఆమె కళ్ళల్లో కన్నీటి పొర, గొంతులో ఉప్పొంగే ప్రేమ కెరటం ఆమెను నిలువనీయలేదు. అది గమనించిన రాఘవ తన కర్ర చివరను నేలమీద గట్టిగా కొట్టాడు. అతని సైగతో ఆమెలో కొండంత బలం వచ్చింది.
ఆమెకు తాళం దొరికింది. ఆమె కన్నుల కాటుక మధ్య నుంచి వచ్చిన ఆ చూపులో కోపం మిగిలే ఉంది. ప్రేమతో జతకడుతూ అగ్నిపర్వతం లావాలా పొంగుతోంది. రాఘవ పెదవుల మీద చిన్న నవ్వు విరిసింది. వాణి ముఖంలో వెయ్యేనుగుల బలం వచ్చింది. అయినా సత్యభామ అలక ఇంకా మిగిలే ఉంది.
ప్రదర్శన ముగిసేసరికి రాత్రి పదకొండైంది. అందరూ వెళ్లిపోయిన తరువాత రాఘవ అలంకరణ గదిలోకి వచ్చాడు. వాణి అద్దం ముందు కూర్చొని నగలు తీస్తోంది. అద్దంలో ఈసారి అతడిని చూసింది.
‘‘మూడో జతిలో అరమాత్ర వెనకపడ్డావు’’ అన్నాడు.
‘‘నిన్ను చూశాను గదా!?’’ అలక మళ్ళీ మొదలైంది.
‘‘నన్ను చూడటానికి వేదికెక్కావా?’’ రాఘవలో పరిహాసం చిగురించింది.
‘‘ఇన్ని రోజులు చూడకుండా ఉండటానికి ఎక్కాను.’’ ఆ మాటకు రాఘవ కూడా నవ్వాడు. ఈసారి నవ్వు అతని ముఖమంతా పరుచుకుంది. అతడు కుర్చీ పక్కన కూర్చొని జేబులో నుంచి కళ్లద్దాల పెట్టె తీశాడు. ‘‘ఇక్కడ కూడా చదవాలా?’’ వాణి నిష్టూరమాడింది.
‘‘సరేలే ఇది తెరువు.’’ అంటూ దానిని ఆమెకు ఇచ్చాడు. పెట్టె తెరిచింది. దాని లోపల పారిజాతం పువ్వు. ప్రయాణంలో అది వాడిపోయింది. తెల్లని రేకుల అంచులు ముడుచుకున్నాయి. కాడ ఇంకా రంగును కోల్పోలేదు. ‘‘పూలను ఎవరైనా కళ్లద్దాల పెట్టెలో తెస్తారా?’’
‘‘నలిగిపోకుండా పెట్టెలో బెట్టి జాగ్రత్తగా తెచ్చాను.’’ వాణి పువ్వును అరచేతిలోకి తీసుకుని, దానిని అలాగే చూస్తూ ఉండిపోయింది. రాఘవ ఆమె కాలి దగ్గర కూర్చోవడానికి ప్రయత్నించాడు.
‘‘ఏం చేస్తున్నావు?’’
‘‘గజ్జెలు విప్పుతాను. నీ మోకాళ్ళు వంగనీయవు కదా!’’
‘‘నావల్ల కాదన్నావు. నా వయసయి పోయిందని అన్నావు కదా!?’’ భర్తకేసి చూస్తూ సాధించాననే ఆనందంతో అడిగింది
‘‘అవును. నా మాటలు నీ మనసును ఎంతగా గాయపరిచాయో ఇప్పుడే అర్థమవుతోంది వాణీ! ఆ రోజు నీ పాదాల నొప్పి కంటే నా మాటల వల్ల కలిగిన బాధే నీకు ఎక్కువేమో కదా! నన్ను క్షమించు’’ అన్నాడు రాఘవ. ఆ మాటల్లోని నిజాయితీ వాణి హృదయాన్ని తాకింది.
‘‘ఆ మాట ఇంకా గుర్తుందా?’’
‘‘గుర్తుండాల్సినవే ఎక్కువ గుర్తుంటాయి.’’ అతడు కింద కూర్చోలేక ఇబ్బంది పడుతుంటే వాణి కుర్చీ నుంచి దిగి నేలమీద కూర్చుంది. తన కుడికాలిని అతని మోకాలి మీద పెట్టింది. రాఘవ గజ్జెల ముడి విప్పబోయాడు. ఎడమచేయి వణికింది. తాడు వేళ్ల మధ్య నుంచి జారిపోయింది. వాణి తన చేతిని అతని చేతిమీద ఉంచింది.
‘‘నన్ను ఆగిపొమ్మని అడగడానికి అంత భయమెందుకు?’’ అడిగింది. అతడు తలెత్తలేదు.
‘‘నువ్వు ఆగిపోతావేమోనని..’’ బాధగా అన్నాడు. ‘ఆగిపోవడానికి కారణం నువ్వే అంటేనో’ భయం అతన్ని ఆలోచింపజేసింది.
‘‘అడిగితే, ఆగిపోయేదాన్నేమో.’’
‘‘అదే నా భయం. అందుకే అడగలేదు.’’ వాణి అతని తలమీద చేయి వేసింది. అతడి పలుచని జుట్టులో ఆమె చేతివేళ్లు ప్రేమతో కదిలాయి.
‘‘ఈసారి ఇక నేను ఆగదలుచుకోలేదు.’’
‘‘తెలుసు!.’’
‘‘అందుకే వచ్చావా?’’
‘‘అందుకే రాగలిగాను.’’ వారిద్దరి మధ్య వేసిన ముడిలాగే, అతడి చేతుల్లోని ముడి విడిపోయింది. గజ్జెలు ఆమె కాలి నుంచి అతని అరచేతిలోకి జారాయి. వాణి కళ్లద్దాల పెట్టెలోని పారిజాతం పువ్వును తీసి రాఘవ చొక్కా జేబులో పెట్టింది.
‘‘ఇది నీ దగ్గరే ఉంచు’’ అంది.
‘‘కానీ, తెచ్చింది నీకోసం.’’ అయోమయంగా అన్నాడు. ‘‘ఏం పర్లేదు. ఇది నీ దగ్గర ఉంటేనే నా ఉనికిని గుర్తుచేస్తుంది. నా నాట్యం కొనసాగుతుంది. మన మధ్య మౌనం ఓడిపోతుంది.’’
రాఘవ కళ్ళల్లో వెలితి పోయింది. బయట వర్షం మళ్లీ మొదలైంది. సభామందిరం పైకప్పు మీద చినుకులు ఆనందంగా నాట్యం చేస్తూ తాళం వేస్తున్నాయి.
- శీలం భద్రయ్య, నల్లగొండ
ఇదీ చదవండి: చలిలోనూ.. స్టైలిష్‌గా, ఫ్యాషన్‌గా కనిపించాలంటే... ఇలా చేయండి!


