ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్‌.. | IDFC First Bank flags Rs 590 crore fraud in Haryana govt linked accounts | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్‌..

Feb 22 2026 12:48 PM | Updated on Feb 22 2026 1:19 PM

IDFC First Bank flags Rs 590 crore fraud in Haryana govt linked accounts

ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.

బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్‌ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.

హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్‌తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.

దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.

ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement