నివాళి
ఆయన విలన్ అంటే విలనే... క్యారెక్టర్ వేస్తే క్యారెక్టరే... కామెడీ చేస్తే కామెడీనే... ఆయనలో హీరో కూడా ఉన్నాడు. అందుకే నటుడిగా అందరివాడయ్యాడు. ప్రేక్షకులతో దశాబ్దాల పాటు సాగిన అనుబంధం ముగిసింది. గిరిబాబుకి నివాళి.
ప్రముఖ నటుడు–దర్శక–నిర్మాత గిరిబాబు కన్నుమూత
ప్రముఖ నటుడు–దర్శకుడు–నిర్మాత యర్రా శేషగిరి రావు (83) ఇక లేరు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారాయన.
‘‘మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో మా నాన్నగారిని ఆస్పత్రికి తరలించాం. అల్జీమర్స్‌తో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. సొంతూరు అంటే నాన్నగారికి ఎంతో మమకారం. అక్కడే తన అంత్య క్రియలు జరగాలన్నది ఆయన చివరి కోరిక. ఆ ప్రకారం రావినూతలలో ఆదివారం అంత్య క్రియలు నిర్వహిస్తాం’’ అని గిరిబాబు కుమారుడు, నటుడు రఘుబాబు తెలిపారు.
1943 జూన్ 8న ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు యర్రా శేషగిరి రావు (గిరిబాబు). చిన్నతనం నుండే గిరిబాబుకు నటన పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. దాంతో ఊళ్లో ఉన్న టూరింగ్ టాకీస్‌లో ఎక్కువగా గడపడంతో అందరూ ‘సినిమా పిచ్చోడు’ అనేవారు. నటనపై మక్కువతో ముందుగా నాటకాల్లో నటించడం ఆరంభించి, ఆ తర్వాత ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లిన గిరిబాబు ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక దశలో విరక్తి చెంది తన సొంత ఊరికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ మద్రాసు చేరుకున్నారు. తొలి సినిమా ‘జగమే మాయ’ (1973) తర్వాత గిరిబాబు కెరీర్‌పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో 650కు పైగా చిత్రాలలో విలన్, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో పాత్రల్లో నటించి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందే గిరిబాబుకి 20 ఏళ్ల వయసులో శ్రీదేవితో వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు కుమారులు (ప్రముఖ నటుడు రఘుబాబు, నటుడు బోసుబాబు), ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య శ్రీదేవి 2016 మే 12న అనారోగ్యంతో మృతి చెందారు. గిరిబాబు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు. అభిమానుల సందర్శనార్థం శనివారం సాయంత్రం గిరిబాబు పార్థివ దేహాన్ని ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఉంచారు. ఆదిశేషగిరి రావు, డి. సురేష్‌బాబు, పోకూరి బాబురావు, మంచు విష్ణు, తనికెళ్ల భరణి తదితర ప్రముఖులు గిరిబాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు తదితర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
1978...
ఎన్.టి.రామారావు ‘సింహబలుడు’ షూటింగ్‌లో ఉంది. గిరిబాబు నిర్మాతగా ‘సింహగర్జన’ మొదలైంది. అప్పటికే ఎన్.టి.ఆర్, కృష్ణల మధ్య గ్యాప్ ఉంది. ‘అల్లూరి సీతారామరాజు’ కథను కృష్ణ తీయడం వల్ల వచ్చిన ఆ గ్యాప్ ‘కురుక్షేత్రం’తో మరింత పెరిగింది. అలాంటి సమయంలో గిరిబాబు తను, కృష్ణ హీరోలుగా ‘సింహగర్జన’ మొదలెట్టడం ఎన్.టి.ఆర్.కు కోపం తెప్పించింది. ఎన్.టి.ఆర్‌కు కోపం వస్తే కృష్ణ ఎదుర్కొనగలరేమోగానీ గిరిబాబు ఎదుర్కొనలేరు. అవసరం కూడా లేదు.
అందుకే గిరిబాబు ఎలాగో ధైర్యం చేసి ఒక ఉదయాన ఎన్.టి.ఆర్. ఇంటికి చేరుకున్నారు. గిరిబాబును చూడగానే ఎన్.టి.ఆర్. అప్రసన్నంగా ‘ఏం ఇలా వచ్చారు’ అన్నారు. ‘‘అన్నగారు... నేను మీ ‘సింహబలుడు’కు పోటీగా నా ‘సింహగర్జన’ తీయడం లేదు. మా కథ వేరే. మల్టీస్టారర్ అయితే ఓపెనింగ్స్ ఉంటాయని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను’’ అని తన సినిమా కథ చెప్పారు. ‘సింహబలుడు’ కథకు ‘సింహగర్జన’ కథకు సంబంధం లేదు. ఎన్.టి.ఆర్‌కు సందేహం పోయింది. ‘ఆల్ ది బెస్ట్’ అన్నారు. ఆగస్టులో మొదట ‘సింహబలుడు’ రెండు వారాలకు ‘సింహగర్జన’ రిలీజ్ అయ్యాయి. ‘సింహగర్జన’ సూపర్ హిట్ అయ్యింది. ఎన్.టి.ఆర్.కు గిరిబాబు సాటిరాడు. అలాగని గిరిబాబుకు సాటి వచ్చేవారూ లేరు.
2007...
తెలుగు సినిమాకు 75 ఏళ్లు. వజ్రోత్సవం. అతిరథ మహారథులతో మూడు రోజుల వేడుకలు. ఆ సమయంలో ‘సెలబ్రిటీ’, ‘లెజెండ్’ అనే వివాదం మొదలైంది. సమస్య నివురు గప్పిన నిప్పయ్యింది. మూడో రోజు మోహన్‌బాబు మైక్ పట్టుకున్నారు. తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎవరు లెజెండ్... ఎవరు సెలబ్రిటీ... ఏం కృష్ణంరాజు లెజెండ్ కాదా... విజయనిర్మల లెజెండ్ కదా... ఆడియన్స్‌లో గిరిబాబు ఉన్నాడు. వాడు (తన స్నేహితుడు కాబట్టి) లెజెండ్ కాదా? వాడు నిర్మాతగా హిట్టు... దర్శకుడుగా హిట్టు... హీరోగా హిట్టు’’.... మోహన్‌బాబు నటుడు, నిర్మాత. దర్శకత్వం చేయలేదు. గిరిబాబు నటుడు, నిర్మాత, సినీ కథకుడు, దర్శకుడు. మోహన్‌బాబుకు గిరిబాబు సాటి వస్తారో రారో... అలాగని గిరిబాబుకు సాటి వచ్చేవారు లేరు.
టూరింగ్ టాకీసులు చాలామంది జీవితాలను పాడు చేశాయి. మెరుపు మెరిపించాయి. ఒంగోలు జిల్లా అద్దంకికి సమీపంలో ఉండే రావినూతల అనే పల్లెలో టూరింగ్ టాకీసు గిరిబాబు జీవితాన్ని మెరిపించింది. ఏ వినోదం లేని ఆ ఊళ్లో టూరింగ్ టాకీసే వినోదం. పైగా గిరిబాబు ఒక్కడే కొడుకు. సాయంత్రమైతే వాళ్లమ్మ పావలా ఇవ్వగలిగేంత కలిగిన కుటుంబం. రోజూ పావలా తీసుకొని సినిమాకు వెళతానంటే పంపే గారం. ‘ధిక్కారము సేతువా’ అని గర్జించే వేమూరి గగ్గయ్య దగ్గరి నుంచి నాగయ్య, నారాయణరావులు హీరోలుగా వేసే సినిమాల వరకూ అన్నీ చూడటమే గిరిబాబు పని. ఆ తర్వాత అక్కినేని, ఎన్.టి.ఆర్. వస్తే అక్కినేనిలా హీరో అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయిన వారిని నమ్మి ఎంకరేజ్ చేసేవాళ్లు తప్పక ఉంటారు.
ఒంగోలులో ఫొటో స్టూడియో నడిపే నాగేశ్వరరావు అనే వ్యక్తికి గిరిబాబు మీద గిరిబాబు కంటే ఎక్కువ నమ్మకం. ‘కొత్త నటులు కావలెను’ అని పేపర్‌లో కనిపిస్తే చాలు తనే ఫొటోలు పంపేవాడు. గిరిబాబును మద్రాసుకు బయల్దేర తీయించేవాడు. ‘ధైర్యే సాహసేలక్ష్మి’, ‘తప్పటడుగులు’, ‘స్వర్గానికి నిచ్చెనలు’... ఇవీ గిరిబాబు హీరోగా మొదలై ఆగిపోయిన సినిమాలు. ప్రతిసారీ రైలెక్కే గిరిబాబు ఈసారి దనియాల లారీ ఎక్కారు. దనియాల శకునం పని చేసింది. ‘జగమే మాయ’ (1973) తొలి సినిమాగా రిలీజైంది. ఆ సినిమాలో నెగెటివ్ రోల్. గిరిబాబుకు పేరు వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి యంగ్ విలన్ దొరికాడు.
విలన్ వేషాలు సీనియర్ ఆర్టిస్టులు వేస్తే ఫైట్లు, అత్యాచారాలు చేయడానికి యంగ్ విలన్లు కావాలి. ఇదొక ఫార్ములా. హిందీలో రంజిత్, శక్తికపూర్‌లు వచ్చాక ఈ ధోరణి విపరీతంగా పెరిగింది. తెలుగులో రావుగోపాలరావో, నాగభూషణమో, సత్యనారాయణో విలన్ అయితే యంగ్ విలన్‌గా మోహన్‌బాబు, గిరిబాబు తప్పక ఉండాలి. విజయనిర్మల, కృష్ణలకు గిరిబాబు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి విజయనిర్మల దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో గిరిబాబు తప్పనిసరి. అలా గిరిబాబు
హీరోయిన్ల పాలిట దుర్మార్గుడిగా, హీరో చెల్లెళ్ల పాలిట యముడిగా తెలుగు తెర మీద సెటిల్ అయ్యాడు.
గిరిబాబుకు చిన్నప్పటి నుంచి న్యూస్‌పేపర్లు పుస్తకాలు చదవడం అలవాటు. అవి చదివినవాళ్లు బాగుపడటం కద్దు. డిటెక్టివ్ పుస్తకాలూ వాటితో పాటు విశ్వనాథ పుస్తకాలూ చదివారు. ఇది డెడ్లీ కాంబినేషన్. ఊళ్లో కుర్రాళ్లను పోగేసి నాటకాలాడిన అనుభవం ఉంది. అందుకే నటుడైన మూడేళ్లకే నిర్మాత, దర్శకుడుగా మారి ‘దేవతలారా దీవించండి’ తీశారు. సినిమాలో దర్శకుడి పేరు కొమ్మినేని అని ఉంటుంది. అది మిత్రుడి పేరు. తన పేరు వేసుకుంటే ఇండస్ట్రీలోని దర్శకులకు కోపం వస్తుందని ఆ పని చేశారు.
‘దేవతరాలా దీవించండి’ చాలా పెద్ద హిట్. బి, సి సెంటర్లలో స్త్రీలు విరగబడి చూశారు. ‘సింహ గర్జన’ సూపర్‌హిట్. సుమన్, భానుచందర్‌లతో ‘మెరుపుదాడి’ తీశారు. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ. ఇదీ హిట్టే. ఇళయరాజా మ్యూజిక్. ‘రణరంగం’ హిట్. కుమారుడు బోసుబాబును పెట్టి ‘ఇంద్రజిత్’ను నిర్మించి రిలీజ్ డేట్ల గేమ్ వల్ల నష్టపోయారు. అది కౌబాయ్ సినిమా. దానికి కొద్దిగా ముందు చిరంజీవి కౌబాయ్ సినిమా ‘కొదమ సింహం’ రిలీజ్ కావడం ఒక కారణం. గిరిబాబు నిర్మాణ సంస్థ పేరు జయభేరి. ఆ తర్వాత తన భాగస్వామి అయిన మురళీమోహన్‌కు ఆ జయభేరి బ్యానర్ వెళ్లింది. రియల్ ఎస్టేట్‌లో జయభేరికి పెద్ద పేరు. అది గిరిబాబు పెట్టిన పేరు.
గిరిబాబు చాలాసార్లు చెప్పే మాట ఏమిటంటే ఇండస్ట్రీని తాను వదులుకోవాలనుకున్నా ఇండస్ట్రీ తనను ఒదులుకోలేదు అని. ఏ సీసాలో అయినా పట్టే మదిరను ఎవరు వదులుకుంటారు? విలన్ కొడుకుగా, అహంభావులైన స్త్రీ పాత్రల తైనాతీగా, స్వార్థపరుడైన అన్నయ్యగా... నటిస్తూ వచ్చిన గిరిబాబు కెరీర్‌ను ‘పెళ్లాం చెప్తే వినాలి’ (1992) మలుపు తిప్పింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాగుబోతు పాత్రలో గిరిబాబు చిచ్చుబుడ్డిలా వెలిగారు. సినిమా పెద్ద హిట్. హఠాత్తుగా గిరిబాబులోని కామిక్ టైమింగ్ సినిమాలకు ప్లస్‌గా మారడం మొదలెట్టింది.
