తిరుమలలో వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు
తిరుమల: వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన వేసవి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండుమూడేళ్ల వేసవి డేటాను విశ్లేషించి, దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలో వేచి ఉండే భక్తుల సంఖ్య తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈఓ తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈఓలు లోకనాథం, భాస్కర్, సోమన్నారాయణ, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.


