‘‘ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి.
ఇరాన్‌లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్ స్టెప్ గురించి ది టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది.
86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్‌తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది.
ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.
అలాంటి ఇలాంటి సంక్షోభం కాదు
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్‌లో డాలర్‌కు 42 వేల రియాల్‌కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్‌లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అంతర్జాతీయ ప్రతిస్పందన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.
బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.
ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్‌పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
ఖమేనీ పాలన
ప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్‌లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.


