శ్రీవారి దర్శనానికి 12 గంటలు | Crowd Of Devotees Increased In Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Feb 21 2026 7:53 AM | Updated on Feb 21 2026 7:53 AM

Crowd Of Devotees Increased In Tirumala

తిరుమల: తిరుమలలో  శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది.  శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,156 మంది స్వామివారిని దర్శించుకున్నారు.

 28,295 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. 

ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.   

ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు.

మూడవరోజు ఫిబ్రవరి 28న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 01న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 02వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,  27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement