ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా | Legislative Council meetings stalled on Friday as well | Sakshi
Sakshi News home page

ఆ నెయ్యిపై చర్చకు ససేమిరా

Feb 21 2026 5:28 AM | Updated on Feb 21 2026 5:28 AM

Legislative Council meetings stalled on Friday as well

హెడ్‌సెట్‌ను విసిరేస్తున్న మంత్రి పయ్యావుల

శుక్రవారం కూడా స్తంభించిన ‘మండలి’ సమావేశాలు

ఉదయం, మధ్యాహ్నం సభ ప్రారంభమైనా జరిగింది 6 నిమిషాలే

హెరిటేజ్‌ అనుబంధ ఇందాపూర్‌ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు.. సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించిన చైర్మన్‌

ఆ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు

అభ్యంతరం తెలిపిన ఆర్థిక మంత్రి కేశవ్‌.. దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు 

సభ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన మండలి చైర్మన్‌ 

హెడ్‌సెట్‌ను టేబుల్‌పై విసిరి కొట్టిన మంత్రి పయ్యావుల 

సాక్షి, అమరావతి: శాసన మండలి సమావే­శాలు శుక్రవారం కేవలం ఆరు నిమిషాల్లోనే ముగిసినా, హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ బంధంపై దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు ప్రభు­త్వం వెనకాడుతోంది. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ దుష్ప్ర­చారం చేసి, ఆనక దొరికిపోయిన చంద్రబాబు ఆ అంశం సభలో చర్చకు రాకుండా విఫలయత్నం చేస్తుం­డటం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన నాలుగున్నర నిమిషాలకే తొలుత వాయిదా పడింది. మధ్యాహ్నం 1.07 గంటలకు తిరిగి ప్రారంభమైన ఒకటిన్నర నిమిషం వ్యవధిలోనే మళ్లీ వాయిదా పడింది. 

టీటీడీకి నెయ్యి సరఫరా విషయమై హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ మధ్య ఉన్న సంబంధంపై సభలో చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ నాలుగు రోజులుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కూడా ఆ పార్టీ సభ్యులు ప్ల కార్డులు పదర్శిస్తూ, నినాదాలు చేస్తూ చైర్మన్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, ఎస్‌ మంగమ్మలు.. వాయిదా తీర్మానం ఇవ్వగా, ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ మోషేన్‌రాజు ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. 

మరో సభ్యుడు బలి కళ్యాణ చక్రవరి ‘ఎన్‌డీడీబీఎస్‌ సీఏఎల్‌ఎఫ్‌ ఛార్జిషీటు రిపోర్టులోని పేజీ నెంబరు 35లో పేర్కొన్న విధంగా తిరుమల లడ్డూను తయారు చేయడానికి వినియోగించిన నెయ్యి గురించి చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం అంశం, హెరిటేజ్‌కు అనుబంధంగా ఉన్న ఇందాపూర్‌ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుపట్టారు. ప్ల కార్డులు, శ్రీవారి ఫొటోలు పట్టుకుని చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు కొనసాగించారు.

మంత్రి కేశవ్‌ అసహనం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు దేవుడి ఫొటోలను ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్‌ అభ్యంతరం తెలిపారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు రావడంతో చైర్మన్‌ మోషేన్‌రాజు సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మంత్రి కేశవ్‌ తన చేతిలో ఉన్న మైకును విసురుగా టేబుల్‌పై కొట్టారు. 

ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపట్టారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లు వేసుకొని వేంకటేశ్వరస్వామి ఫొటో పట్టుకొని నడుస్తున్న చిత్రాన్ని ప్రదర్శిస్తూ పోడియం వద్దకు వచ్చారు. అదే సమయంలో పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. 

‘హెరిటేజ్‌–ఇందాపూర్‌’పై చర్చించాల్సిందే
ఇందాపూర్‌ డెయిరీతో హెరిటేజ్‌ బంధంపై శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ సభ్యులు శుక్రవారం మండలి ప్రారంభ సమయంలో నిరసనకు దిగారు. ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవా సాధికారిత సంస్థ భవన్‌ వద్దకు చేరుకున్న సభ్యులు.. అక్కడి నుంచి బ్యానర్లు, ప్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీగా శాసనమండలికి వెళ్లారు.

‘టీటీడీలో హెరిటేజ్‌ పాత్రపై విచారణ జరపాలి.. హెరిటేజ్‌ కోసం దైవంపై నిందలా.. సిగ్గు సిగ్గు.. భోలే బాబా వెనుక ఉన్న ఆలీ బాబా చంద్రబాబే.. ఇందాపూర్‌ పేరుతో హెరిటేజ్‌ దోపిడీ నశించాలి.. స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని అపవిత్రం చేస్తూ అవమానించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి.. భోలే బాబాను తెచ్చింది హెరిటేజ్‌ బాబే.. రక్షించు గోవిందా.. గోవింద’ అంటూ నినాదాలు చేస్తూ శాసన మండలిలోకి ప్రవేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement