హిందూ మహాసముద్ర సారథిగా భారత్‌ | India as the leader of the Indian Ocean | Sakshi
Sakshi News home page

హిందూ మహాసముద్ర సారథిగా భారత్‌

Feb 21 2026 4:47 AM | Updated on Feb 21 2026 4:47 AM

India as the leader of the Indian Ocean

అయాన్స్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కే త్రిపాఠి

25 సభ్యదేశాలు, 9 పరిశీలక దేశాల నౌకాదళాధిపతులు హాజరు

సాక్షి, విశాఖపట్నం: సముద్ర భద్రత, శాంతి స్థాపనలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 9వ ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం (అయాన్స్‌) చీఫ్‌ ఆఫ్‌ నేవల్స్‌ కాంక్లేవ్‌లో భారత నౌకాదళం హిందూ మహాసముద్ర సారథిగా బాధ్యతలు స్వీకరించింది. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాల మధ్య సమన్వయం, సముద్ర భద్రతే లక్ష్యంగా విశాఖపట్నంలో అయాన్స్‌ కాంక్లేవ్‌ని శుక్రవారం భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కే త్రిపాఠీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్యానికి హిందూ మహాసముద్ర ప్రాంతం వెన్నెముక వంటిదని చెప్పారు. ఇక్కడ శాంతిని కాపాడటం అన్ని దేశాల సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రపు దొంగల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, అక్రమ రవాణా వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సమాచార మార్పిడి చాలా కీలకమని సూచించారు. సురక్షితమైన, సుస్థిరమైన హిందూ మహాసముద్రం దిశగా భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని, పొరుగు దేశాలకు భద్రత భాగస్వామిగా తనవంతు సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. 

ఈ కాంక్లేవ్‌ ద్వారా సభ్యదేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని పెంచుకోవడంతో పాటు, సముద్రతీర రక్షణలో సరికొత్త సాంకేతికతను పంచుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో భాగంగా అయాన్స్‌ చైర్మన్‌ బాధ్యతల్ని భారత్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఈ విషయాన్ని భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబ్తి అధికారికంగా ప్రకటించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, భద్రత కోసం భారత్‌ మరింత క్రియాశీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయాన్స్‌ అధ్యక్షుడిగా భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ త్రిపాఠీ రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వివిధ దేశాల నేవీ చీఫ్‌లతో చర్చలు
రెండు సెషన్లలో జరిగిన సదస్సులో కీలక అంశాలపై ఆయా దేశాల నేవీ చీఫ్‌లు చర్చలు జరిపారు. ముఖ్యంగా సముద్ర గస్తీ, మానవతా దృక్పథంతో చేపట్టే సహాయక చర్యలు, సముద్ర పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఒప్పందాలపై చర్చించారు. నెదర్లాండ్స్‌ రాయల్‌ నేవీ డిప్యూటీ కమాండర్‌ రోబ్‌ డీవిట్‌ మాట్లాడుతూ హిందూ మహాసముద్ర ప్రాంతం యూరప్‌ ఆర్థికవ్యవస్థకు ఎంతో కీలకమన్నారు. 

సముద్రపు దొంగల బెడద తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త ప్రాంతాల్లో తలెత్తుతున్న సవాళ్లు ఆందోళన కలిగిస్తున్నాయని, అన్ని దేశాల నౌకాదళాలు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారానే వీటిని అరికట్టగలమని చెప్పారు. ఈ కాంక్లేవ్‌లో మొత్తం 25 సభ్యదేశాలు, 9 పరిశీలక దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement