ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి | Lift irrigation scheme is the lifeblood of Rayalaseema | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పథకం రాయలసీమకు జీవనాడి

Feb 21 2026 5:47 AM | Updated on Feb 21 2026 5:47 AM

Lift irrigation scheme is the lifeblood of Rayalaseema

వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు 

స్వప్రయోజనాల కోసం చంద్రబాబు సీమ ప్రజల గొంతు కోస్తున్నారు 

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌  

కడప కార్పొరేషన్‌: కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవనాడి వంటి ప్రాజెక్టు అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సాకే శైలజానాథ్‌ అన్నారు. వైఎస్సార్‌ కడపలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైతులకు అతిపెద్ద కష్టం రాబోతోందన్నారు. సీఎం చంద్రబాబుకు సాగునీరంటే పట్టింపు లేదని, వ్యవసాయం అంటే దండగ అన్న భావనలో ఉన్నారన్నారు. స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడలేని ఉప ముఖ్యమంత్రి మనకు ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రజల కోసం, కృష్ణా పరివాహక ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ తీవ్ర పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై ప్రాజెక్టును ఆపేయడం దారుణమన్నారు. బాబు స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల గొంతు నులమడం అన్యాయమన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని, తమ శక్తి సామర్థ్యాలేమిటో ప్రభుత్వానికి చూపాల్సిన సమయం వచ్చిందన్నారు. శ్రీశైలంలో 841 అడుగులకు నీరు చేరకముందే కోయల్‌సాగర్‌ నుంచి నీటిని వాడేస్తున్నారన్నారు. 

కరెంటు ఉత్పత్తి కోసం 8 టీఎంసీలు బయటికి పోతోందన్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందనే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణాన్ని ఆపేశారన్నారు. అల్మట్టి సామర్థ్యాన్ని 150 టీఎంసీలకు పెంచి అప్పర్‌ భద్రకు సాగునీటిని ఇస్తే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అనంతపురం, కృష్ణా డెల్టాలు దీని వల్ల దెబ్బతింటాయన్నారు. ఈ ప్రభుత్వానికి అమరావతి తప్ప మరేదీ పట్టడం లేదన్నారు. ప్రశ్నించే గొంతులు లేకుండా చంద్రబాబు భయానక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాయలసీమ లిఫ్ట్‌ వల్ల వచ్చే 22 టీఎంసీలతో ఏం లాభమని ఇరిగేషన్‌ మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. హంద్రీ–నీవా నుంచి గాలేరు–నగరికి ఉన్న లింక్‌ కెనాల్‌ కూడా పూర్తి చేయడం లేదని, అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారని, గ్రామీణ బ్యాంకు హెడ్‌ ఆఫీసును సైతం అమరావతికి తీసుకెళ్లారన్నారు. ఉక్కు పరిశ్రమ ఊసే లేదని, కర్నూలు హైకోర్టు గూర్చి మాట్లాడేవారే లేరన్నారు. 

తమ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసే రాయలసీమ వ్యతిరేక నిర్ణయాలను సహించబోమని, కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని శైలజానాథ్‌ హెచ్చరించారు. అందులో భాగంగానే మార్చి 1వ తేదీన  కడపలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement