న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్‌ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్ హర్గవే తెలిపారు.
‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్‌లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్‌లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్‌డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్ తదితర పాపులర్ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం వల్లే..
ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు.
కొనుగోళ్లకూ సై..
విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.


