చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్‌లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్‌లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
బుధవారం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.
లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?
లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.
పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.
బంగారం, వెండి ధరలపై ప్రభావం
చైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్ అమీర్ మక్డా ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.
చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరమని సూచించారు.
షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్‌బ్యాక్‌లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


