కారులో ఈ 3 గాడ్జెట్లు ఉంటే.. టెన్షనే ఉండదు! | Smart Car Gadgets Accessories | Sakshi
Sakshi News home page

కారులో ఈ 3 గాడ్జెట్లు ఉంటే.. టెన్షనే ఉండదు!

Nov 15 2026 1:40 PM | Updated on Nov 15 2026 1:40 PM

Smart Car Gadgets Accessories

ఫండే

TECH టమారం

కారులో దూసుకెళ్లేటప్పుడు రాయల్‌గా ఉన్నా, దాని బాగోగులు చూసుకోవాలంటేనే అసలు తలనొప్పి మొదలవుతుంది! ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఇంకేదో టెన్షన్‌ ! ఇలా పదేపదే వచ్చే కార్‌ కష్టాలకు స్మార్ట్‌గా చెక్‌ పెట్టే చిట్టి గాడ్జెట్లే ఇవీ!

పోర్టబుల్‌ దుప్పటి!
కారు బయట పార్క్‌ చేశామంటే చాలు... ఎండ ఒకవైపు, దుమ్ము మరోవైపు, వాన వస్తే ఇంకో గొడవ! ప్రతిసారీ కవర్‌ తీసి కప్పడం, మళ్లీ మడిచి పెట్టడం కూడా పెద్ద పనైపోతుంది. అందుకే, ఒక్కసారి ఈ పోర్టబుల్‌ కార్‌ కవర్‌ వాడండి. బాస్కెట్‌బాల్‌ ఆకారంలో ఉండే ఈ చిన్న పరికరంలోనే పూర్తి కార్‌ కవర్‌ చుట్టి ఉంటుంది.

అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసి కారుపై కప్పుకోవచ్చు. దుమ్ము, ఎండలోని యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు, నీటిని కూడా కొంతవరకు తట్టుకుంటుంది. గీతలు పడకుండా కాపాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కవర్‌ను ఉతుక్కుని మళ్లీ వాడుకోవచ్చు. మరో విశేషం ఎంటంటే అత్యవసర సమయంలో చిన్న టెంట్‌లా కూడా ఉపయోగించు కోవచ్చు. ధర రూ.3,000.

ఫోర్‌ ఇన్‌  వన్‌  ఫ్రెండ్‌!
కారు ఉందంటే అందులో ప్రయాణం ఒక్కటే కాదు; దుమ్ము తుడవడం, టైర్లలో గాలి చూసుకోవడం, మధ్యలో బ్యాటరీ మొరాయిస్తే దాన్ని బతిమాలుకోవడం– ఇలా బోలెడు పనులు! ప్రతిదానికీ ఒక్కో పరికరం వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా  చేసేదే ఈ ఎక్స్‌ఈసీహెచ్‌ సూపర్‌వాక్‌. ఇదొక ఫోర్‌ ఇన్‌  వన్‌  కార్‌ ఫ్రెండ్‌ గాడ్జెట్‌! కారులోని దుమ్ము, సీట్ల మధ్య ఇరుక్కున్న చిరుతిళ్ల పొడిని శుభ్రం చేస్తుంది.

టైర్లలో గాలి తగ్గితే 150 పీఎస్‌ఐ డిజిటల్‌ ఇన్‌ ఫ్లేటర్‌తో గాలి నింపుతుంది. బ్యాటరీ డౌన్‌  అయితే అనుకూలమైన 12 వోల్ట్‌ వాహనాలకు 600 యాంప్స్‌ పీక్‌ జంప్‌ స్టార్ట్‌ సదుపాయంతో స్టార్ట్‌ చేయడంలో సాయపడుతుంది. రాత్రి రోడ్డుపై సమస్య ఎదురైతే టార్చ్, రెడ్‌ వార్నింగ్‌ లైట్, ఎస్‌ఓఎస్‌’ మోడ్‌ కూడా ఉన్నాయి. ఇలా కారులో చిన్న గ్యారేజ్‌నే పెట్టుకున్నట్టన్నమాట! యూఎస్‌బీతో రీచార్జ్‌ కూడా చేసుకోవచ్చు. ధర రూ.5,000.

ప్రైవసీకి పర్ఫెక్ట్‌!
కారులో ప్రయాణం చేస్తుంటే చాలాసార్లు ఇబ్బంది పెట్టే విషయం పక్కనున్నవాళ్ల చూపులు! కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలన్నా, పిల్లలకు పాలివ్వాలన్నా కాస్త ప్రైవసీ కావాలి కదా! ఇలాంటి సమయాల్లో ఈ మాగ్నెటిక్‌ కార్‌ విండో కర్టెన్లు బాగా ఉపయోగపడతాయి. కారు వెనుక పక్క కిటికీలకు అయస్కాంతాలతో టక్కున అతికించుకోవచ్చు.

కిటికీల గుండా వచ్చే ఎండ, యూవీ కిరణాలను తగ్గించడంతో పాటు బయటివాళ్లకు లోపల స్పష్టంగా కనిపించకుండా కొంతవరకు ప్రైవసీ కల్పిస్తాయి. గాలి ప్రసరణకు కూడా వీలుంటుంది. అవసరం లేనప్పుడు మడిచి చిన్నగా పెట్టేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి డ్రిల్లింగ్‌ లేదా క్లిష్టమైన సెటప్‌ అవసరం లేదు. అయితే, ఇవి స్టీల్‌ ఫ్రేమ్‌ ఉన్న కిటికీలకే సరిపోతాయి. ధర రూ.700.

ఇదీ చదవండి: మన దేశంలో పుట్టలేదు.. కానీ బొప్పాయి ఉత్పాదనలో భారత్‌ టాప్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement