ఫండే
లిట్‌వరల్డ్
‘మీగడ తరగలా ఊదారంగు లాలస దట్టంగా ముసిరినప్పుడు;
కాటుక దుబ్బుల్లాంటి కారుమబ్బులు దిట్టంగా కురిసినప్పుడు;
మా ప్రాంగణంలో ఓ మూల చిత్తడి నేల గుండెల్లో ఓ చిక్కుడు గింజ నాటాను;
భూమాత పైట చెంగున మణిమాణిక్యాలు మూటగట్టాను!’
అంటూ పరవశంగా పాడే కవిగారి గొంతు వినగానే ఆయన ప్రకృతి ప్రేమికుడని అర్థమైపోవడంలేదూ? అదే సమయంలో, ఒక్క విత్తనం నాటి, ఆయన ఇంత వర్ణన ఎందుకు చేస్తున్నారో బోధపడడం లేదు కదూ? ఈ మార్మిక భావకవితా ధోరణికే హిందీ సాహిత్యంలో ‘ఛాయావాదం’ అనిపేరు! ఈ కవిత చెప్పినవాడు సుమిత్రానందన్ పంత్. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి హిందీ కవిగా, 1968లో చరిత్ర సృష్టించారాయన.
ఇరవయ్యో శతాబ్ది తొలి దశాబ్దాల్లో హిందీ కవితను ప్రభావితం చేసిన ధోరణి సంఘ సంస్కరణ చైతన్యం. అదే క్రమంగా జాతీయ స్ఫూర్తితో కూడిన చైతన్యానికి జన్మనిచ్చింది. దానికి కొనసాగింపుగా రూపొందినదే ఛాయావాదం. ఛాయావాదానికి నాలుగు స్తంభాలుగా చెప్పుకునే కవులు– జయశంకర్ ‘ప్రసాద్’, సూర్యకాంత్ త్రిపాఠి ‘నిరాలా’, మహాదేవీ వర్మలతో పాటుగా సుమిత్రానందన్ పంత్‌ను కూడా ఛాయావాదులుగా చెప్తుంది హిందీ సాహిత్యచరిత్ర.
సరోజిని నాయుడు ప్రభావం
రమణీయమైన తేయాకు తోటల ఒడిలో కన్నుతెరచిన పంత్, ప్రకృతి ప్రేమికుడిగా మారడంలో వింతేముంది? పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన ఆయన రచనల్లో వ్యక్తికీ– ప్రకృతికీ మధ్య సంబంధం తరచు పునరావృత్తమయ్యే ఇతివృత్తం. పంత్‌ను మొదట్లో ప్రభావితం చేసినదెవరో కాదు– తెలుగింటి కోడలు– ‘భారత కోకిల’ సరోజినీ నాయుడే.
సామాన్య ప్రజల లౌకిక జీవనంలోని రోజువారీ సంఘటనలనే, కవిత్వానికి ముడిసరుకుగా చేసుకునే శిల్పం సరోజిని నుంచే నేర్చుకున్నారు పంత్. అదే సమయంలో, అందమైన భావనకు మేలిముసుగు తొడిగి, పాఠకుల ముందుంచే రవీంద్రుడి శిల్పం పంత్‌ను ఆకర్షింది. క్రమంగా, ఇంగ్లిష్ భావకవుల ప్రభావ పరిధిలోకి ప్రవేశించారు ఆయన. అదే ఆయన్ని ఛాయావాదం వరకూ నడిపించింది.
తొలి సంకలనంతోనే గుర్తింపు
భారతదేశం స్వతంత్రం కావడానికి రెండు దశాబ్దాలకు ముందే, పంత్ కవితావృక్షం తొలి చిగుళ్ళు తొడిగింది. 1926లో విడుదలైన ‘పల్లవ్’ అనే ఆయన తొలి కవితా సంకలనం ఆయనకు ఛాయావాద కవిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో పంత్ ‘హిందీ మాట్లాడే జనం ఒక భాషలో మాట్లాడుతూ, వేరొక భాషలో రాసే దురాచారాన్ని’ ఖండించారు.
తెలుగులో, గ్రాంథిక– వ్యావహారిక వాదుల మధ్య తలెత్తిన వివాదం లాంటిదే హిందీలోనూ– అప్పటికి ఇరవై యేళ్ళుగా– సాగుతూ ఉండేది. వాడుక హిందీ (ఖడీ బోలీ)లోనే, రాయాలని వాదించే పక్షానికి మహావీర్ ప్రసాద్ ద్వివేదీ నేతృత్వం వహించేవారు. పంత్ ఈ పక్షాన్ని బలపరిచినా, ఆయన కవితాశైలి సంస్కృతపద భూయిష్ఠంగా ఉండేదన్నది వాస్తవం. అయితే, పంత్ ఫలానా మార్గానికి చెందినవాడని చెప్పడం ఒకింత సాహసమే! ఎందుకంటే ఆయన చేపట్టని కవితా ధోరణి లేదనే చెప్పొచ్చు.
బతుకుతెరువుకు గేయరూపకాల రచన
1930 దశకంలో పంత్ తన జీవిత సాహిత్యాలపై చేసినన్ని ప్రయోగాలు ఇతరుల్లో కనిపించవనే చెప్పాలి. ఆయన్ని ప్రగాఢంగా ప్రభావితం చేసిన సామాజిక శాస్త్రజ్ఞులు ఇద్దరు– ఒకరు కార్ల్ మార్క్స్ కాగా, మరొకరు మహాత్మ గాంధీ. బతుకుతెరువుకు పంత్ కొంతకాలం ఉదయ్ శంకర్ బృందం కోసం గేయ రూపకాలు రాశారు. మరికొంతకాలం ఆకాశవాణిలోనూ అలాంటి పనే చేశారు.
మార్క్స్– గాంధీలతో పాటుగా, పంత్‌ను ప్రభావితుణ్ణి చేసిన మరో మేధావి అరవిందులు. 1940 దశకం మొదట్లో మూడేళ్లపాటు మద్రాసులో మకాం చేసిన పంత్, కొంతకాలం పాండిచ్చేరిలో అరవిందుల ఆశ్రమంలోనూ ఉండి, వచ్చారు. దేశం స్వతంత్రమవుతున్న వేళ పంత్ అలహాబాద్‌కు తిరిగి వెళ్ళిపోయారు.
ఈ దశ ముగిసేనాటికి పంత్ పాతిక ముప్పై రచనలు చేసి అచ్చు వేసుకున్నారు. వాటిల్లో కొన్ని ఛాయావాద రచనలైతే, మరికొన్ని అభ్యుదయ రచనలు; సోషలిస్ట్ భావాల ప్రచారాన్ని చేసేవి కొన్నైతే, మానవవాదాన్ని ప్రబోధించే రచనలు ఇంకొన్ని. అందుకే, పంత్‌ను ఫలానీ రచనా ధోరణికి నిబద్ధుడైన రచయితగా నిశ్చయించడం కష్టం!
‘కలా ఔర్ బూఢా చాంద్’ అనే కవితా సంకలనానికి 1960లో సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు సుమిత్రానందన్ పంత్. ఆ మరుసటి సంవత్సరమే, ఆయనకు పద్మభూషణ్ దక్కింది. 1968లో పంత్‌కు జ్ఞానపీఠ పురస్కారమూ దక్కింది. పెళ్ళి చేసుకోని పంత్ జీవితమంతా ఆశ్రమవాసిగానే గడిపారు. ఆయనకు ఇతరుల వ్యక్తిగత వివరాలను పట్టించుకునేంత తీరిక కానీ, సొంత విషయాలను పదిమందితో చర్చించే అలవాటు కానీ లేవు.
సామాజిక రాజకీయ సమస్యలపై ఎవరితోనూ గొడవపడే స్వభావం కాదు ఆయనది. ఎనిమిదిమంది తోడబుట్టిన వారిలో కడగొట్టువాడిగా పుట్టి, అమ్మమ్మగారింట పెరిగారు. బతుకు పొద్దువాలిన తర్వాత ఓ అమ్మాయిని పెంచుకున్నారు– ఆమెకి సుమిత అని పేరు పెట్టుకున్నారు. కవిగారి ఆస్తిపాస్తులకూ, రాతప్రతులకూ ఆమెనే వారసురాలిగా ప్రకటించారు!
- మందలపర్తి కిషోర్
ఇదీ చదవండి: నాన్నా... మీ నాన్నను నేను!


