కరాకస్: వెనెజువెలాలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విపక్ష మహిళా నేత మరియా కొరినా మచాడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన మచాడో.. నోబెల్ గౌరవాన్ని ట్రంప్‌తో పంచుకునేందుకు లేదా పూర్తిగా ఆయనకే ఈ బహుమతిని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. వెనెజువెలా రాజధాని కరాకస్‌లో జనవరి 3న అమెరికా చేపట్టిన సైనిక చర్యను మచాడో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ‘జనవరి 3వ తేదీ చరిత్రలో నిరంకుశత్వంపై న్యాయం సాధించిన విజయంగా నిలిచిపోతుంది. ఇది మొత్తం మానవాళికే ఒక గొప్ప ముందడుగు’ అని ఆమె పేర్కొన్నారు. చాలా మంది అసాధ్యమని భావించిన పనిని ట్రంప్ సుసాధ్యం చేశారని, అందుకే తన నోబెల్ బహుమతిని ఆయనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
మదురో అరెస్ట్ తర్వాత వెనెజువెలాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో మచాడో కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. అయితే ట్రంప్ ఈ విషయంలో భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. మచాడోకు దేశంలో తగినంత మద్దతు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె చాలా మంచి మహిళ అని, కానీ దేశంలో ఆమెకు తగినంత గౌరవం, ఆదరణ లేదన్నారు. ఆమె దేశానికి నాయకత్వం వహించడం కష్టమని భావిస్తున్నానంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత నెలలో నోబెల్ పురస్కారాన్ని అందుకునేందుకు నార్వే వెళ్లిన మచాడో, నాటి నుండి వెనిజులాకు తిరిగి చేరుకోలేదు. అయితే, మదురో పతనం తర్వాత.. అతి త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని ఆమె ప్రకటించారు. వెనిజులా ప్రజల తరపున ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఆమె రాక వెనిజులా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్


