ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Senior student traps junior student | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Feb 21 2026 5:33 AM | Updated on Feb 21 2026 1:49 PM

Senior student traps junior student

జూనియర్‌ విద్యార్థినిని ట్రాప్‌ చేసిన సీనియర్‌ విద్యార్థి 

శారీరకంగా లొంగదీసుకుని.. రహస్యంగా వీడియోలు తీసి దుర్మార్గం 

కాలేజీలో పలువురు విద్యార్థులకు వీడియోలు పంపించిన వైనం 

చెప్పినప్పుడల్లా కోరిక తీర్చకపోతే వీడియోలు ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌

మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని 

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో దారుణం

తాడేపల్లి రూరల్‌: కామాంధుడి వికృతానికి రాష్ట్రంలో మరో విద్యార్థిని బలైంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్‌ విద్యార్థి అఘాయిత్యాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఉసురు తీసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పిల్లల్ని చదివించుకునేందుకు ఊరొదిలి తాడేపల్లి సమీపంలోని ఓ ఊరుకు వచ్చింది. భార్యాభర్తలు కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. 

కుమారుడు విజయవాడలో చదువుతుండగా కుమార్తెను మంగళగిరిలోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిని అదే కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యర్రబాలేనికి చెందిన రహీమ్‌ ప్రేమ పేరుతో లొంగదీసుకుని శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో విద్యార్థినికి తెలియకుండా వీడియోలు తీశాడు. రహీమ్‌ ప్రవర్తనలో మార్పురావడంతో ఆ విద్యార్థిని అతడి ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌చేసింది. ఈ నేపథ్యంలో రహీమ్‌ తాను, ఆ విద్యార్థిని కలసి ఉన్న వీడియోను ఆమెకు వాట్సాప్‌ చేశాడు. 

ఈ పరిణామంతో దిక్కుతోచని ఆమె గతరాత్రి ఇంట్లో మౌనంగా ఉంది. ఏంజరిగిందని తండ్రి, అన్న అడగటంతో.. తాను ఒకరిని ప్రేమించానని, అతడు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చెప్పింది. దీంతో కాలేజీకి వెళ్లవద్దంటూ మందలించిన తల్లి కుమార్తె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకుంది. విద్యార్థిని వద్ద నుంచి స్పందన లేకపోవడంతో రహీమ్‌ కొన్ని వీడియోలను పలువురు విద్యార్థులకు పంపించాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన సీనియర్‌ విద్యార్థికి ఈ వీడియోలు పంపించినట్లు తెలియడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. 

అవమానాన్ని తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో సీలింగ్‌ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని మృతిచెందింది. పనికి వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా ఉరికి వేళ్లాడుతున్న కుమార్తె కనిపించింది. దీంతో గుండెలు పగిలేలా రోదిస్తూ భర్తకు, కుమారుడికి సమాచారం ఇచ్చింది. ఇంటికి వచ్చిన తండ్రి ‘ఒకసారి నేనుమాట్లాడతాను. నువ్వు ఏమీ చేసుకోవద్దు. నిన్ను వేరే కాలేజీలో చేర్పిస్తాను’ అని చెప్పినా ఇలా చేసుకున్నావేంటమ్మా అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాలేజీలు, చదువులు బాగుంటాయని సొంత ఊరునుంచి ఇక్కడికి వచ్చి కూతుర్ని బలిచేసుకున్నానంటూ రోదిస్తున్నాడు. జరిగిన విషయాన్ని తాడేపల్లి ఎస్‌ఐ వెంకటసాయికుమార్‌కు వివరించాడు. 

నెలరోజులుగా బ్లాక్‌మెయిల్‌ 
ఆ విద్యార్థినిని రహీమ్‌ నెలరోజులుగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు తెలిసింది. తోటి విద్యార్థుల వద్ద అది నా దగ్గరకు ఎందుకురాదు? నా కోరిక ఎందుకు తీర్చదో చూస్తాను.. అంటూ పలుమార్లు అశ్లీలంగా మాట్లాడాడని సమాచారం. గురువారం సాయంత్రం కూడా.. రేపు నాతో మాట్లాడుతుంది.. అంటూ తోటి విద్యార్థులతో చాలెంజ్‌ చేసిన రహీమ్‌ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ విద్యార్థినికి పంపించినట్లు తెలిసింది. 

నాలుగు రోజులుగా వీడియోలను కాలేజీ విద్యార్థులు పలువురికి పంపించినట్లు తెలిసింది. కొందరు విద్యార్థుల ద్వారా అధ్యాపకులకు కూడా ఈ వీడియోలు షేర్‌ అయినట్లు సమాచారం. కనీసం అప్పుడైనా కాలేజీ యాజమాన్యం స్పందించి ఉంటే ఈ విద్యార్థిని ప్రాణాలు దక్కేవని భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement