breaking news
Cattle transport
-
'పుష్ప' స్టైల్లో ఆవుల అక్రమ రవాణా
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పుష్ప సినిమా రేంజ్లో జరిగిన అక్రమ గోవుల రవాణా ప్రయత్నాన్ని పంతంగి టోల్ ఫ్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ పైభాగంలో ఉల్లిగడ్డల లోడు, కిందభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూహల వంటి ఖాళీలో గోవులను దాచిపెట్టి తరలించేందుకు ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి పరిశీలించగా వైజాగ్ నుంచి హైదరాబాదులోని ఒక కబేళాకు గోవులను తరలిస్తున్నట్టు బయటపడింది. లారీ క్రింద భాగాన్ని పాలిష్ బోర్డులతో కప్పి చిన్న గాలి రంధ్రాలు ఉంచి పైన ఉల్లిగడ్డల సంచులతో పూర్తిగా మూసివేసి ఎవరికీ అనుమానం రాకుండా ముఠా చాకచక్యంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.గోవుల రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఒడిశా టు ఆంధ్రా
చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు భారీ ఎత్తున పశువుల రవాణా కొనసాగుతోంది. ఒడిశా నుంచి పశువులను తీసుకొచ్చి చింతూరు మండలం కొత్తపల్లి వద్ద సీలేరు నదిని దాటిస్తున్నారు. అనంతరం అటవీ ప్రాంతం గుండా 10 కి.మీ దూరంలోని తులసిపాక గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, ఖమ్మం జిల్లా పాల్వంచ సంతల్లో ఈ పశువులను విక్రయిస్తామని వ్యాపారులు చెపుతున్నారు. అయితే గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా పశువుల రవాణా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక్కో వాహనంలో ఏడు పశువులను మాత్రమే రవాణా చేయాలని, కానీ వ్యాపారులు 20 నుంచి 30 పశువులను తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మేం అందరికీ మామూళ్లు ఇస్తున్నాం, మా ఇష్టమొచ్చినట్లు రవాణా చేసుకుంటాం, మీకెందుకు’ అని సమాధానం చెపుతున్నారని, గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పశువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


