ఒకరు ఇద్దరు కావడానికి ఏడు అడుగులు వేస్తే చాలు!
ఆ ఇద్దరే ముగ్గురు కావాలంటే మాత్రం, ఏడు సముద్రాలు దాటేంత కష్టపడాలి!
కడుపులో బిడ్డ పడిన వెంటనే, బ్యాంకు బ్యాలెన్సుకు పురిటి నొప్పులు!
ఉయ్యాల కొనకముందే ఈఎంఐల ఊగిసలాటలు... అడుగులు పడకముందే భవిష్యత్తు కోసం పొదుపుల పరుగులు!
ముద్దు మాటలు రాకముందే మ్యూజిక్ క్లాసులు... ఆటపాటలు మొదలవకముందే అదనపు తరగతులు... చివరకు చిన్నారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే ఆరాటంతో, అవసర మేదో తెలుసుకునే లోపే, ఏదేదో కొనిపించే మార్కెట్ మాయాజాలం! ఇలా పేరెంట్స్‌గా ప్రమోషన్ రావాలంటే... ఆశలు ప్యాకేజీల్లోనూ, ఖర్చులు వాయిదాల్లోనూ చిక్కుకోవాల్సిందేనా?
బేబీ బాస్!
ఒకప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతుంటే... ఏ నెలలో ఏం తినాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి అన్న విషయాలన్నీ ఇంట్లో ఉండే పెద్దవాళ్లే చెప్పేవారు. కాని, ఇప్పుడు పరిస్థితి మారింది. అందుబాటులో అమ్మమ్మ లేకపోయినా చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. ఒక చిన్న అనుమానం వస్తే చాలు గూగుల్, పేరెంటింగ్ యాప్‌లు, యూట్యూబ్ వీడియోలు, సలహాల కోసం సోషల్ మీడియా చర్చావేదికలు వంటివి ఎన్నో ఉంటున్నాయి.
అయితే, వీటిన్నింటిలోనూ దాదాపు ఇదంతా సహజమైనే ప్రక్రియే... సాధారణమే... అనే మాటలు పొరపాటున కూడా కనిపించవు. ఒకవేళ కనిపించినా, చివరికి ‘మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి’ అనే సూచన మరో ప్రశ్నను పుట్టిస్తుంది.
ఆ ప్రశ్న కాస్తా ఆందోళనగా మారి, ఆసుపత్రి తలుపు తడితే, అక్కడ వెంటనే బిడ్డ కదలిక కాస్త తక్కువగా అనిపించిందా? వెంటనే స్కాన్. బరువు అంచనా కొంచెం తేడాగా ఉందా? మరో స్కాన్ . వైద్య పరీక్షలో చిన్న మార్పు కనిపించిందా? ఇంకో పరీక్ష. ప్రసవ తేదీ దగ్గర పడిందా? చివరి క్షణంలో కూడా ‘అంత సరిగ్గానే ఉందా?’ అంటూ వైద్య పరీక్షల జాబితాను, ఆసుపత్రి సందర్శనలు పెంచుతూనే ఉంటున్నాయి. అలా చివరకు ఈ అనవసరమైన వైద్య పర్యవేక్షణ, బిడ్డ పుట్టడం అనేది సహజ ప్రక్రియను ఒక ‘బేబీ ప్రాజెక్ట్’గా మార్చేస్తుంది.
అత్యా‘ధనికం’
సరైన సమయంలో సరైన వైద్యం అందక ఎంతోమంది తల్లులు, శిశువులు ప్రాణాలు కోల్పోయిన రోజులు గతంలో చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితులను మార్చడంలో ఆధునిక వైద్యం, అత్యాధునిక సాంకేతికత పోషించిన పాత్ర చాలా గొప్పది. ముఖ్యంగా భారత్‌లో ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడం ఒక గొప్ప ఆరోగ్య పురోగతి.
ఇలా అత్యవసర వైద్యం అందుబాటులోకి రావడం, శస్త్రచికిత్సలు, పర్యవేక్షణ పరికరాలు, నిపుణుల సేవలు అందుబాటులో ఉండటం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. అయితే టెక్నాలజీ గొప్పదని ప్రతి సౌకర్యాన్ని, ప్రతి పరీక్షను అవసరమైనదిగా భావించడమే ఇక్కడ అసలైన సమస్య. కేవలం గర్భధారణను మరింత సురక్షితంగా పర్యవేక్షించేందుకు వచ్చిన స్కాన్లు, పరీక్షలు, పర్యవేక్షణ పరికరాలు నిజంగా అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి.
కానీ అవసరానికి మించి పరీక్షలు, తరచూ చేసే స్కాన్లు, అనవసర వైద్య జోక్యాలు మొదలైతే ఖర్చు మాత్రమే కాదు, ఆందోళన కూడా పెరగొచ్చు. ఇలా ప్రాణాలను కాపాడటానికి వచ్చిన ఆధునిక వైద్యం, ప్రతి అవకాశాన్నీ ఒక ఆదాయ వనరుగా మార్చే పనిలో ఎక్కువగా ఉంటోంది.
గూగుల్ గర్భిణి!
ప్రసవం అంటే భయం ఉండటం సహజమే. వైద్యరంగంలో ప్రసవ భయాన్ని ‘టోకోఫోబియా’ అని పిలుస్తారు. తీవ్రమైన భయం ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడితో మాట్లాడటం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. కాని, గర్భధారణలో ప్రతి చిన్న మార్పుకు గూగుల్‌నే ఫ్యామిలీ డాక్టర్‌గా మార్చేసుకుంటున్నారు. ఆ గూగుల్ డాక్టర్ సమాధానాల కంటే ఉన్న అనుమానాలనే మరింత ఎక్కువ చేస్తారు.
ఎందుకంటే ఇంటర్నెట్ ఒకే లక్షణానికి పది రకాల కారణాలను సూచిస్తుంది. అందులో మనకు వర్తించేది ఏదో మాత్రం చెప్పదు! ఒకరు తమ గర్భధారణలో చేసిన పరీక్షలు, తిన్న ఆహారం, తీసుకున్న మందులు, చేసిన స్కాన్లు, ఎదుర్కొన్న ప్రసవ అనుభవం. అన్నింటినీ ఆన్లైన్లో పంచుకుంటే, చూసేవాళ్లు ‘నాకూ ఇదే కావాలి’ అని కోరుకుంటుంటారు. మరోవైపు రోజూ ప్రసవ యాతన గురించి వినే మాటలు, గతంలో ఎదురైన చేదు అనుభవాలు, సోషల్ మీడియాలో కనిపించే క్లిష్టమైన ప్రసూతి కథలు– ఇవన్నీ కలసి ప్రసవంపై భయాన్ని పెంచి ‘ఏదోలా త్వరగా డెలివరీ అయిపోతే చాలు’ అనిపించేలా చేస్తాయి.
ఈ భయంతో కొందరికి ముందుగానే సిజేరియన్ చేయించుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. కాని, గర్భధారణ అనేది రెడీమేడ్ ఫార్ములా కాదు. ఒకరికి అవసరమైన పరీక్ష మరొకరికి అనవసరం. ఒకరికి సురక్షితమైన విధానం ఇంకొకరికి సరిపోకపోవచ్చు. అందుకే, గూగుల్ సమాచారం ఇవ్వొచ్చు; అనుభవాలు చూపించొచ్చు; కాని, తుది నిర్ణయం మాత్రం తీసుకో లేదు.
సౌకర్యవంతమైన ప్రసవం!
గర్భిణికి సౌకర్యవంతమైన వాతావరణం ఉండటం మంచిదే. కాని, ఈ సౌకర్యం వైద్య నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ప్రసూతి వైద్యం చుట్టూ మరో మార్కెట్ కూడా రూపుదిద్దుకుంటోంది. సాధారణ ప్రసూతి గదికి బదులుగా ప్రత్యేక సూట్లు, ప్రత్యేక ఆహార ప్రణాళికలు, ప్రసవానికి ముందు యోగా, ప్రసవం తర్వాత లాక్టేషన్ సలహాలు, ఫిజియోథెరపీ, వ్యక్తిగత సంరక్షణ– ఇలా ఎన్నో వాణిజ్య వనరులు తయారవుతున్నాయి.
దీనిని ఇప్పటికీ చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు కూడా. అలా చాప కింద నీరులా ప్రసూతి వైద్యం చుట్టూ మరో పెద్ద వాణిజ్య ప్రపంచమే విస్తరించింది. మొదట అదనపు సౌకర్యంగా వచ్చిన ఇవన్నీ, క్రమంగా ‘ఇవి లేకపోతే ప్రసవమే జరగదు’ అనిపించే స్థాయికి చేరుకున్నాయి. కాదు చేర్చారు. ముఖ్యంగా బిడ్డ విషయంలో తల్లిదండ్రుల భయం, ఆందోళననే ఆధారంగా చేసుకుని లాభాలను అర్జిస్తున్నారు. అందుకే, ఇక్కడే తల్లిదండ్రులు ఏది అనవసరం, ఏది అవసరం, ఏదీ అత్యవసరం అనే ఈ మూడు విషయాల్లో దాగి ఉన్న స్పష్టతను తెలుసుకోవాలి.
బర్తింగ్ ప్యాకేజీలు..
ప్రసవాన్ని ఒక వైద్య ప్రక్రియగానే కాకుండా, ఒక విలాసవంతమైన వేడుకగా మార్చడంలో కార్పొరేట్ ఆసుపత్రులు సఫలమయ్యాయి. ఐదు నక్షత్రాల హోటళ్లను తలపించే సదుపాయాలతో ఆసుపత్రులు ప్రత్యేక బర్తింగ్ ప్యాకేజీలను విక్రయిస్తున్నాయి.
పుట్టుక కోసం..
⇒ ప్రీమియం బర్తింగ్ సూట్... రోజుకు! రూ.15 వేల నుంచి రూ.60 వేలు...
⇒ యాంటీనేటల్ వెల్నెస్... ముందుగానే! యోగా, కౌన్సెలింగ్, లమాజ్ తరగతులకు రూ.5 వేల నుంచి రూ.20 వేలు..
⇒ ల్యాక్టేషన్ కన్సల్టేషన్ ... ఒక్కో సెషన్ కు! రూ.1,500 నుంచి రూ.5 వేలు...
⇒ స్టెమ్ సెల్ బ్యాంకింగ్... భవిష్యత్తు కోసం! రూ.70 వేల నుంచి రూ.2 లక్షలు...
⇒ మొత్తం బర్తింగ్ ప్యాకేజీ... రూ.1.5 లక్షల నుంచి! ఆసుపత్రి, గది, సదుపాయాలను బట్టి రూ.5 లక్షలకు పైగానే..
పోషణ కోసం
డెలివరీ బిల్లు చూసి షాక్ అయ్యారా? ఆగండి... అంతటితో ఆగిపోలేదు... ఇది ట్రైలర్ మాత్రమే! అసలు సినిమా ముందుంది! బిడ్డ పుట్టింది. ఇక పెంచాలి కూడా కదా!
⇒ డైపర్లు నెలకు రూ.1,500–3,000 పైనే!
⇒ పాలు, బేబీ ఫుడ్ నెలకు రూ.2,000–5,000 పైనే!
⇒ టీకాలు, డాక్టర్ విజిట్లు ఏడాదికి రూ.10,000–30,000 పైనే!
⇒ బేబీ బట్టలు, ఆటబొమ్మలు నెలకు రూ.2,000–5,000 పైనే!
⇒ డేకేర్ / క్రెచ్– నెలకు రూ.5,000–15,000 పైనే!
⇒ ప్లేస్కూల్ తలుపు తెరిచిందంటే... బడ్జెట్ మరో లెవల్‌కి!
⇒ ప్లేస్కూల్– ఏడాదికి రూ.30,000–1లక్ష పైనే!
⇒ స్టేషనరీ సామాన్లు – ఏడాదికి రూ. 10, 000 నుంచి 20,000 పైనే!
⇒ ఆరోగ్యకరమైన ఆహారం– ఏడాదికి రూ. 30,000 నుంచి రూ. లక్ష పైనే!
⇒ ఆరోగ్యం కోసం – ఏడాదికి రూ. 20, 000 నుంచి రూ. లక్షపైనే!
⇒ యాక్టివిటీ క్లాసులు, క్రీడలు, సంగీతం, నైపుణ్య శిక్షణలకు – ఏడాదికి రూ.20,000– 1 లక్ష పైనే!
ఇవన్నీ నగరం, బ్రాండ్, పిల్లల అవసరాల ఆధారంగా ధరలు స్వల్పంగా మారుతాయి. కాని, చిన్నారి పెరుగుతున్న కొద్దీ షాపింగ్ లిస్ట్ కూడా పెరుగుతుంది! చివరకు చిన్నారుల సైజు చిన్నదే అయినా ఖర్చు సైజు మాత్రం పెరుగుతూనే ఉంటుంది!
మంచిరోజు ముఖ్యమేనా?
ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి ఔట్‌పేషెంట్ విభాగంలో ఎనిమిదో నెల గర్భంతో ఉన్న ఒక యువతి తన గైనకాలజిస్ట్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటోంది. అత్యవసర వైద్య పరిస్థితి ఏమీ లేదు, బిడ్డ కూడా బయటకు రావడానికి ఇంకా సమయం ఉంది. కానీ, తన దివంగత తండ్రి జయంతి రోజే బిడ్డ పుట్టాలనేది ఆమె కోరిక! అందుకోసం ఇప్పుడే íసిజేరియన్ చేసి ప్రసవం చేయమని వైద్యురాలిని బతిమాలుతోంది. ఇలాంటి విజ్ఞప్తులు ఇప్పుడు నగరాల్లో అరుదేమీ కావు.
బిడ్డ పుట్టే రోజు ప్రకృతి నిర్ణయించేది. ఇప్పుడది ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించే తేదీ! చాలామంది పుట్టబోయే బిడ్డ శుభముహూర్తంలోనే ఈ లోకంలోకి అడుగుపెట్టాలి, హాలీడే ఉన్నప్పుడే అయితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు ఎంచుకునే జంటల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇందుకోసం డాక్టర్లను సంప్రదిస్తున్నారు.
కొంతమంది డాక్టర్లు కూడా ఇందుకు సహకరిస్తున్నారు. ఇలా బిడ్డ రాకను కూడా క్యాలెండర్లో డేట్ చూసుకొని, ఒక ఫంక్షన్ హాల్లో ఈవెంట్ బుక్ చేస్తున్నట్లు ఆసుపత్రిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ సాధారణ ప్రసవాలు కూడా కాదు. ఇలా ప్లాన్ చేసుకునే ప్రసవాలన్నీ దాదాపు సిజేరియన్ ఆపరేషన్లే... ఇలా తెలిసి తెలిసి మరీ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నారు.
అలాగని సిజేరియన్ ప్రసవాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు, ప్రసవం సురక్షితంగా జరగని పరిస్థితుల్లో సిజేరియన్ నిజంగానే ప్రాణాలు కాపాడే వరం. కానీ అవసరం లేకపోయినా వివిధ కారణాలతో ప్రసవాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడమే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సిజేరియన్ అంటే చిన్న పక్రియ కాదు. ఇదొక పెద్ద శస్త్రచికిత్స! పొత్తికడుపు భాగంలో కోత పెట్టి, చర్మం నుంచి లోపలి ఉండే ఎనిమిది పొరలను చీల్చి గర్భాశయాన్ని తెరిచి బిడ్డను బయటకు తీస్తారు.
వెన్నెముకకు ఇచ్చే మత్తు మందుతో నొప్పి తెలియకుండా చేసినా, ఆ తర్వాత శరీరం మాత్రం ఆ శస్త్రచికిత్సను మరిచిపోదు. సాధారణ ప్రసవంతో పోలిస్తే కోలుకునే సమయం కూడా ఎక్కువే. తర్వాత ఆ నొప్పి, గాయం సంరక్షణ, ఇన్ఫెక్షన్ , అధిక రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఒకసారి సిజేరియన్ జరిగిందంటే తర్వాతి గర్భధారణల్లో ప్లాసెంటా సంబంధిత సమస్యలు, పొట్టపై ఏర్పడే మచ్చకు సంబంధించిన సమస్యలు వంటి కొన్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది.
మరోవైపు 2024లో ‘జర్నల్ ఆఫ్ ది ఫార్మోసన్ మెడికల్ అసోసియేషన్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం సి–సెక్షన్ ద్వారా పుట్టిన పిల్లల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, అలర్జీలు, చిన్నతనంలోనే ఊబకాయం వచ్చే ముప్పు కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వైద్య కారణం లేకుండా 39 వారాల కంటే ముందే చేసే ఎలక్టివ్ సి–సెక్షన్ లో శిశువుకు శ్వాస సంబంధిత ఇబ్బందుల ప్రమాదం పెరుగుతుంది.
అధిక వయసులో గర్భం దాల్చడం, గర్భధారణ మధుమేహం, రక్తపోటు పెరగడం వంటి సమస్యల వల్ల కూడా వైద్యపరంగా సి–సెక్షన్లు చేయాల్సి వస్తోందని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా ప్రసవ పద్ధతిని నిర్ణయించాల్సింది కేవలం వైద్య అవసరాలే తప్ప, సౌకర్యం లేదా వ్యక్తిగత ప్రాధాన్యాలు కాకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అన్నింటికంటే ముందు తల్లి శరీరం ఏం చెబుతోంది? బిడ్డ పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్నలకే ప్రాధాన్యం ఉండాలి. అలా సి–సెక్షన్ ... అవసరమైతే వరం, అవసరం లేకపోతే నరకం! అందుకే, అందరూ గుర్తుంచుకోవాల్సిదేంటంటే ఆరోగ్యంగా పుట్టడమే అసలైన శుభముహూర్తం!
బిడ్డను కనడం ఒక భావోద్వేగం...
బిడ్డను పెంచడం ఒక బాధ్యత...
కానీ, ఈ రోజుల్లో అమ్మానాన్నల అర్హత, ఒక ఖరీదైన వ్యవహారం!
అంకెలు చెప్తున్న నిజం
భారతదేశంలో ప్రసవాల్లో సి సెక్షన్ శాతం ఇప్పటికే గణనీయంగా పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం ఒక గర్భిణికి ప్రసవం సహజంగా సాగే అవకాశం ఉన్నా, వైద్య కారణాలతో పాటు కుటుంబ ఒత్తిడి, ప్రసవ నొప్పి భయం, సౌకర్యం, శుభముహూర్తం వంటి వైద్యేతర కారణాలతో కూడా సి–సెక్షన్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మే, 2026లో విడుదలైన ఆరో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–6, 2023–24) గణాంకాలను చూస్తే ఈ విషయం బాగా అర్థం అవుతుంది.
ఆ వివరాల ప్రకారం..
⇒ దేశంలో జరుగుతున్న ప్రసవాల్లో ఏకంగా 90.6 శాతం ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. ఇది వైద్య సంరక్షణ పరంగా మంచి పరిణామమే.
⇒ అయితే, దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం ప్రసవాల్లో 27.2 శాతం సి–సెక్షన్లు. అంటే ప్రతి నాలుగు ప్రసవాల్లో దాదాపు ఒకటి శస్త్రచికిత్స ద్వారానే జరుగుతున్నట్టన్నమాట.
⇒ ఇక నగరాల సంగతికొస్తే, పట్టణ ప్రాంతాల్లో సి–సెక్షన్ల వాటా 40.5 శాతానికి చేరింది. అంటే ప్రతి పది ప్రసవాలకు నాలుగు సి–సెక్షన్లు ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్తున్న పరిస్థితి!
⇒ ప్రైవేట్ ఆసుపత్రుల్లో సి–సెక్షన్ల రేటు 54.1 శాతం. అంటే అక్కడ ప్రతి రెండు ప్రసవాల్లో ఒకటి కంటే ఎక్కువ సి–సెక్షన్ ద్వారానే జరుగుతున్నాయి.
⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) కూడా సి–సెక్షన్ రేటు విషయంలో ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. సాధారణంగా దేశవ్యాప్తంగా సి–సెక్షన్ల రేటు 10–15 శాతానికి మించి ఉండేది కాదు. కాని, ఇప్పుడు ఆ శాతం రెండు రెట్లు 21. 5 శాతం పెరిగిందని స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్ ప్రసవాలు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లో విడుదల చేసిన వివరాల ప్రకారం, సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే!
⇒ లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతం 43%
⇒ భారతదేశం 27%
⇒ ఉత్తర అమెరికా 32%
⇒ ఉప–సహారా ఆఫ్రికా 5–8%
⇒ 2030 నాటికి ప్రపంచ అంచనా 28.5%
- కొండి దీపిక


