ఫండే
లీగలాటా
2013 అయ్యింది... 3013
యువర్ అటెన్షన్ ప్లీజ్... మీరు రైలులో ప్రయాణానికి ముందుగానే టికెట్ తీసుకున్నారా? అది ఒరిజనలేనా? మీ ప్రయాణ తేదీ...
సంవత్సరంతో సహా కరెక్టుగా ఉన్నాయా? ఇంతకీ ఎన్నేళ్లు ముందుగా తీసుకున్నారు. 100...500... 1000 ఏళ్లకా? ఇదేంటి? నెలో...
రెండు నెలలో ముందుగా టికెట్ తీసుకుంటారు...
కానీ వెయ్యేళ్ల ముందే ఎవరైనా టికెట్ తీసుకుంటారా? అసలు అన్నాళ్లు బతికి ఉంటారా? అనేగా మీ సందేహం.
అయితే రైల్వే శాఖ ఓ ప్రయాణికుడికి ఏకంగా వెయ్యేళ్ల తర్వాత ప్రయాణానికి ముందుగానే టికెట్ జారీ చేసింది. రెండు నెలలకు మాత్రమే అడ్వాన్స్ టికెట్లు జారీచేసే రైల్వే శాఖ వెయ్యేళ్ల ముందుగా టికెట్ ఎందుకు ఇచ్చింది? ఏం జరిగింది..అదే ఈ వారం లీ‘గలాటా’...
ఉత్తరప్రదేశ్‌కు చెందిన విష్ణుకాంత్ శుక్లా రిటైర్డ్ హిందీ ప్రొఫెసర్.. తన మిత్రుడి భార్య చనిపోవడంతో పలకరించడానికి వెళ్లాలనుకున్నారు. సహారన్ పూర్ నుంచి జౌన్‌పూర్ వరకు రైల్వే బుకింగ్ కౌంటర్‌లో రిజర్వేషన్ టికెట్ తీసుకున్నారు. ప్రయాణ తేదీన రైలు ఎక్కారు..కొంతదూరం ప్రయాణం సాగింది. టికెట్ చెకింగ్‌కు టీటీఈ వచ్చారు. టికెట్ పరిశీలించి ఇది చెల్లదు.. ఈ టికెట్‌తో ప్రయాణం చేయడం కుదరదని చెప్పారు.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది..చివరికి ప్రయాణం మధ్యలోనే ఆ ప్రొఫెసర్‌ను బలవంతంగా రైలునుంచి దింపేశారు. ఈ ఘటనతో ఈ కేసు ప్రయాణం మొదలైంది..తనను అన్యాయంగా రైలు నుంచి దింపేసి మానసిక వేదనకు గురిచేశారని శుక్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. కేసు ఐదేళ్లు నడిచింది. ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం చివరికి తీర్పు వెలువరించింది.
అంకె మారింది.. ప్రయాణం ఆగింది
విష్ణుకాంత్ శుక్లా తాను ప్రయాణించాలనుకున్న తేదీ 19 –11– 2013. అదే రోజు రైలు ఎక్కారు. లక్సర్ వద్ద టీటీఈ ఈ టì కెట్ చూసి దీనిపై 19–11–3013 అని ప్రింటైనందున ఇది చెల్లదని చెప్పారు. ‘నేను రైల్వే కౌంటర్‌లోనే టికెట్ తీసుకున్నాను. ఇందులో నా తప్పిదం ఏమీ లేదు. అది ప్రింటింగ్ పొరపాటు అయి ఉంటుందని చెప్పినా పట్టించుకోలేదు.
నన్ను మురాదాబాద్ వద్ద బలవంతంగా రైలునుంచి దింపేశారు’ అని శుక్లా ఆరోపించారు. దీనిపై రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రైల్వే సిబ్బంది పొరపాటుకు తనను బాధ్యుడ్ని చేస్తూ, తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. తన ప్రయాణం కొన సాగించేందుకు రూ. 800 అడిగారని ఆరోపిస్తూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
ఆ బాధ్యత ప్రయాణికుడిదే..
శుక్లా ఫిర్యాదును స్వీకరించిన వినియోగదారుల ఫోరం విచారణ నిర్వహించింది. రైల్వే శాఖ తన వాదనలు వినిపించింది. సంబంధిత టికెట్‌ను ఎవరైనా ఏజెంట్ దగ్గర తీసుకుని ఉంటారని, వారు నకిలీ టికెట్ ఇచ్చి ఉంటారని వాదించింది. రిజర్వేషన్ చార్టులో కూడా సదరు ప్రయాణికుడి పేరు లేదని పేర్కొంది.
దీనిపై శుక్లా స్పందిస్తూ, తాను రైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్‌లోనే టికెట్ తీసుకున్నానని వివరణ ఇచ్చారు. రిజర్వేషన్ ఫారంపై తన వివరాలు స్పష్టంగా రాశానని చెప్పారు. టికెట్‌పై 3013 అని ప్రింట్ అయితే 2013లో జారీ అయిన చార్ట్‌లో పేరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇది ముమ్మూటికీ రైల్వేశాఖ తప్పిదమేనని పేర్కొన్నారు.
దీంతో రైల్వే శాఖ మరో వాదనను ముందుకు తెచ్చింది. టికెట్‌పై వివరాలను కొనుగోలుదారు పరిశీలించుకోవాలని అది అతని బాధ్యత అని, ఈ సూచన కౌంటర్ వద్ద కూడా స్పష్టంగా ఉంటుందని వాదించింది. శుక్లా పూర్తి చేసి ఇచ్చిన రైల్వే రిజర్వేషన్ ఫారం కావాలని ఫోరం కోరింది. రైల్వే అధికారులు ఆ ఫారం అందుబాటులో లేదని, అందువల్ల సమర్పించలేక పోతున్నామన్నారు.
ఫోరం తీర్పు ఇలా..
ఇరు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం.. టికెట్ తీసుకున్న తర్వాత కొనుగోలుదారు ఆ టికెట్‌ను పరిశీలించలేదనే కారణంగా రైల్వేశాఖ తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదని పేర్కొంది.
ఓ వృద్ధ ప్రయాణికుడ్ని ప్రయాణంలో మధ్యలో బలవంతంగా దింపేయడం సరికాదు. దీనివల్ల అతడు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అభిప్రాయపడింది. రైల్వేశాఖ తప్పిదం వల్ల ప్రయాణికుడి ఇబ్బంది ఎదురైందని ఇది సేవల్లో లోపమే అని పేర్కొంది. టికెట్ డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలి.
మానసిక వేదనకు రూ. 10 వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 3 వేలు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. ‘నేను నకిలీ టికెట్‌పై ప్రయాణించే వ్యక్తిని కాను. నా పొరపాటు లేకపోయినా తోటి ప్రయాణికుల ముందు అవమానకరంగా ప్రవర్తించారు. అన్యాయంగా మధ్యలోనే దింపేశారు. దీంతో నేను న్యాయపోరాటం చేశాను. ఐదేళ్ల పోరాటం తర్వాత వచ్చిన ఈ తీర్పు నాకు సంతోషాన్ని ఇచ్చింద’ని శుక్లా మీడియాకు చెప్పారు.
- దిలీప్ మాదిరెడ్డి
ఇదీ చదవండి: ఓర్నీ! కాలం మన భ్రమేనా?!


