సాధారణంగా వామపక్ష, కమ్యూనిస్టు భావజాలం కలిగిన దేశాల్లో దైవచింతన అంతగా ఉండదని అందరూ అనుకుంటారు. అయితే వెనెజువెలా దేశం విషయంలో ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ దేశాధినేతలు ఒకవైపు తమ వామపక్ష రాజకీయ సిద్ధాంతాలను కొనసాగిస్తూనే, మరోవైపు పుట్టపర్తి సత్యసాయి బాబాపై తమ అపారమైన భక్తిని చాటడం విశేషంగా మారింది.
ప్రశాంతి నిలయంలో రోడ్రిగ్జ్
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మహిళా నేత రోడ్రిగ్జ్ కూడా సత్యసాయి బాబా భక్తురాలే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా నిలిచింది. ఆమె 2024లో ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో గల ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబాపై ఆమెకున్న భక్తి, ఆధ్యాత్మిక అనుబంధం ఈ పర్యటన ద్వారా వెల్లడయ్యింది.
మదురో కార్యాలయంలో సత్యసాయి ఫొటో
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సత్యసాయి బాబాకు పరమ భక్తుడన్న విషయం కూడా ఇటీవలే విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఆయన కేవలం భక్తుడిగానే కాకుండా, తన అధికారిక కార్యాలయంలో కూడా బాబా ఫోటోను పెట్టుకుంటారు. 2005లో మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తిని సందర్శించి, బాబా ఆశీస్సులు అందుకున్నారు.
‘ఆయన ఆధ్యాత్మిక గురువు’
మదురో తన పుట్టపర్తి పర్యటన సమయంలో సత్యసాయి బాబాను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, గొప్ప మానవతావాదిగా పేర్కొన్నారు. సత్యసాయి బోధనలు తన జీవితంపై, ఆలోచనా దృక్పథంపై ఎంతో ప్రభావం చూపాయని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మదురో రాజకీయాలకు అతీతంగా సత్యసాయి మార్గాన్ని అనుసరిస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
చావెజ్ నాయకత్వంలో..
వెనెజువెలా పాలకుల్లో ఈ ఆధ్యాత్మిక చింతన ఇప్పటిది కాదు.. మదురో కంటే ముందు అధ్యక్షునిగా ఉన్న హ్యూగో చావెజ్ హయాం నుండే అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో సత్యసాయిపై భక్తి ఏర్పడింది. చావెజ్ నాయకత్వంలోని పలువురు కీలక నేతలు సత్యసాయి బాబా సందేశాలకు అమితంగా ఆకర్షితులై, పుట్టపర్తికి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుత వెనెజువెలా మధ్యంతర అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ రెండేళ్ల క్రితం ప్రశాంతి నిలయంలో తిరుగాడిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా..
సాధారణంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలు భౌతికవాదానికి ప్రాధాన్యత ఇస్తాయి. అయితే వెనెజువెలా నేతలు.. తమ వామపక్ష రాజకీయ సిద్ధాంతాలను పాటిస్తూనే, సత్యసాయి బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గంలో నడవటం ఒక అరుదైన విషయంగా మారింది. వెనెజువెలాలో అధికారంలో ఉన్నవారే కాకుండా, అక్కడి ప్రతిపక్ష నేతలు కూడా పుట్టపర్తిని సందర్శించడం విశేషం. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం వారు సత్యసాయి బాబా వైపు చూడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రోడ్రిగ్జ్ నుంచి మదురో.. ఇప్పుడు రోడ్రిగ్జ్ వరకు అందరూ సత్యసాయి బాబాను ఒక గొప్ప మానవతావాదిగా గౌరవించడం భారత్-వెనెజువెలా మధ్య ఉన్న ఆధ్యాత్మిక వారధికి చిహ్నంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: కిమ్ క్షిపణి గర్జనల వేళ.. ‘డ్రాగన్-కొరియా’ షాకింగ్ ట్విస్ట్!


