'గుట్ట'చప్పుడు కాకుండా.. | Illegal trafficking from AOB | Sakshi
Sakshi News home page

'గుట్ట'చప్పుడు కాకుండా..

Feb 21 2026 5:43 AM | Updated on Feb 21 2026 5:43 AM

Illegal trafficking from AOB

స్మగ్లింగ్‌కు అడ్డాగా ఏఓబీ    

అడ్డగోలుగా అక్రమ రవాణా

ఒడిశా నుంచి గంజాయి..

పశువులు, తాబేళ్లు, తెల్లరాయి కూడా..

ఆధునిక టెక్నాలజీ వినియోగం

బరి తెగిస్తున్న స్మగ్లర్లు  

ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) అంటే ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు పెట్టింది పేరు. కొన్నాళ్లుగా వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో అందమైన మన్యసీమ కాస్తా స్మగ్లర్లకు అడ్డాగా మారిపోయింది. కాదేదీ స్మగ్లింగ్‌కు అనర్హం అన్నట్టుగా.. ఇతర రాష్ట్రాలకు అనేక వస్తువులు, జీవరాశులను అక్రమంగా రవాణా చేస్తూ స్మగ్లర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి భారీగా కలప అక్రమ రవాణా జరిగేది. అటవీ శాఖ దాడులు ముమ్మరం చేయడంతో దిక్కు తోచని స్మగ్లర్లు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.  

చింతూరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి, పశువులు, తాబేళ్లు, తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని వై.రామవరంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి (జీకే వీధి) మండలాల సరిహద్దు ప్రాంతాల నుంచి స్మగ్లర్లు ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. చింతూరు మండల సరిహద్దుల నుంచి పశువులు, తాబేళ్లు, తెల్లరాయిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాజాగా జిల్లా సరిహద్దులను జూదగాళ్లు కోడిపందేలు, పేకాట అడ్డాలుగా మార్చేశారు. 

గం‘జాయి’గా.. 
వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దుకు ఆవల ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. అక్కడ పండించిన గంజాయిని 5, 10 కిలోల చొప్పున ప్యాకెట్లుగా చేసి, వాటిని బస్తాల్లో నింపి సరిహద్దులు దాటించి.. చింతూరు మండలం మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. 

దీనిపై అందుతున్న సమాచారం మేరకు పోలీసులు తరచుగా వాహనాల తనిఖీలు చేసి, గంజాయిని పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు స్మగ్లర్లు.. పోలీసుల కన్నుగప్పి గంజాయిని చాకచక్యంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. 

గత ఏడాది చింతూరు పోలీసు సబ్‌ డివిజన్‌లో రూ.1.14 కోట్ల విలువైన 2,275 కిలోల గంజాయి పట్టుబడగా.. 24 కేసులు నమోదు చేసి.. 64 మందిని అరెస్టు చేశారు. పోలీసు దాడుల నేపథ్యంలో కొంత మంది స్మగ్లర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. గంజాయిని బస్తాలతో తరలిస్తే పోలీసులకు పట్టుబడుతూండటంతో.. ఇటీవల దానిని ద్రవ రూపంలోకి మారుస్తూ.. లిక్విడ్‌ గంజాయిని తరలిస్తున్నారు. పలుమార్లు పోలీసులు లిక్విడ్‌ గంజాయిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

తెల్లరాయి రవాణా ఇలా 
ఏజెన్సీలో లభించే ఖనిజ సంపదను సైతం స్మగ్లర్లు యథేఛ్ఛగా దోచుకుంటున్నారు. ఒడిశాతో పాటు చింతూరులో విలువైన తెల్లరాయి (క్వార్ట్‌జ్‌) లభ్యమవుతోంది. ఒడిశా నుంచి తీసుకొచ్చిన దానితో పాటు స్థానికంగా లభ్యమయ్యే ఈ రాయిని బినామీ పేర్లతో స్టాక్‌ పాయింట్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా రాత్రి సమయంలో అక్రమంగా రవాణాస్తున్నారు. కళ్ల ముందే జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

తాబేళ్ల రవాణా 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం, రావులపాలెంతో పాటు కాకినాడ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో తాబేళ్లు అధికంగా లభిస్తున్నాయి. వీటిని ఒడిశాకు చెందిన స్మగ్లర్లు అధిక మొత్తంలో కొనుగోలు చేసి, రాత్రి పూట వాహనాల్లో రవాణా చేస్తూ చింతూరు మండలం కొత్తపల్లి, పొల్లూరు వద్ద సరిహద్దులను దాటించి ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ›మామూలు తాబేళ్లతో పాటు ఎంతో అరుదైన నక్షత్ర తాబేళ్లను కూడా రవాణా చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది దాడులు నిర్వహిస్తూ తాబేళ్లను పట్టుకుంటున్నా వాటి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. 

ఒడిశా నుంచి పశువుల రవాణా 
చింతూరు మండలంలోని కొత్తపల్లి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లర్లు పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఒడిశాలో పశువులను కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు.. సీలేరు నదిని దాటించి వాటిని కొత్తపల్లికి చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఆ పశువులను వాహనాల్లో పరిమితికి మించి కుక్కి మరీ దారుణంగా తెలంగాణ, కేరళతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

వాహనాల తనిఖీ అధికం కావడంతో తరచుగా పశువులు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు రూటు మార్చి పశువులను కాలి నడకన సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ వాహనాల్లోకి ఎక్కించి రవాణాకు బరితెగిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాలో హైదరాబాద్, గోకవరానికి చెందిన వ్యాపారులతో పాటు చింతూరు మండలానికి ఓ వ్యక్తి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement