నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్!
ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు డీఎంహెచ్‌ఓ పరిశీలన
తిరుపతి తుడా: స్థానిక ఎమ్మార్‌పల్లిలోని ఓ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో రెండు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగి 40 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కళాశాల వసతి గృహంలో గురువారం రాత్రి విద్యార్థినులు తీసుకున్న ఆహారం వికటించడంతో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి విద్యార్థులను తరలించి వైద్యం అందించారు. ఇటు అధికారులకు గానీ, మీడియా కంట పడకుండా వ్యవహారాన్ని యాజమాన్యం కప్పిపుచ్చడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేసి నాసిరకం ఆహారాన్ని అందించడం దారుణమని మండిపడ్డారు. తక్షణం అధికారులు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ స్పందించి కళాశాలలను శుక్రవారం అర్థరాత్రి తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన ఘటనపై విద్యార్థులతో ఆరా తీశారు. కానీ విద్యార్థుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందకపోవడంతో కళాశాల యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆహార పదార్థాలు, తాగునీటిని పరీక్షించాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు సూచించారు.
తిరుపతి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం
తిరుపతి క్రైం : రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించిన ఘటన కలకలం రేపింది. తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్ 1, గేట్ నంబర్ 3 సమీపంలో చోటుచేసుకుంది. స్టేషన్ సూపరింటెండెంట్ కథనం మేరకు.. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెడికల్ కాలేజ్ మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఎవరికై నా గుర్తింపు ఉంటే తిరుపతి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
నిబంధనలను పాటించకుంటే తగిన చర్యలు తప్పవు
కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే కళాశాలను తనిఖీ చేశాం. విద్యార్థుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందలేదు. విద్యార్థులు నివసించే వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీటి అందించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేనిపక్షంలో చర్యలు తప్పవు.
–డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్‌ఓ, తిరుపతి
నర్సింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్!


