కటిక చీకటి ప్రదేశంలో చిక్కుకునే పరిస్థితి ఎదురైతే, ఎంతటి వారికైనా గుండెదడ మొదలవుతుంది. ఇంట్లో కరెంటుపోయి, ఇల్లంతా చీకటిగా మారితే, అగ్గిపెట్టె కోసం వెదుకులాడి కనీసం కొవ్వొత్తినైనా వెలిగించే ప్రయత్నిస్తాం. వీలున్న మార్గాల్లో చీకటిని పారదోలడానికి ప్రయత్నిస్తామే తప్ప గంటల తరబడి చీకట్లోనే గడపడానికి సిద్ధపడం.
అలాంటిది ప్రయోగం కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బయో ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ ప్రొఫెసర్ కీయానా ఆర్రన్ ఏకంగా ఐదు రోజులు కటిక చీకటిలో గడిపారు. ఈ ప్రయోగం కోసం ఆమె పోలండ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న చీకటి గుహలో కళ్లకు గంతలు కట్టుకుని ఐదు రోజులు గడిపారు.
అక్కడ గడిపిన ఐదురోజులూ ఆమె కంటికి ఏమీ కనిపించని పరిస్థితి– ఏమీ వినిపించని పరిస్థితి. కంటికి వెలుగు, చెవులకు శబ్దం వినిపించని చోట ఆ ఐదు రోజుల్లో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను ప్రొఫెసర్ కీయానా ఆర్రన్ మీడియాకు వెల్లడించారు. ‘చీకటి గుహలోకి చేరాక మొదట ధ్యానం చేయడానికి ప్రయత్నించాను. ధ్యానంలో మనసు ఎక్కువసేపు లగ్నం కాలేదు. సమయం గడిచే కొద్ది స్థిమితంగా ఉండటం కష్టంగా మారింది’ ఆమె చెప్పారు.
జ్ఞానేంద్రియాలకు అనుభూతులను దూరం చేసిప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆమె ఈ ప్రయోగం చేశారు. చీకటిలో గడిపిన ఐదు రోజుల్లోనూ ఆమె బీపీ, గుండెలయ వంటి వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వచ్చారు. మొదటిరోజు ఆమె గుండె లయ క్రమం తప్పింది. రెండోరోజు, మూడో రోజు ఆమెకు మానసిక భ్రమలు కలిగాయి. నాలుగో రోజు ఆమెకు ఆహారం అందించేటప్పుడు ఆమె ఘ్రాణశక్తి, రుచిచూసే శక్తి గణనీయంగా పెరిగాయి. రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు ఆమెకు వరుసగా మెలకువలోనే రకరకాల కలలు వచ్చాయి.