‘చిత్రం భళారే విచిత్రం’లో నరేష్ బాస్‌గా గిరిబాబు కేరెక్టర్ హిట్. ఆ తర్వాత ఇ.వి.వి. సినిమాల్లో గిరిబాబు చెలరేగిపోయారు. శివ నాగేశ్వర రావు దర్శకత్వం వహించిన ‘సిసింద్రీ’లోని ముగ్గురు కామెడీ విలన్లలో గిరిబాబు ఒకరు. ఇవన్నీ ఒకెత్తయితే గిరిబాబును చాలా బాగా ఉపయోగించుకున్న సినిమా ‘నిన్నే పెళ్లాడుతా’. ఈ సినిమాలో ఒంటికొమ్ము శొంటిగాడుగా పెళ్లిపెటాకులు లేని పైలా పచ్చీసు పాత్రను గిరిబాబు చాలా ఆహ్లాదంగా పండించారు. ఆయన కోసం సినిమా చూసిన ఫాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
కాలం గడిచే కొద్దీ తండ్రి, తాత, పెదనాన్న పాత్రలు గిరిబాబు వేస్తూ వెళ్లారు. కొత్త దర్శకులు ఆయనకు పాత్రలు ఇవ్వడం మానలేదు. ‘దేవుడా... కూతురిని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంకును ఇచ్చావా’ అని గిరిబాబు చెప్తే జనం హాయిగా నవ్వారు. గిరిబాబు చివరి వరకూ తన సొంతూరిని వదల్లేదు. తనలోని ఊరిని చెదిరిపోని వ్వలేదు. ఊరి మనిషిలా ఉన్నంతలో సంతోషంగా, హాయిగా బతికారు. కుమారుడు రఘుబాబు ఆర్టిస్ట్‌గా హిట్ అవడం చూసి ఆనందించాడు. కుమారుడితో కలిసి నటించడం తండ్రిగా ఇంకా ఆనందపడే విషయం.
కొందరు నటులకు అభిమాన సంఘాలు ఉండవు. కాని ప్రేక్షకుల హృదయంలో వారి పేరున సంఘం రిజిస్టర్ అయి ఉంటుంది.
అలాంటి లక్షలాది అన్ రిజిస్టర్డ్ అభిమాన సంఘాలు ఉన్న గిరిబాబుకు సాటిరాగలవారు ఎవరైనా ఉన్నారా? సరిగలవారున్నారా?
లేరు... ఓన్లీ గిరిబాబు.
(2019లో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిబాబు)
గతంలో ఎన్నికలప్పుడు చురుకుగా పాల్గొన్నారు. మీకు రాజకీయాలంటే ఆసక్తి ఉందా?
అప్పట్లో ప్రజాసేవ కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మేం అందులో చేరి ప్రచారం చేశాం. బంపర్ మెజారిటీతో గెలిచారు. తర్వాత అరాచక శక్తులు ఆయన్ను కొనసాగనివ్వలేదు. ఆయనతోపాటే 1991లో మేం పార్టీ నుంచి బయటకు వచ్చేశాం. 2004లో అంతటి గొప్ప సంస్కర్త, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం కలిగించిన నేత వైఎస్ రాజశేఖర‡రెడ్డిని కలిశాను. 2009లో ఆయన కోసం ప్రచారం చేశాను. బంపర్ మెజార్టీతో గెలిచారు. ఆయన గతించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీకీ ప్రచారం చేశాను. తర్వాత బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలసి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయన ఆ ఐదేళ్లు ప్రజలను ఇబ్బందులు పెట్టారు. జగన్ 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, జనాల కష్టాలు తెలుసుకున్నారు. దీంతో జగన్ సీఎం అవుతారని, చెప్పినవన్నీ అద్భుతంగా నెరవేరుస్తారనిపించింది. ఎన్నికలకు ముందే టీడీపీకి 20 సీట్లకు మించి రావని చెప్పా. ఈ ఎన్నికలతో దుష్టపరిపాలన అంతమైంది. జగన్ పరిపాలన దేవుడి పరిపాలనలా ఉంటుంది. సీఎం అయి పది రోజులు కూడా కాకముందే హదయాల్ని దోచుకుంటున్నారు. కేంద్రంతోనూ సామరస్యంగా ఉండి, నిధులు తెస్తారు.
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


