ఫండే
కథాకళి
పదిహేనేళ్ళ నిశిక ఆ పసికందు వంక ఆసక్తిగా చూసింది. ఉయ్యాలలోని వాడు తన కుడికాలి బొటనవేలితో ఆడుతున్నాడు. పక్కింటామె ఓటర్స్ జాబితాలో తమ పేరు నమోదుకి వెళ్తూ, ఓ గంటన్నరసేపు తమ బిడ్డని చూసుకోమని కోరితే నిశిక ఒప్పుకుంది. ఆ బిడ్డ తల్లి బయటికి వెళ్తూ నిశికకి చెప్పింది.
‘‘ఎంత అందగాడో చూడు. జాగ్రత్తగా చూసుకో. వీడు నా ప్రాణం. వీడిని వదిలి వెళ్ళగలిగే తల్లి ఎంత దుర్మార్గురాలో అనిపిస్తోందా? తప్పదు. ఓటు మన హక్కు. పనవగానే వచ్చేస్తాం. పాల సీసాలు ఫ్రిజ్‌లో సిద్ధంగా ఉన్నాయి. మూడు గంటలైనా మేము రాకపోతే ఓ సీసా పట్టు. ఏదైనా అవసరం వస్తే ఈ నంబర్‌కి ఫోన్ చెయ్యి.’’
ప్యాడ్ మీద తన మొబైల్ నంబర్‌ని రాసిచ్చింది. నిశిక తల ఊపింది. ఆమె తన బిడ్డని ఓసారి కౌగలించుకుని వెళ్ళింది. ఆ ప్రేమ నిశికకి తెలుసు. ఆమె కూడా తన పిల్లిని అలాగే కౌగలించుకుంటుంది.
వాళ్ళ కారు వెళ్ళాక ఆమె తలుపు మూసింది. నిశికకి ఆ బిడ్డని చూస్తూంటే రేపు పెళ్ళి అయ్యాక తనకి అలాంటి బిడ్డ పుట్టొచ్చనే ఆలోచన ఆనందాన్ని ఇచ్చింది. తను చేయబోయేది తనకి మనశ్శాంతిని ఇవ్వొచ్చని కూడా అనుకుంది. ఆ బిడ్డ వంక కొద్దిసేపు చూసింది.
ఆమె జంతు ప్రేమికురాలు. ఆమెకి తండ్రి పధ్నాలుగో పుట్టినరోజుకి ఓ ఆడపిల్లిని బహుమతిగా ఇచ్చాడు. నిశికకి ఆ పిల్లే లోకమైంది.
తను కొన్ని వారాలుగా పడే బాధకి ఆ రోజు ఉపశమనం కలగచ్చని నిశిక ఆశపడుతోంది.
నిశికకి మరణం గురించి కొన్ని వారాల క్రితం దాకా తెలీదు. మరణించిన ఆ మూడు జీవాలని చూసే దాకా ఆమెకి మరణం గురించి, అది కలిగించే బాధ గురించి తెలీదు. ఆ బాధలోంచి ఆమెకి తెలీకుండానే ద్వేషం పుట్టి, క్రమంగా అది పెరగసాగింది. ఆమెకి మైగ్రేన్ నొప్పి ఆరంభమైంది.
‘‘నిశికా. బాధపడకు. కొద్ది వారాల తర్వాత అంతా మర్చిపోతావు.’’ ఆమె తల్లి అనేకసార్లు ఆమె మూడ్‌ని గమనించి ఓదార్చింది.
నిశిక ఆ పిల్లవాడి వంక చూసింది. వాడు ఉయ్యాలలో బోర్లాపడి, అడ్డుగా ఉన్న ఊచల్లోంచి చూస్తూ నవ్వాడు. ఎందుకు నవ్వాడు? ఏమాలోచిస్తున్నాడు? అసలు ఈ వయసులో ఆలోచనలు కలుగుతాయా? మెదడు ఈ వయసులో అభివృద్ధి చెందదని సై¯Œ ్స టీచర్ చెప్పింది గుర్తొచ్చింది.
తను అసలు ఆ పనిని చేయగలదా అనే ఆలోచన నిశికకి కలగలేదు. ఏదో జ్ఞాపకంతో ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసలు పెరిగాయి. ఆమె మొహం ఎర్రబడింది. గొంతు దగ్గర నొక్కినట్లుగా అనిపించింది. తన వేళ్ళతో మృదువుగా వాడి మోకాళ్ళ కింది భాగాన్ని నిమిరింది. వాడు తల తిప్పి ఆమె మొహంలోకి చూసి, గుర్తుపట్టినట్లుగా నవ్వుతూ ఏవో అర్థం కాని శబ్దాలు చేశాడు.
నిశిక వేళ్ళు వాడి తల మీది మెత్తటి భాగం మీదకి వెళ్ళాయి. అక్కడ బలంగా నొక్కితే బిడ్డ మరణిస్తాడని ఓ చరిత్ర పుస్తకంలో చదివింది. లంచం తీసుకున్న పనివాళ్ళు రాజ్యానికి వారసులని అలా చంపేవారని అందులో రాశారు. ఆమె వేళ్ళు కొద్దిగా ఆలోచనగా ఆగాయి.
నిశికకి ఆ మూడు పిల్లి కూనలు గుర్తొచ్చాయి.
ఓరోజు స్కూల్ నించి ఇంటికి వచ్చేసరికి తను ప్రేమతో పెంచుకున్న పిల్లి పెట్టిన ఆ మూడు కూనలు ఇంట్లో లేవు. ఇల్లంతా వెతికింది. ఇంటి బయట వెతికింది. పక్కింటి నీళ్ళ తొట్టిలో అవి తేలుతూ కనిపించాయి. అవి అంత పైకి ఎక్కలేవు. ఎవరో కావాలని అందులో ముంచి చంపారు. తమ తోటలోకి పిల్లి వచ్చి మలమూత్రాలతో అశుభ్రం చేస్తోందని అప్పటికే పక్కింటి ఆమె చాలాసార్లు నిశిక తల్లికి ఫిర్యాదు చేసింది. దానికి మరో మూడు పిల్లులు తోడవటంతో ఆమె కావాలని ఆ పని చేసిందని అంతా అనుమానించారు. ఆ ఆరోపణలని ఆమె తోసిపుచ్చింది. ఆ పని చేసినందుకు భర్త ఆమెని తిట్టడం నిశిక అనుకోకుండా విన్నది.
అనుమానం తొలగడంతో అప్పటి నించి పక్కింటి ఆమె మీద నిశికకి మనసు నిండా ఆగ్రహం. తను పడ్డ బాధని ఆమెకి కూడా రుచి చూపించాలని అనుకుంది. అందుకే బేబీ సిటింగ్‌కి ఒప్పుకుంది.
పక్కింటి ఆమె ఫోన్ మోగింది. అది ఆన్సర్ చేసాక భర్తకి చెప్పింది.
‘‘మనం అర్జెంట్‌గా ఇంటికి వెళ్ళాలి.’’
‘‘నిశిక నించా?’’
‘‘అవును. తీవ్రంగా మైగ్రేన్ నొప్పి వచ్చిందని, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పింది.’’
‘‘అయ్యో. ఐతే పిల్లాడి దగ్గర ఎవరు లేరా? ఓటర్ నమోదుకి మరోసారి వద్దాం. పద. పద.’’ అతను కుర్చీలోంచి లేస్తూ చెప్పాడు.
కారు దిగి ఇంటి తలుపు తెరిచిన ఆమె కంగారుగా చెప్పింది.
‘‘పిల్లాడి ఏడుపు కూడా లేదు.’’
ఆమె లోపలికి పరిగెత్తింది. ఉయ్యాల్లోని పిల్లాడు కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆమె వాడిని ఎత్తుకుని హత్తుకుంది. ఆ ఒత్తిడికి వాడు నిద్రలో లేచి గట్టిగా ఏడవసాగాడు. ఎవరో గుర్తించాక క్రమంగా ఆ ఏడుపు తగ్గింది.
తన ఇంటి కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసిన నిశిక అనుకుంది. ‘నా మనసుని ఆ పిల్లాడు తన చిన్న అమాయకపు నవ్వుతో శుభ్రపరిచాడు. నాకు ఇప్పుడెంతో ప్రశాంతంగా ఉంది’ ఆమె చాలాకాలం క్రితం తన తరగతి పుస్తకంలో రాసుకున్న వాక్యాన్ని చదివింది.
‘నిశిక అంటే బాణం అని అర్థం. దీపం అని కూడా’– ‘నేను బాణంలా కాక దీపంలా ప్రకాశిస్తాను’ దాని కింద రాసుకుంది. ఆ తర్వాత ఆమెకి ఎన్నడూ మైగ్రేన్ నొప్పి రాలేదు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి


