మగవార్‌ని అర్ధం చేసుకుందాం! | Sakshi Funday Special Story on International Mens Day | Sakshi
Sakshi News home page

మగవార్‌ని అర్ధం చేసుకుందాం!

Nov 15 2026 12:03 AM | Updated on Nov 15 2026 1:09 AM

Sakshi Funday Special Story on International Mens Day

భర్తవి కదా... భరించాలంటారు!
నాన్నవి కదా... బాధ్యతలు మోయాలంటారు!
అన్నయ్యవి కదా... అండగా నిలవాలంటారు!
తమ్ముడివి కదా... త్యాగం చేయాలంటారు!
కొడుకువి కదా... కుటుంబం కోసం బతకాలంటారు!
చివరికి అన్నీ చేసినా, ‘నువ్వేం చేశావ్‌?’ అని ఒక్క మాటతో తీసిపారేస్తారు! 
ఈ మాటకు ఏడిస్తే చేతకానివాడు, నవ్వితే సిగ్గులేనివాడు, అలసిపోతే బలహీనుడు.. ఆఖరుకు ఈ బతుకు పోరాటంలో ఓడిపోతే పనికిరానివాడు! మరి, ‘అతనెవరు?’, బాధ్యతల బరువులో తన కలల్ని పాతిపెట్టినవాడు! అందరికీ అన్నీ అవుతూ.. ఎవరూ లేని మనిషి, మగాడు! కాని, ప్రతి మ‘గోడు’కీ  ఓ భాష ఉంది, ఓ విలువ ఉంది!  ఆ మౌనానికి అక్షర రూపం... నవంబర్‌  19న  అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం!

స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా సాధించాలనిపిస్తే ‘ముందు చదువు పూర్తిచెయ్‌... ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు’ అంటారు తల్లిదండ్రులు. సరేనని బాగా చదివితే, వెంటనే ఉద్యోగం తెచ్చుకోమంటారు; ఉద్యోగం వచ్చాక పెళ్లి; ఆ తర్వాత ఇల్లు, పిల్లలు, కుటుంబ బాధ్యతలు! ఇలా ఒక్కో మెట్టు ఎక్కే క్రమంలో తనకంటూ ఉన్న కలలు మాత్రం ఎక్కడో వెనక్కి వెళ్లిపోతాయి. చిన్నప్పుడు క్రికెటర్‌ కావాలని కలలు కన్నవాడు– ఆఫీసులో నాలుగు అట్టల మధ్య ఉద్యోగిగా స్థిరపడతాడు.

సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నవాడు– నెలవారీ జీతం, ఈఎంఐల లెక్కల్లో మునిగిపోతాడు. బైక్‌పై దేశమంతా తిరగాలనుకున్నవాడు– పిల్లల స్కూల్‌ సెలవుల కోసం ఎదురుచూస్తుంటాడు. సంగీతం నేర్చుకోవాలని, విదేశాలు చూడాలని, సముద్రంలో స్కూబా డైవింగ్‌ చేయాలని, కొండల మధ్య క్యాంపింగ్‌ చేయాలని, ఇష్టమైన కారు కొనాలని, తనకిష్టమైన పని చేయాలని– ఇలా ఎన్నో కోరికలు మనసులోనే ఉండిపోతాయి. ‘ఇవన్నీ ఎప్పటికైనా చేస్తా’ అని తనకు తానే మాటిచ్చుకుంటాడు.

కానీ ఆ ఎప్పుడనేది మాత్రం ఎప్పుడూ రాదు! బాధ్యతల మధ్య బతుకుతూ తన కలలకూ ఓ చిన్న చోటు ఇవ్వాలనుకోవడమే ప్రతి మగాడి పెద్ద కోరిక కాని, అది ఎప్పుడూ బకెట్‌ లిస్ట్‌గా, కార్టులోనే ఉంటుంది. అతి కొద్దిమంది మాత్రమే దాన్ని పూర్తిచేయగలుగుతున్నారు.

మీసం మెలేసినా... మనసు మెత్తనే!
మగాడంటే కుటుంబానికి పెద్ద దిక్కు; సంపాదనకు చిరునామా; బాధ్యతలకు ప్రతిరూపం! కానీ ఇప్పటి మగాడి కథ అంత సింపుల్‌గా లేదు. ఉదయం అద్దం ముందు అందంలో హీరో– ఆఫీసులో అడుగుపెడితే బాధ్యతల బాస్‌. జిమ్‌లో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌– ఇంట్లో అడుగుపెడితే వంటింటి అసిస్టెంట్‌! పిల్లలతో ఆడుకునేటప్పుడు కోప్లేయర్‌.

నెలాఖరులో బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే మాత్రం తత్త్వవేత్త! ఇలా బయటకు గంభీరంగా కనిపించే ఈ మనిషి లోపల ఎన్నో భావోద్వేగాలు దాగున్నాయి. ఫ్యాషన్‌ నుంచి ఫిట్‌నెస్‌ వరకు; ప్రేమ నుంచి పేరెంటింగ్‌ వరకు; సంపాదన నుంచి సొంత కలల వరకు; ఒకటేమిటి? మగాడిలోనూ ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. మరి ఆ మల్టీటాలెంటెడ్‌ మిస్టర్‌ ప్రపంచాన్ని 360 డిగ్రీల్లో చూస్తే, అందులో దాగిన ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? అవే ఇవీ!

అందగాడు!
మగాళ్ల షాపింగ్‌ అంటే చాలావరకు రెండు జతల ప్యాంట్లు, నాలుగు చొక్కాలు, ఓ జత చెప్పులు! అంతే, వాటిని కూడా ప్రత్యేకంగా వెతికి వెతికి పది షాపులు తిరిగే పని లేకుండా, ఒకే షాపు, ఒకే దర్జీతో డిజైన్‌ చేయించుకునే వాడు. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ఏ సందర్భానికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఏ రంగు చొక్కాకు ఏ రంగు ప్యాంటు సరిపోతుంది? ఏ షూస్‌తో లుక్‌ అదిరిపోతుంది? ఇలా మగాళ్ల ఫ్యాషన్‌ ఆలోచనలు కూడా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి.

గడ్డానికి ప్రత్యేక కేర్, జుట్టుకు ప్రత్యేక స్టయిల్, ముఖానికి ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్‌– ఇలా ఈ మధ్య బ్యూటీ షాపులలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ సమయం గడుపుతున్నారు! అయితే ఇందులో తప్పేముంది? అందంగా, శుభ్రంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలను కోవడం ఎవరికైనా సహజమేనని ఇప్పుడిప్పుడే తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు.

ఆరోగ్యవంతుడు!
సోషల్‌ మీడియాలో సిక్స్‌ ప్యాక్‌లు చూసి జిమ్‌లో చేరేవాళ్లు కొందరైతే, డాక్టర్‌ చెప్పే భవిష్యత్‌ అనారోగ్య సమస్యలకు భయపడి ఫిట్‌నెస్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెడుతున్నారు! తెల్లవారుజామునే లేచి వాకింగ్, సైక్లింగ్, యోగా అంటూ రోజును చురుగ్గా మొదలుపెడుతున్నారు. నిజానికి ఆరోగ్యం విషయంలో మగాళ్లకు ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. కాని, ఇప్పటì కే ఆరోగ్యంగా, హుషారుగా ఉండాలనే ఆలోచనతోనూ చాలామంది చెమటోడుస్తున్నారు.

ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, నిద్రకు ప్రాధాన్యమివ్వడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంపైనా శ్రద్ధ పెరుగుతోంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ప్రొస్టేట్‌ సమస్యలపై అప్రమత్తంగా ఉంటున్నారు. అబ్బాయిలు కూడా సిక్స్‌ప్యాక్‌ కంటే హెల్త్‌ ప్యాక్‌ ఉంటేనే జీవితంలో అసలైన సక్సెస్‌గా పరిగణిస్తున్నారు.

అసలైన అధికారి!
ఉదయం అలారం మోగినప్పటి నుంచి రాత్రి కళ్లు మూసుకునే వరకు ఒక మగాడి పనుల జాబితాకు మాత్రం బ్రేకులుండవు! ఆఫీసులో లక్ష్యాలు, గడువులు, సమావేశాలు ఇంట్లో బిల్లులు, పిల్లల స్కూల్‌ పనులు, కుటుంబ అవసరాలు! ఉద్యోగంలో ప్రమోషన్  రావాలి, జీతం పెరగాలి, కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి– ఇలా అంచనాలకు అంతే ఉండదు.

ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత తనదేనని భావిస్తుంటాడు. ఈ క్రమంలో కెరీర్, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కోసం పరుగులు తీస్తూ, ఒక్కోసారి ఒత్తిడికి బానిసైపోతుంటాడు. అయితే, ఇప్పుడిప్పుడే చాలామంది ఈ పరుగుకు బ్రేకులు వేస్తున్నారు. పనిని పంచుకోవడం, అవసరమైనప్పుడు ‘నో’ చెప్పడం, తమకంటూ కొంత సమయం కేటాయించుకోవడం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే, తన జీవితానికి కూడా తానే కదా అసలైన అధికారి!

వంటింట్లోనూ వీరుడే!
నలభీమ పాకం ఎంత ప్రసిద్ధి చెందినా, వంటింటి బాధ్యతల నుంచి చాలాకాలం నుంచి చాలామంది ఎలా తప్పించుకున్నారో ఏమో! కానీ ఇప్పుడు మళ్లీ ఆ పాకశాస్త్ర వైభవం తిరిగొస్తోంది. ఒకప్పుడు వంటింటి వైపు కన్నెత్తి చూడని అబ్బాయిలే ఇప్పుడు గరిటె పట్టి తమ పాకప్రతిభను చాటుతున్నారు. ఇంట్లో అమ్మకు, భార్యకు సాయం చేయడం దగ్గర మొదలైన ఈ ప్రయాణం ఏకంగా షెఫ్‌లుగా, రెస్టారెంట్‌ నిర్వాహకులుగా, ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే వరకు సాగుతోంది.

కొందరైతే వంటనే కెరీర్‌గా ఎంచుకుని పేరు, ఆదాయం రెండూ సంపాదిస్తున్నారు. ఇక ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకోవడం, గోరుముద్దలు తినిపించడం, డైపర్లు మార్చటంతో పాటు ఇంటి పనులు పంచుకుంటున్నారు. ఒకప్పుడు వంటింటి నుంచి తప్పించుకున్న అబ్బాయిలే ఇప్పుడు అదే వంటింట్లో రుచులతో మ్యాజిక్‌ చేస్తున్నారు. నలభీముల వారసులమని నిరూపిస్తున్నారు!

ప్రేమలోనూ పార్ట్‌నరే!
ప్రేమలో ఉన్నప్పుడు గంటల తరబడి ఫోన్లు మాట్లాడే అతను– పెళ్లయ్యాక అసలు పట్టించుకోవడం లేదనేది చాలామంది భాగస్వాముల ఫిర్యాదు! కానీ కెరీర్‌లో ఎదగాలి, మంచి స్థాయికి చేరుకోవాలి, కుటుంబానికి అన్ని సౌకర్యాలూ కల్పించాలనే లక్ష్యంతో మగాడు ఉరుకులు పరుగులు పెడుతుంటాడు. ఉదయం ఆఫీసుకు వెళ్తే రాత్రికి కానీ ఇంటికి రాడు. వచ్చినా ఫోన్  కాల్స్, ల్యాప్‌టాప్, మరుసటి రోజు పనుల ఆలోచనలే! కుటుంబం కోసమే ఇంత కష్టపడుతున్నానని అతను అనుకుంటాడు.

కానీ రోజులో జరిగిన సంగతులు పంచుకోవాలని, కాసేపు మనసు విప్పి మాట్లాడాలని ఎదురుచూసే భాగస్వామి మాత్రం ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. ఈ కెరీర్‌ మారథాన్ లో సంపాదన ఎంత ముఖ్యమో, బంధానికి సమయం కేటాయించడమూ అంతే ముఖ్యం. అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఫోన్  పక్కనపెట్టి ఆమెతో కబుర్లు చెప్పడం, ఓ కప్పు టీ చేసి ఇవ్వడం, అలసిపోయినప్పుడు ఇంటి పనుల్లో చేయూతనివ్వడం, చెప్పకుండానే బాధ్యతలు పంచుకోవడం ద్వారా ప్రేమను చూపిస్తున్నాడు.

జీతం జాడ ఉండదు!
ప్రస్తుత రోజుల్లో మగాడి ఆర్థిక బాధ్యతలు మరింత పెరిగాయి. ఇంటి రుణం, కారు ఈఎంఐ, పిల్లల చదువులు, తల్లిదండ్రుల అవసరాలు, తన భవిష్యత్తు– ఇలా ఒక్క జీతంతో ఎన్నో పడవలు నడపాల్సి వస్తోంది. కొందరికి భాగస్వామి సహాయం చేసినా, ప్రస్తుత కనీస ఖర్చులు కూడా ఆకాశాన్ని దాటిపోయాయి.  పైగా ఆన్ లైన్  షాపింగ్, క్రెడిట్‌ కార్డులు, ‘ఇప్పుడే కొనండి... తర్వాత చెల్లించండి’ అనే సౌకర్యాలు ఖర్చులకు కొత్త దారులు తెరిచాయి.

అందుకే ఇప్పటి మగాళ్లు డబ్బు విషయంలో కాస్త తెలివిగా అడుగులు వేస్తున్నారు. నెలవారీ బడ్జెట్‌ తయారు చేసుకోవడం, అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం, అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెట్టుబడులపై అవగాహన పెంచుకుంటున్నారు. అవసరమైతే ఆర్థిక సలహాదారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని తెలివిగా నిర్వహించడం కూడా ఒక కళే!

బాధ్యతల మధ్య బిందాస్‌ లైఫ్‌!
పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో ట్రిప్పులు, అర్ధరాత్రి సినిమాలు, వీకెండ్‌ పార్టీలు– పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక మాత్రం ప్రతి ప్లాన్ కూ కుటుంబ క్యాలెండర్‌ అనుమతి తప్పనిసరి! అయినా సరే, తనకంటూ కొంత సమయం కేటాయించుకోవడం మర్చిపోవడం లేదు నేటి మగాడు. సరదాలు కాలంతో పాటు రూపం మార్చుకుంటున్నాయే తప్ప తగ్గడం లేదు.

కొందరు స్నేహితులతో లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్తే, మరికొందరు కుటుంబంతో కొత్త ప్రదేశాలు చుట్టేస్తారు. ఇంకొందరికి ఒంటరిగా బైక్‌ రైడ్‌ చేయడం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం ఇష్టం.

మరికొందరు గేమింగ్, ఫొటోగ్రఫీ, క్రికెట్, తోటపని అంటూ తమకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఎవరి ఆనందం వారిది, ఎవరి ఇష్టం వారిది! తమ సరదాల కోసం కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

నవ్వు వెనుక నిశ్శబ్దం!
‘మగాళ్లు ఏడవకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి!’ చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు వింటూ పెరిగేవాళ్లు చాలామందే! ఫలితంగా బాధొచ్చినా ‘ఏం లేదు’ అంటాడు. ఒత్తిడి పెరిగినా ‘బాగానే ఉన్నా’ అని నవ్వేస్తాడు. కుటుంబం ముందు ధైర్యంగా, స్నేహితుల ముందు సరదాగా, ఆఫీసులో ఆత్మవిశ్వాసంతో కనిపించేందుకు ప్రతిసారి ప్రయత్నిస్తాడు.

కానీ మనసులోని మాట మాత్రం మనసులోనే ఉండిపోతుంది. అయితే, ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది. తమ భావాలను పంచుకోవడం, సమస్యల గురించి మాట్లాడటం, అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడంలోనూ, తన తప్పులను అంగీకరించడంలోనూ మగాళ్లు వెనకడుగు వేయడం లేదు. ఇవన్నీ కూడా నిజమైన బలానికి గుర్తులే!

మగాడిగా జీవించలేం!
మగాడిగా పుడితే జీవితంలో స్వేచ్ఛ ఎక్కువ, కష్టాలు తక్కువా? అనే ఈ సందేహానికి సమాధానం వెతుకుతూ అమెరికన్  జర్నలిస్టు నోరా విన్సెంట్‌ ఏకంగా మగవేషం వేసుకుంది. ముఖానికి గడ్డం అతికించుకుని, గొంతు, నడక, మాటతీరు మార్చుకుని ‘నెడ్‌’గా మారిపోయింది. అలా పద్దెనిమిది నెలలపాటు పురుషుల బౌలింగ్‌ క్లబ్, థెరపీ గ్రూపుల్లో తిరుగుతూ, డేటింగ్‌ చేస్తూ మగవాళ్ల ప్రపంచాన్ని దగ్గరగా చూసింది.

బయటికి కనిపించే స్వేచ్ఛ వెనుక ఒంటరితనం, బాధలను బయటపెట్టుకోలేని పరిస్థితులు, సమాజం పెట్టే అంచనాలు ఉన్నాయని గుర్తించింది. ఈ అనుభవాలనే ‘సెల్ఫ్‌ మేడ్‌ మ్యాన్ ’ పుస్తకంగా రాసింది. అయితే మరో వ్యక్తిలా నిరంతరం నటించాల్సిన ఒత్తిడిని తట్టుకోలేక రెండేళ్ల ప్రయోగాన్ని 18 నెలలకే ముగించింది. 2022లో వైద్య సహాయంతో మరణించిన నోరా కథ మగవాళ్ల నవ్వుల వెనుక కూడా కన్నీళ్లు దాగి ఉంటాయని నిరూపించింది.

అధ్యయనాల సంగతులివి!
మగాడి జీవితం బయటికి కనిపించినంత సులభం కాదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం పురుషులు మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మహిళలతో పోలిస్తే సహాయం కోరడానికి తక్కువగా ముందుకొస్తున్నారు. స్వతంత్రంగా ఉండాలనే ఒత్తిడి, భావాలను బయటపెట్టడంలో సంకోచం ఇందుకు ప్రధాన కారణాలు.

ఇక 2024లో ‘అమెరికన్  జర్నల్‌ ఆఫ్‌ మెన్స్‌ హెల్త్‌’లో ప్రచురితమైన సమీక్ష 13 అధ్యయనాలను పరిశీలించి, సంప్రదాయ పురుషత్వ భావనలు పురుషుల్లో ఒంటరితనాన్ని పెంచుతాయని గుర్తించింది. స్నేహితులతో క్రికెట్, సినిమాలు, సరదా కబుర్లు ఉన్నా, మనసులోని బాధను పంచుకునే తోడు మాత్రం కొందరికి ఉండకపోవచ్చు.

అందుకే సమస్య వచ్చినప్పుడు సహాయం కోరడం కంటే ‘నేనే చూసుకుంటాలే!’ అంటూ లోలోపలే సతమతమవుతుంటారు. అయితే ఈ పరిస్థితి అందరిలోనూ ఒకేలా ఉండదు. మొత్తానికి అధ్యయనాలు చెప్పేదొక్కటే! మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛను చాలామంది పురుషులు ఇంకా తీసుకోవటం లేదు.

వయసుతో మారే ప్రాధాన్యాలు!
వయసు పెరిగేకొద్దీ మగాడి ఆలోచనలు, ప్రాధాన్యాలు కూడా మారిపోతుంటాయి. ఒకప్పుడు స్నేహితులతో అర్ధరాత్రి వరకు తిరగడమే సరదా; ఇప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా గడపడమే ఆనందం. ఒకప్పుడు తెల్ల వెంట్రుక కనిపిస్తే కంగారు; ఇప్పుడు వాటినే సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ స్టయిల్‌ అంటూ హుందాగా చూపించాలనుకుంటున్నాడు.

కెరీర్, సంపాదన, బాధ్యతల వెంట పరుగెత్తినవాడు; క్రమంగా ఆరోగ్యం, నిద్ర, వ్యాయామం, ఇష్టమైన హాబీలకు సమయం కేటాయించడం నేర్చుకుంటున్నాడు. ఇదే కదా పరిపక్వత అంటే! వయసు పెరగడం అంటే యవ్వనం తగ్గిపోవడం కాదు, జీవితాన్ని చూసే చూపు మారడం.

మీసం ఉన్నా లేకపోయినా, సిక్స్‌ ప్యాక్‌ ఉన్నా లేకపోయినా, సూటు వేసుకున్నా, లుంగీ కట్టుకున్నా, ఎవరైనా ఒక మనిషిగా మంచిగా ఉండటమే ముఖ్యం. ఈ మెన్స్ డే సందర్భంగా ప్రతి మగాడు ఒక్కటే గుర్తు చేసుకోవాలి. అందరిలాగే ఎవరి కోసం వారు జీవించండం స్వార్థేమేమీ కాదు, అది మానవ హక్కు! 

  • కొండి దీపిక   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement