ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా? | EPFO may keep PF interest rate at 8 25pc for FY26 | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా?

Feb 18 2026 3:24 PM | Updated on Feb 18 2026 3:41 PM

EPFO may keep PF interest rate at 8 25pc for FY26

ఎంప్లాయూస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.

సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్‌ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.

వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement