ఐదేళ్ల అబ్బాయిలు.. ఏడేళ్ల అమ్మాయిలకు జపాన్‌లో వింత వేడుక! | Japan Shichi Go San Childrens Festival | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల అబ్బాయిలు.. ఏడేళ్ల అమ్మాయిలకు జపాన్‌లో వింత వేడుక!

Nov 15 2026 12:16 PM | Updated on Nov 15 2026 12:16 PM

Japan Shichi Go San Childrens Festival

ఫండే

అగడం బగడం

పిల్లలు పుట్టినప్పటి నుంచి కుటుంబంలో వేడుకలు, సంతోషాలు మొదలవుతాయి. వారు ఎదిగే క్రమంలో అడుగులు వేసిన నుంచి పరుగులు పెట్టే వరకూ వచ్చే ప్రతీదీ ఒక మధుర జ్ఞాపకమే, ఆనందమే. అందుకే జపాన్‌లో పిల్లల ఎదుగుదలకు గుర్తుగా సంప్రదాయబద్ధంగా వేడుకను నిర్వహిస్తుంటారు. అదే షిచి–గో–సాన్‌’.

ఈ సంబరంలో వారికి చక్కని ఆరోగ్యం, ఆయుష్షు, సంతోషకరమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తారు. సుమారుగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగను ప్రతి ఏడాది నవంబర్‌ 15న నిర్వహించడం ఆనవాయితీ.

జపనీస్‌ భాషలో ‘షిచి–గో–సాన్‌ ’ అంటే ఏడు, ఐదు, మూడు అని అర్థం. ఈ అంకెలకు వారి సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో వారు మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు కీలక దశలుగా భావిస్తారు. అందుకే పిల్లలకు ఈ వయసు రాగానే వేడుకలు నిర్వహిస్తారు. మొదట్లో చక్రవర్తులు, సమురాయ్‌ వర్గాలకే పరిమితమైన ఈ వేడుక కాలక్రమేణా సామాన్య కుటుంబాలకూ విస్తరించింది.

ఒక్కో వయసుకు ఒక్కో ప్రత్యేకత
సాధారణంగా షిచి–గో–సాన్‌ పండుగను మూడేళ్ల బాలబాలికలు, ఐదేళ్ల బాలురు, ఏడేళ్ల బాలికలకు నిర్వహిస్తారు. ఈ మూడు సంఖ్యలూ బేసి సంఖ్యలు కావడం కూడా శుభసూచకంగా భావిస్తారు. తొలుత పిల్లలు పసితనాన్ని దాటి ఎదుగుతున్నారనే దానికి గుర్తుగా మూడేళ్ల వయసులో నిర్వహిస్తారు.

రెండోదశ ఐదేళ్లు...
ఈ వయసులో అబ్బాయిలకు సంప్రదాయ జపాన్‌  దుస్తులైన ‘హకామా’ తొలిసారిగా వేయిస్తారు. ఇది వారు బాల్యం నుంచి మరో అడుగు ముందుకు వేస్తున్నారనే సంకేతం.

మూడో దశ ఏడేళ్లు...
ఇది అమ్మాయిలకు మాత్రమే జరిపే ప్రత్యేక వేడుక. వారు ధరించే కిమోనోను కట్టుకోవడానికి అప్పటి వరకు ఉపయోగించే తాళ్లకు బదులుగా... ‘ఓబి’ అనే ఓ వెడల్పాటి వస్త్రాన్ని తొలిసారిగా ధరిస్తారు. పెద్దవాళ్ల తరహాలో సంప్రదాయ దుస్తులు ధరించే ఈ వేడుక బాలికలు ఎదుగుతున్నారు అనే దానిని సూచిస్తుంది. ఈ వేడుకల రోజున కుటుంబ సభ్యులంతా కలిసి షింటో ఆలయాలకు వెళ్లి పూజలు చేయిస్తారు.

ఈ మిఠాయి ప్రత్యేకం
‘చిటోసే ఆమే’ అనే మిఠాయి ఈ పండగలో ప్రత్యేక ఆకర్షణ. దీని అర్థం వెయ్యేళ్ల మిఠాయి. బియ్యం, బార్లీతో తయారు చేసే ఈ మిఠాయిని పిల్లలు దీర్ఘకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందిస్తారు. ఈ మిఠాయిని ఎరుపు, తెలుపు రంగుల కవర్లతో ప్యాక్‌ చేస్తారు. వాటిపై కొంగలు, తాబేళ్ల బొమ్మలు ఉంటాయి.

నవంబర్‌ 15నే ఎందుకు?
ప్రతి ఏడాది నవంబర్‌ 15న షిచి–గో–సాన్‌  వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. అయితే వెయ్యేండ్ల చరిత్ర కలిగిన ఈ తేదీ వెనుక పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జపాన్‌  పాలకుడు తోకుగావా సునయోషి తన కుమారుడి ఆరోగ్యం కోసం 1681 నవంబర్‌ 15న ఆలయానికి వెళ్లి ప్రార్థించాడట! ఆ తరువాత అతని ఆరోగ్యం మెరుగుపడిందట! అందుకే ఈ తేదీ పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ప్రార్థించే రోజుగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు.
- కొండి దీపిక

ఇదీ చదవండి: ఆఫీసులోకి ఈగ వచ్చింది.. బిలియనీర్‌ ప్రాణం తీసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement