నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
‘నీకేంట్రా మగమహారాజువి’.... ఇది పాత మాట. ఇవాళ పురుషుడు తనను తాను పురుషుడని తలుచుకుంటేనే చుట్టుముట్టే సవాళ్లతో ఒత్తిడికి లోనవుతున్నాడు. మూర్ఖంగా, మొండిబలంతో ఉండే పురుషునికి రోజులు చెల్లిపోయాయి. ఇవాళ సంఘ మర్యాదలు, చట్టాలు, సామాజిక మార్పులు... పురుషుణ్ణి ఆచి తూచి అడుగేసేలా
చేస్తున్నాయి. మొర పెట్టుకునేందుకు మనిషి లేని ఒంటరివాణ్ణి చేస్తున్నాయి. నేటి పురుషుడు ఎదుర్కొంటున్నపది సవాళ్లు...
ఆధునిక జీవనవిధానంలో మగవారి కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. అవి గమనింపుకు రాకుండానే మరుగున పడుతున్నాయి. బయటకు చెప్పుకోలేక, సమస్యలకు పరిష్కారం వెతుక్కోలేక వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు, సమాజం అన్ని సమూహాలను గుర్తించి, వారి సమస్యలు ఏమిటా అని చూస్తుందిగానీ పురుషుల్ని ఒక సమూహంగా చూసి వారి సమస్యలు ఏమిటా అని చూడటం జరగదు. అందువల్ల పురుషులు సతమతమవుతున్నారు. కొందరు డిప్రెషన్ లోకి వెళ్లి పోయి, ఆత్మహత్యల వరకూ వెళుతున్నారు.
నేటి పురుషుడి ఎదుర్కొనే 10 సవాళ్లు ఏమిటి?
⇒ ఉద్యోగం పురుష లక్షణం
ఇది పురుషుణ్ణి వదలని, వెంటాడే లక్షణం. చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరక్క పోతే ఇంటా బయటా మగవారికి అవమానాలు తప్పడం లేదు. ఇప్పటి తల్లిదండ్రులు ఇన్‌టర్న్‌గా చేస్తూనే లక్షకు పైగా జీతం సంపాదించాలని కూడా అంటున్నారు. ఇది ఎంత ఒత్తిడి! ఆసక్తుల కోసం విరామం తీసుకున్నా, సొంతగా ఏదైనా చేయాలన్నా ప్రోత్సహించక ‘ఉద్యోగంలో పడితే’ అనే ధోరణి మగాణ్ణి వెంటాడుతూ ఉంది. దాంతో అతను ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు కత్తిమీద సాములా ఉన్నా కుటుంబం, సమాజం ‘సర్దుకుని చేస్తూ ఉండు’ అనడం మగాడికి ఎప్పటికీ ఒక సవాలు.
⇒ పెళ్లెప్పుడు?
పెళ్లి చేసుకోకుండా ఉండే ఆప్షన్ ఈ సమాజంలో స్త్రీ, పురుషులకు ఇంకా పూర్తిగా రాలేదు. స్త్రీలకు పెళ్లి కాలేదంటే ఏవైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయనుకుంటారుగానీ పురుషుడు పెళ్లి చేసుకోక పోతే ‘ఏదో లోపం ఉంది’ అనే ప్రచారం ఎదుర్కొనాలి. తల్లిదండ్రులు పెళ్లి కాని అబ్బాయిలను చూసి తీవ్ర ఆందోళనలో ఉంటున్నారు. అబ్బాయి పెళ్లి గురించి ప్రశ్నలు అడగని పౌర మర్యాద ఒక్కటే ఈ పరిస్థితి నుంచి పురుషుణ్ణి బయట పడేయగలదు.
⇒ విఫల ప్రేమ
మగవారి మెదళ్లలో ఈ కెమికల్ రియాక్షన్ గురించి ఆది నుంచి ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి. జూలియట్, మజ్నూ, దేవదాసు... ఈ విఫల ప్రేమికుల మానసిక ధోరణి మగవారికి నేటికీ ఉంది. ఒక వేళ ప్రేమలో వంచింపబడితే తమను తాము తిరిగి నిలబెట్టుకోవడం వారికి నరకంగా మారుతోంది. ఇలాంటివి మామూలే అని చెప్పక సాహిత్యం, సినిమాలు విఫల ప్రేమికుల ఆరాధనను మరింత పెంచుతున్నాయ్. ఇందువల్ల కొందరు ఆత్మహత్యలకు, కొందరు హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే, మరికొందరు దురలవాట్లకు బానిసలుగా మారుతున్నారు.
⇒ కెరీర్‌లో పరుగులు
అదే ఉద్యోగంలో రిటైర్ అయితే మగవాణ్ణి ఇంట్లో కూడా గౌరవించడం లేదు. ఉద్యోగం రావడంతో పని అయి పోదు. ఆ ఉద్యోగంలో ఉన్నతి సాధించాలి. అప్పుడే కెరీర్ ముందుకు సాగుతున్నట్లు లెక్క. ఈ లెక్కల్లో మగవారికి పరుగులు తప్పటం లేదు. కాస్తంత దారితప్పినా తోటివారు వీరిని దాటేస్తున్నారు. భయం ఆవరిస్తుంది. నిరాశ చుట్టుముడుతుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
⇒ ఇంటి బాధ్యతలు
కొడుకంటే ఇంటికి వారసుడని, అన్ని బాధ్యతలూ చూసుకోవాలనుకునే సంస్కృతి మనది. తోబుట్టువుల చదువులు, పెళ్లిళ్లు, వారి మంచీచెడూ, బంధువులతో సత్సంబంధాలు, సమాజంలో కుటుంబానికి గౌరవం తెచ్చే వ్యవహారాలు... అన్నీ కలిపి మగవారిపై భారాన్ని పెంచుతున్నాయి. ఎన్ని చేసినా ఇంకా మరేదో చేయాలన్న మాట వస్తుండటం వారిని కలవరపెడుతుంది. దీంతో వారు మానసికంగా కుంగి పోతున్నారు.
⇒ వయసు మీరాక పెళ్లి
చాలామంది కెరీర్‌లో స్థిరపడి, సొంత ఇల్లు, కారు సమకూర్చుకున్నాకే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో ఉంటున్నారు. దాంతో వారి వయసు ముప్పై దాటేస్తుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా మగవారిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఊడుతున్న జుట్టు, ముదురుతున్న వయసు వారిని మరింత కంగారు పెడుతున్నాయి. దీంతో పెళ్లి మీదే కొందరు విరక్తి చెందుతున్నారు.
⇒ ఆలస్యంగా పిల్లల బాధ్యతలు
ఇటీవల కాలంలో ఆలస్యంగా పిల్లలు కలగడం కూడా మగవారిని మానసిక ఇబ్బందులకు గురిచేస్తోంది. బిడ్డ పుట్టడం వారికి సంతోషకరమైన విషయమే అయినా, ఆ తర్వాత జరిగే పరిణామాలు, పని ఒత్తిడి వారిని ఒంటరిని చేస్తున్నాయి. ఖర్చులు పెరగడం, ఇంట్లో పని పెరగడం, నిద్ర తగ్గడం, అందరికీ అన్నీ సమకూర్చడంతోనే అతను అలసి పోతున్నాడు. ఈ క్రమంలో కొందరు డిప్రెషన్ కి లోనవుతున్నారు.
⇒ వివాహబంధంలో సమస్యలు
జీవిత భాగస్వామితో సమస్యలు మగవారిని వేధిస్తున్న మరో సమస్య. ఇద్దరూ ఉద్యోగులైన చోట ఈ ఇబ్బంది మరింత తీవ్రమవుతోంది. ఉన్న కొద్దిపాటి సమయాన్ని తమ బంధం కోసం ఎలా వెచ్చించాలో తెలియక మగవారు సతమతమవుతున్నారు. అటు ఆఫీసు పని, ఇటు ఇంటి బాధ్యతలతో తలమునకలవుతున్నారు. దీంతో భార్యతో గొడవలు వస్తున్నాయి. ఈ క్రమంలో సమస్యను వారి కోణం నుంచి పరిశీలించేవారు కరువయ్యారు.
⇒ శారీరక సమస్యలు
ఒకప్పుడు 50 దాటాక బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేవి. ప్రస్తుతం 30 దాటుతూనే ఈ సమస్యలు వేధిస్తున్నాయి. వేళాపాళా లేని తిండి, నిద్రలేమి, హడావిడి, టెన్షన్ తదితర కారణాలతో శారీరక సమస్యలు తెచ్చుకుంటున్నారు. 50కి ముందే తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సమస్యలు వేధిస్తున్నా పని చేయక తప్పని పరిస్థితుల్లో తీవ్రంగా కుంగి పోతున్నారు.
⇒ మానసికంగా ఒంటరితనం
నగర జీవనంలో మగవారిని అధికంగా వేధిస్తున్న సమస్య మానసిక ఒంటరితనం. చుట్టూ అందరూ ఉన్నా తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. చెప్తే తనను చిన్నచూపు చూస్తారేమో, తన గురించి చెడు ప్రచారం చేస్తారేమో అన్న భయంతో అన్ని విషయాలు లోపలే దాచుకుంటున్నారు. మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఇది వారిలో నిరాశను
నింపుతోంది.
నవంబర్ కాదు మోవంబర్!
నవంబర్ నెలలో మీసాలను పెంచే కార్యక్రమమే... మోవంబర్.
ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్‌లో మీసాలకు సంక్షిప్త నామం... మో. దీనికి నవంబర్ నెలను జత చేసి ‘మోవంబర్’ ను సృష్టించారు. ‘మోవంబర్’ సరదా కార్యక్రమేమీ కాదు. దీనికి సామాజిక ప్రయోజనం ఉంది. పురుషుల ఆరోగ్య సమస్యలైన ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడం, పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం... మొదలైనవి ‘మోవంబర్’ లో భాగం.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ కేంద్రంగా మోవంబర్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
పురుషులు విజయం సాధించడానికే పుడతారు.
ఓడి పోవడానికి కాదు. –హెన్రీ డేవిడ్ థోరో, కవి, తత్వవేత్త
అతడి హృదయం సముద్రంలాంటిది.
అందులో తుఫానులు ఉంటాయి.
ఆటు పోట్లు ఉంటాయి.
దాని లోతుల్లో ముత్యాలు కూడా ఉంటాయి.
– విన్సెంట్ వాన్ గోహ్, చిత్రకారుడు
వన్స్ అపాన్ ఏ టైమ్
⇒ పురుష పాఠకులను దృష్టిలో పెట్టుకొని లండన్ కేంద్రంగా జనవరి 1731లో ‘ది జెంటిల్‌మ్యాన్స్’ మ్యాగజైన్ మొదలైంది. ‘మ్యాగజైన్’ అనే మాటను తొలిసారిగా ఉపయోగించిన పత్రిక ఇది.
⇒ స్త్రీ పాత్రలు లేని సినిమాలను ఊహించడం కష్టం. అయితే గతంలోకి వెళితే... కేవలం పురుషులు మాత్రమే నటించిన హాలీవుడ్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక సినిమా... 12 యంగ్రీ మెన్. ‘లైఫ్ ఈజ్ ఇన్ దెయిర్ హ్యాండ్స్,...డెత్ ఈజ్ ఆన్ దెయిర్ మైండ్స్’ కాప్షన్‌తో 1957లో విడుదలైంది.
మ్యాన్ ఆఫ్ ది వరల్డ్
గత సంవత్సరం ఫిలిప్పీన్స్‌లో జరిగిన ‘మ్యాన్ ఆఫ్ ది వరల్డ్’ పోటీలో ‘ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్’ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా వేద్ ప్రత్యేకత నిలుపుకున్నాడు. పుణేకు చెందిన వేద్ మన జాతీయ పక్షి నెమలిని స్ఫూర్తిగా తీసుకుని కాస్ట్యూమ్ డిజైన్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని అతడి క్యాట్‌వాక్ ఫుటేజ్ 19 మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో వైరల్ అయింది.
తల్లికి తనయుడిగా... భార్యకు భర్తగా...
చెల్లికి అన్నగా... అక్కకు తమ్ముడిగా...
బిడ్డకు తండ్రిగా.. కుటుంబానికి గొడుగుగా..
చెలిమికి తోడుగా.. స్నేహానికి వారధిగా
అన్నింటా తానే అయి
కొవ్వొత్తిలా కరిగి పోతూ
సమాజానికి వెలుగులా
తనను తాను సమర్పించుకునే పురుషోత్తములకు అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.


