ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి రోడ్లెక్కారు. శనివారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో అనేక విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. గత నెలలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భద్రతా దళాల అణిచివేత కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ ఆందోళన చేపట్టారు.
టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అయతుల్లా అలీ ఖమేనీని " అత్యంత క్రూరమైన నాయకుడు" అని అభివర్ణిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా ఇరాన్ మాజీ రాజు షా కుమారుడు రెజా పహ్లావిని కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరడం చర్చానీయాంశమైంది.
ఈ నేపథ్యంలో పలు క్యాంపస్‌లలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులైన 'బసీజ్' (Basij) విద్యార్థి విభాగాలకు మధ్య పలు చోట్ల వాగ్వాదం జరిగింది. టెహ్రాన్‌లోని అమీర్ కబీర్, షాహిద్ బెహెష్టి యూనివర్సిటీలతో పాటు ఈశాన్య ప్రాంతంలోని మషద్ యూనివర్సిటీలో కూడా నిరసనలు జరిగాయి. కాగా 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత, ఇరాన్ ప్రభుత్వం ఇంతటి భారీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. ఇరాన్ భద్రతా బలగాలు అణిచివేతలో వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.


