న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్క్‌మన్ గేట్ సమీపంలోని పురాతన మసీదు ఆనుకుని ఉన్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30 గంటలకే మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో ఆక్రమణలను తొలగిస్తుండగా, పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వగా, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు (టీయర్ గ్యాస్) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. తుర్క్‌మన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
#WATCH | Delhi | Visuals from the area near Faiz-e-Elahi Masjid, Turkman Gate, where MCD, pursuant to the directions of the Delhi High Court, carried out a demolition drive on an encroachment earlier today.
Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says,… pic.twitter.com/56LD5zeYZg— ANI (@ANI) January 7, 2026
ఈ కూల్చివేతలపై ఢిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ సీపీ మధుర్ వర్మ స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించే క్రమంలో ఈ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, అదనపు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బలగాలను ఇక్కడ మోహరించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ, కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం, 38,940 చదరపు అడుగుల మేర రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. మసీదు ఉన్న 0.195 ఎకరాల భూమి మినహా మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎర్రకోట పేలుడు నిందితుడు ఉమర్-ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్‌కే..’ మచాడో సంచలనం



