breaking news
International Mens Days
-
International Mens Day: మార్కెట్లో మగసిరులు
అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్లో సిరులు కురిపిస్తున్నాయి.అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.నవతరం కొత్తపోకడలుతర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్‌టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్‌టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు. ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు. శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్‌వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధశరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్లైన్లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్లైన్లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సౌందర్య చరిత్రపురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు. గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్‌లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి. స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీమహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
పక్కా జెంటిల్మన్ ఎలా ఉండాలో తెలుసా!.. అదే జెంటిల్‌నెస్..
జెంటిల్మన్ అనగా ఎవరు? కొండను పిండి చేసి ఆ పిండితో వేడివేడి రొట్టెలు తయారుచేసేవారా? సూపర్‌మెన్‌లా గాలిలో ఎగిరి దూకేవాళ్లా? కానే కాదు అంటుంది ప్రముఖ మెన్స్ గ్రూమింగ్ బ్రాండ్ ‘ది మ్యాన్ కంపెనీ’. జెంటిల్మన్ ఎక్కడి నుంచైనా రావచ్చు...దేశాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు ఏవీ అడ్డుకావు అంటుంది. ‘మెన్స్ డే’ను పురస్కరించుకొని ‘తుమి తో హో’ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఆకట్టుకునే వీడియోను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ...భాషల్లో యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఇంతకీ జెంటిల్మన్ ఎవరు? ఎవరైతే నిరాశావాదాన్ని చెంతకు రానివ్వరో, ఎవరైతే నిత్యసంతోషంతో వెన్నెల నవ్వులతో వెలిగిపోతారో, ఎవరైతే మంచిని చెలిమి చేసుకుంటారో, సమాజానికి మంచి చేస్తారో, ఎవరైతే కొండంత ఆత్మవిశ్వాసంతో ఉట్టిపడతారో, కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలుస్తారో...వారే జెంటిల్మన్. 2019 ‘మెన్స్ డే’ సందర్భంగా వచ్చిన ‘జెంటిల్మన్ కైసే కెహ్తే హై’కు ఈ క్యాంపెయిన్ కొనసాగింపు. ‘మనం రోజూ ఎంతోమంది జెంటిల్మన్లను చూస్తుంటాం. ఎందుకోగానీ వారి జెంటిల్‌నెస్ మనకు కనిపించదు. వారి అంతర్, బహిర్ సౌందర్యాన్ని కవిత, పాటల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది’ అంటుంది మ్యాన్ కంపెనీ. అంతే కదా మరీ! చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati


