కరణ్ థాపర్ , పరకాల ప్రభాకర్
టీడీపీ కూటమి అద్భుత విజయం వెనుక దుశ్చర్య ఉందా?
సందేహాలను నివృత్తి చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే.. ఒక ఓటరు 6 సెకన్లలో రెండు ఓట్లు వేయడం సాధ్యమా?
పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ఏకంగా 9 గంటల పాటు ఓటర్లు క్యూలో నిల్చోగలరా?
‘ది వైర్’ వెబ్‌సైట్‌కు ప్రముఖజర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో సామాజిక, ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ పునరుద్ఘాటన
సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఒక్కో పోలింగ్ బూత్‌లో గంటకు సగటున ఏడుగురు ఓటు వేశారా?
కానీ.. అదే రోజు రాత్రి 11.45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఒక్కో పోలింగ్ బూత్‌లో నిమిషానికి ముగ్గురు ఓటు వేశారా?.. దేశ చరిత్రలో ఏ ఎన్నికలోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు
ఇదే టీడీపీ కూటమి ‘అద్భుత’ విజయానికి దారి తీసిందేమోనన్న కరణ్‌థాపర్
ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే పునాది.. పోలింగ్‌ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి
తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఏపీలో పోలింగ్ ప్రక్రియపై సందేహాలను నివృత్తి చేయాలని కరణ్‌థాపర్ డిమాండ్
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదంగా ఉందని ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ పునరుద్ఘాటించారు. కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అధికారికంగా విడుదల చేసిన పోలింగ్ డేటాను సమగ్రంగా విశ్లేషిస్తే.. 175 శాసనసభ స్థానాలకుగానూ 164 స్థానాల్లో.. 25 లోక్‌సభ స్థానాలకుగానూ 21 స్థానాల్లో టీడీపీ కూటమి గెలుపొందడానికి దారి తీసిన ‘అద్భుతం’ వెనుక ఉన్న దుర్మార్గం ఏమిటన్నది బట్టబయలు అవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవో మీడియా సమావేశాల్లో అధికారికంగా వెల్లడించిన సమాచారం, విడుదల చేసిన ప్రకటనలను ఆధారాలుగా చూపుతూ పరకాల ప్రభాకర్ రాసిన పరిశోధనాత్మక వ్యాసాన్ని దేశంలో ప్రముఖ వెబ్‌సైట్ ‘ది వైర్’ ప్రచురించింది. ఈ వ్యాసం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే అంశంపై పరకాల ప్రభాకర్‌ను ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు.
‘‘కేవలం ఆరు సెకన్లలో ఒక ఓటరు రెండు ఓట్లు (శాసనసభకు ఒకటి.. లోక్‌సభకు ఒకటి) వేయగలరా? మే 13న రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ కేవలం 2.15 గంటల్లో 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఏకంగా 17 లక్షల ఓట్లు పోలయ్యాయి.. అంటే ఒక నిమిషానికి ముగ్గురు ఓటర్లు ఓటు వేశారా? ముమ్మాటికీ ఇది అసాధ్యం. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సింది ఎన్నికల సంఘమే. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే పునాది. ఎన్నికల ప్రక్రియపై సందేహాలను నివృత్తి చేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజలకు విశ్వాసం కలుగుతుంది’’ అని కరణ్‌థాపర్ స్పష్టం చేశారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ఇవీ..

కరణ్‌థాపర్
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి 175 శాసనసభ స్థానాలకుగానూ 164 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 21 స్థానాల్లో విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించింది. ఇంత అద్భుత విజయం ఎలా సాధ్యమైందని అనిపించింది. ది వైర్ వెబ్‌సైట్‌లో మీరు రాసిన పరిశోధనాత్మక వ్యాసం చదివాక ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం నివ్వెరపరిచింది. ఇంత మోసం జరిగిందా? ఏ ఆధారాలతో ఈ దుర్మార్గాన్ని బయటపెట్టారు?
పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవో అధికారికంగా మీడియా సమావేశాల్లో వెల్లడించిన సమాచారం, విడుదల చేసిన ప్రకటనల ఆధారంగా.. వాటినే సాక్ష్యాధారాలుగా చూపుతూ ఈ వ్యాసం రాశా. కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవో అధికారికంగా విడుదల చేసిన డేటాను ఒక్కసారి పరిశీలిస్తే.. మే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 13న రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం ఓట్లు పోలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల వరకూ పోలింగ్ జరిగినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి.
అంటే.. మే 13న రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ కేవలం 2.15 గంటల్లో 4.16 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3.33 కోట్లు. ఇందులో 4.16 శాతం అంటే 17 లక్షల ఓట్లు కేవలం 2.15 గంటల వ్యవధిలో పోలైనట్లు స్పష్టమవుతోంది. ఈ ఓట్లు మొత్తం 3,500 పోలింగ్ బూత్‌లలో పోలయ్యాయి. ఒక్కో బూత్‌లో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. 2.15 గంటలు అంటే 135 నిముషాల్లో 491 ఓట్లు.. అంటే ఒక నిమిషానికి ముగ్గురు ఓటు వేశారు.
కరణ్‌థాపర్
శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేశాక వీవీ ప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకన్లు.. లోక్‌సభ అభ్యర్థికి మరో కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేశాక వీవీ ప్యాట్ రావడానికి మరో 7 సెకన్లు మొత్తం 14 సెకన్లు సమయం పడుతుంది. అంటే.. మిగతా 6 సెకన్లలో ఓటరు గుర్తింపు కార్డు చూపడం, దాన్ని పోలింగ్ అధికారి తనిఖీ చేయడం, ఓటరు జాబితాలో ఆయన పేరు టిక్ చేయడం, సంతకం లేదా వేలిముద్ర తీసుకోవడం, ఓటరు చేతి వేలిపై ఇంక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా? గతంలో ఏ ఎన్నికల్లోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు. ఇది నమ్మశక్యమేనా?
పరకాల ప్రభాకర్
నూటికి నూరుపాళ్లు 6 సెకన్లలో ఓటు వేయడం అసాధ్యం. మే 13న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అంటే మూడు గంటల్లో 0.08 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 34 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 3,500 పోలింగ్ బూత్‌లలో 3 గంటల్లో 34 వేల ఓట్లు పోలయ్యాయి. అంటే గంటకు ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున 7 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కానీ.. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ పోలింగ్ శాతం 4.16 శాతం పెరిగింది. అంటే 2.15 గంటల్లో 17 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున 491.. కొన్ని పోలింగ్ బూత్‌లలో 491 కంటే తక్కువ.. కొన్ని కేంద్రాల్లో 491 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నిమిషానికి ముగ్గురు ఓటర్లు ఓట్లు వేశారు. ఇది అత్యంత సందేహాస్పదం.
కరణ్‌థాపర్
మే 13న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ 3 గంటల్లో గంటకు ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున ఏడుగురు ఓటర్లు ఓటు వేశారా? ఇక అదే రోజు రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ 2.15 గంటల్లో సగటున ఒక్కో పోలింగ్ బూత్‌లో 491 మంది ఓటు వేశారా? నిమిషానికి ముగ్గురు ఓటు వేశారా? ఇది అత్యంత అనుమానించదగ్గ అంశం. అద్భుత విజయం వెనుక దుర్మార్గం ఇదేనేమో?
పరకాల ప్రభాకర్
ప్రిసైడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ బుక్ ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయానికి క్యూలో ఉన్న ఓటర్లు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. నిర్దేశించిన తుది సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసివేయాలి. క్యూలైన్‌లో ఉన్న ఓటర్లను చివరి వరకూ వీడియోగ్రఫీ తీయాలి. చివరి ఓటరు ఓటు హక్కు వినియోగించుకున్నాకే పోలింగ్‌ను ముగించాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకు ప్రవేశించిన ఓటరు.. తెల్లవారుజామున 2 గంటల వరకూ అంటే తొమ్మిది గంటలపాటు క్యూలో నిల్చొని ఓటు వేయడానికి వేచిచూడగలరా? ఇది నమ్మశక్యం కాదు.
కరణ్‌థాపర్
పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకూ ఒక్కో పోలింగ్ బూత్‌లో గంటలో సగటున 7 మంది ఓటు వేశారు.. అదే రోజు రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ఒక్కో పోలింగ్ బూత్‌లో ఒక నిమిషంలో ముగ్గురు ఓటు వేశారు. ఇదెలా సాధ్యమో కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ సీఈవోకే తెలియాలి. ఇది అత్యంత సందేహాస్పదం.. ఇదే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు తీవ్రమైన అనుమానాలను రేకెత్తించడానికి దారి తీసింది.
పరకాల ప్రభాకర్
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో పోలింగ్ బూత్ పరిధిలో సగటున 1,178 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో పోలింగ్ బూత్‌లో సగటున 892 ఓట్లు పోలయ్యాయి. అందులో పోలింగ్ రోజున రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ సగటున 491 ఓట్లు పోలయ్యాయి. ఇదే అత్యంత సందేహాస్పదం. అర్ధరాత్రి ఓట్ల మిస్టరీపై అనేక సందేహాలు ఉన్నాయి. ఇదే టీడీపీ కూటమి అద్భుత విజయానికి దారితీసింది.
కరణ్‌థాపర్
ది వైర్ వెబ్‌సైట్‌లో మీరు ఈ పరిశోధనాత్మక కథనాన్ని ఈనెల 14న రాశారు. ఈ కథనంలో వ్యక్తం చేసిన ప్రశ్నలను, అనుమానాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారా? వాటిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా స్పందించిందా?
పరకాల ప్రభాకర్
ది వైర్ వెబ్‌సైట్‌లో ఈ కథనాన్ని ప్రచురించక ముందే.. 20 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఇవే సందేహాలు, అనుమానాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశా. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. ఇదే కాదు.. మహారాష్ట్ర, హర్యానా, బిహార్ ఎన్నికల ప్రక్రియపై కూడా సాక్ష్యాధారాలతో సందేహాలను వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో లేఖలు రాశా. వాటిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. సందేహాలను నివృత్తి చేయలేదు. వాటి తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌పై నేను లేవనెత్తిన సందేహాలు, అనుమానాలను కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేస్తుందని అనుకోను. కేంద్ర ఎన్నికల సంఘం యధావిధిగా మౌనం పాటిస్తోంది.
కరణ్‌థాపర్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సరళి అత్యంత సందేహాస్పదంగా ఉందంటూ మీరు ది వైర్ వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసం సంచలనం రేపింది. ఈ కథనంపై జాతీయ మీడియా.. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ఏమైనా స్పందించాయా?
పరకాల ప్రభాకర్
ఈ వ్యాసానికి భారీ స్పందన వచ్చింది. అధిక శాతం మంది ఈ వ్యాసంతో ఏకీభవిస్తూ నన్ను అభినందించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. కొందరు ఈ వ్యాసంతో విభేదించారు. జాతీయ మీడియా ఈ వ్యాసంపై నన్ను సంప్రదించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి వ్యతిరేక మీడియా ఈ వ్యాసంపై స్పందించి.. అందులోని అంశాలను ప్రచురించాయి.
కరణ్‌థాపర్
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే పోలింగ్‌ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. పోలింగ్ ప్రక్రియపై సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం అనుమానాలను నివృత్తి చేయకపోతే ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం సడలుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల పోలింగ్ సరళిపై సందేహాలను నివృత్తి చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుందని.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై అనుమానాలను నివృత్తి చేస్తుందని ఆశిస్తున్నా.
కరణ్‌థాపర్
ఒక నిమిషానికి ముగ్గురు ఓటు వేయగలరా? అంతవేగంగా ఓటు వేయగలరా? ఇది సాధ్యమేనా?
పరకాల ప్రభాకర్
ముమ్మాటికీ అది అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు, లోక్‌సభకు ఒకేసారి పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే.. ఓటరు పోలింగ్ కేంద్రానికి గుర్తింపు కార్డు తీసుకుని వస్తారు.. ఆ గుర్తింపు కార్డును పోలింగ్ అధికారి పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటరు జాబితాలో ఆయన పేరు చూసి టిక్ చేస్తారు.. ఓటరుతో సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు.. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా వేలిపై ఇంక్ పెడతారు.. ఆ తర్వాత శాసనసభ స్థానం అభ్యర్థికి ఓటు వేయడానికి ఒక కంపార్ట్‌మెంట్‌లోకి ఓటరు వెళ్తారు.. ఆ తర్వాత లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేయడానికి మరో కంపార్ట్‌మెంట్‌కు ఓటరు వెళ్తారు. ఈ ప్రక్రియ అంతా 20 సెకన్లలో పూర్తవడం అసాధ్యం.
((ది వైర్ వెబ్‌సైట్ సౌజన్యంతో))


