దశాబ్ధాల పగను పక్కన పెట్టి.. దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయి. తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించింది. 2019 తర్వాత దక్షిణ కొరియా నేత చైనాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం ఆసక్తికరంగా మారింది.
రెండో ప్రపంచ యుద్ధంలో..
చైనా, దక్షిణ కొరియాల మధ్య సంబంధం ఈ నాటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ నుంచి ఎదురవుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. జపాన్ ఆక్రమణ నుండి కొరియాను రక్షించుకునేందుకు నాడు చైనా అండగా నిలిచింది. ఆనాటి పోరాట వీరుల స్మారకార్థం నేటికీ షాంఘై(చైనా)లో స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తన పర్యటనలో వాటిని సందర్శించడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధానికి నిదర్శనంగా నిలిచింది.
సయోధ్య కరువయ్యిందిలా..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరు దేశాల పరిస్థితులు తలకిందులయ్యాయి. కొరియా యుద్ధం సమయంలో చైనా.. ఉత్తర కొరియాకు మద్దతు ఇవ్వగా, అమెరికా.. దక్షిణ కొరియాకు అండగా నిలిచింది. దీంతో దశాబ్దాల పాటు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కరువయ్యింది. చైనా కమ్యూనిజం బాటలో, దక్షిణకొరియా ప్రజాస్వామ్య బాటలో ప్రయాణిస్తూ బద్ధశత్రువులుగా మారిపోయాయి.
వాణిజ్యమే పరమావధిగా..
‘బీబీసీ’ అందించిన కథనం ప్రకారం సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ మౌనం తర్వాత, 1992లో ఇరు దేశాలు తిరిగి దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. వాణిజ్యమే పరమావధిగా చైనా తన దేశ తలుపులను తెరిచింది. దీంతో దక్షిణ కొరియా కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. నాటి నుండి ఆర్థికంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారపడటం మొదలైంది.
కొరియాపై అనధికారిక యుద్ధం
2016లో దక్షిణ కొరియా తీసుకున్న ఒక నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఉత్తర కొరియా ముప్పు నుంచి తప్పించుకునేందుకు అమెరికాకు చెందిన 'థాడ్' (THAAD) క్షిపణి వ్యవస్థను దక్షిణ కొరియా తన గడ్డపై మోహరించింది. ఇది తమ భద్రతకు ముప్పుగా భావించిన చైనా, అప్పటి నుండి కొరియాపై అనధికారిక యుద్ధం కొనసాగిస్తోంది. ఆ క్షిపణి కారణంగా నెలకొన్న వివాదం దరిమిలా చైనాలో కొరియన్ పాప్ (K-pop) సంగీతం, సినిమాలు, నాటకాలపై అప్రకటిత నిషేధం మొదలైంది.
సెల్ఫీతో చిగురించిన దోస్తీ
దశాబ్దాల ఉద్రిక్తతల తర్వాత, అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ సోమవారం బీజింగ్‌లో షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. గంభీరంగా సాగిన చర్చల మధ్య, గత ఏడాది జిన్‌పింగ్ తనకు బహుమతిగా ఇచ్చిన షియోమీ ఫోన్‌తో లీ ఆయనతో సెల్ఫీ దిగారు. ‘ఫోన్ పిక్చర్ క్వాలిటీ బాగుంది’ అంటూ ఆయన చేసిన పోస్ట్, ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరం తొలగిపోతున్నదనే సంకేతాన్ని ప్రపంచానికి అందించింది.
ఉత్తర కొరియాతో పొంచివున్న ముప్పు
‘లీ’ చైనా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆదివారం తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా తాజాగా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకోవడాన్ని నిరసిస్తూ కిమ్ ఈ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చైనా సహకారం ‘లీ’కి అత్యంత కీలకంగా మారింది.
ఆసియా రాజకీయాల్లో కీలక మలుపు
‘లీ’ తాజా పర్యటనలో భాగంగా టెక్నాలజీ, వాణిజ్యం, పర్యావరణ రంగాలలో ఇరు దేశాలు మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కే- పాప్, కొరియన్ డ్రామాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్లు సమాచారం. చైనా విదేశాంగ శాఖ కూడా సాంస్కృతిక మార్పిడికి సిద్ధమని ప్రకటించడం కొరియన్ వినోద రంగానికి పెద్ద ఊరటగా నిలిచింది. చైనాతో సంబంధాలను గాడిలో పెట్టిన లీ.. తన తదుపరి పర్యటనలో భాగంగా జపాన్ వెళ్లనున్నారు. అమెరికా, చైనా, జపాన్.. ఈ మూడు దేశాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ, దక్షిణ కొరియా ప్రయోజనాలను రక్షించడం ‘లీ’కి కీలకంగా మారింది. ఏదిఏమైనా ‘లీ’ పర్యటనతో ఆసియా రాజకీయాల్లో ఒక కొత్త మలుపు మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉద్రిక్తత.. జనం రాళ్ల దాడి


