కల్తీ కుట్ర బయటపడి.. ఇందాపూర్‌లో దొరికిపోయి.. మరో డైవర్షన్‌కు బాబు కుట్ర
భారతీ సిమెంట్ పరిశ్రమ వద్ద తెలుగు తమ్ముళ్ల నిరసన
18 ఏళ్లుగా నడుస్తున్న కంపెనీ వద్ద ఎన్నడూ లేని ఆందోళన
నిర్వాసితుల ముసుగులో టీడీపీ నాయకుల నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: కల్తీనెయ్యి దుష్ప్రచార కుట్ర బయటపడడం, హెరిటేజ్ – ఇందాపూర్ బంధం బట్టబయలు కావడంతో కన్నంలో దొరికిపోయిన దొంగలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీన్నుంచి బయటపడడం కోసం బాబు అండ్ కో రకరకాల కుయుక్తులు ప్రదర్శిస్తోంది. ఉన్మాదం పరాకాష్టకు చేరుకుందా అన్నట్లు టీడీపీ పెద్దల ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు శుక్రవారం భారతీ సిమెంట్ కర్మాగారంపై పడ్డారు.
కిలో నెయ్యి రూ. 300 నుంచి రూ. 658కి పెంచి హెరిటేజ్‌కు చెందిన ఇందాపూర్ డెయిరీకి టీటీడీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిపోవడంతో డైవర్ట్ చేయడం కోసం టీడీపీ నాయకులు ఓ కొత్త నాటకాన్ని ప్రదర్శించారు. హెరిటేజ్ పేరు బయటకు రావడంతో జనం దృష్టిని మళ్లించడం కోసం ఆపసోపాలు పడ్డారు.
18 ఏళ్ల క్రితం పెట్టిన భారతీ సిమెంట్ కంపెనీ వద్ద నిర్వాసితుల ఆందోళన పేరుతో తెలుగు తమ్ముళ్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో టీడీపీ స్థానిక నాయకులు కొంతమందిని పోగేసి నల్లింగాయపల్లె పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. హైడ్రామా సృష్టించారు.
దేవుడిని అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు హెరిటేజ్‌కి అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలను ప్రపంచమంతా చూసింది. అవి బయటపడడంతో భారతీ సిమెంట్ పైకి మనుషులను పంపించి కృత్రిమ ఆందోళనలు చేయించడం చూసి జనం ఆశ్చర్యపోయారు. చంద్రబాబు బృందం చూపిన ఈ నాటకాల బాటనే మిగిలిన వారు అనుసరిస్తే రేపు హెరిటేజ్ పరిస్థితి ఏమిటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిర్వాసితులకు అదనపు పరిహారం, ఉద్యోగాలు..
భారతీ సిమెంటు కర్మాగారానికి అవసరమైన భూములను 2006లో సేకరించారు. ఎకరం రూ.1.5లక్షలతో కొనుగోలు చేశారు. 2010లో మరికొంత మంది రైతులు తమ భూములు తీసుకోవాలని అభ్యర్థిస్తే ఎకరం రూ.3.5లక్షలు చెల్లించి తీసుకున్నారు. అంతకు ముందు ఎకరం రూ.1.5లక్షలతో తీసుకున్న రైతులకు కూడా వారు కోరకపోయినా అదనంగా రూ.2లక్షలు చెల్లించారు. అంటే ప్రతి ఒక్క రైతు భూమి ఎకరాకు రూ.3.5లక్షలు చెల్లించారన్నమాట. పరిశ్రమ పూర్తయి 2009 నుంచి సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది.
పరిశ్రమకు భూములిచ్చిన 120 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు సంతోషంగా ఉన్నారు. నిర్వాసితుల నుంచి ఎలాంటి సమస్య, ఆందోళనలేదు. ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కాలుష్యం పేరిట, ఉద్యోగాల పేరిట తెలుగుతమ్ముళ్లు హడావిడి చేశారు. ఎప్పుడూ లేనిది ఇప్పడే ఎందుకు ఇలా హడావిడి చేస్తున్నారు అని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. సీఎంఓ డైరెక్షన్‌లో కమలాపురం తెలుగుతమ్ముళ్లు ఈ యాక్షన్ చేస్తున్నారని అక్కడివారు చర్చించుకోవడం విశేషం.


