ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Madras High Court permitting lighting of lamp near dargah | Sakshi
Sakshi News home page

ఇక కొండపై కార్తీక దీపం.. మద్రాస్ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Jan 6 2026 11:25 AM | Updated on Jan 6 2026 11:58 AM

Madras High Court permitting lighting of lamp near dargah

మదురై: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్న వివాదానికి తెరపడింది.  ఈ కొండపై ఉన్న దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ, మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కె.కె. రామకృష్ణన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు డీఎంకే ప్రభుత్వం, వక్స్‌ బోర్డు,  దర్గా కమిటీ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది. కార్తీక దీపం వెలిగించేందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవీ లేవని స్పష్టం చేసింది.

ఏడాదికి ఒక్కసారి  కార్తీకమాసంలో జరిగే ఈ దీపారాధన కార్యక్రమం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. దేవస్థానం ప్రతినిధులు.. కార్తీక దీపం వెలిగించడం వల్ల ప్రజా శాంతికి భంగం కలుగుతుందని అనడం ‘హాస్యాస్పదంగా, నమ్మశక్యం కానిదిగా’ ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వం కూడా ఇంతలా దిగజారదని తాము ఆశిస్తున్నామని కోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వానికి చురకలు అంటించింది.

ఆ రాతి స్తంభం వద్ద దీపం వెలిగించడాన్ని నిషేధిస్తూ ఎటువంటి ఆగమ శాస్త్రాలు లేదా బలమైన సాక్ష్యాధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదాస్పద రాతి స్తంభం దర్గాకు చెందినదని చెప్పే వాదనల్లో వాస్తవం లేదని, దీనిపై గతంలో కూడా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టు పేర్కొంది. మదురై కలెక్టర్, పోలీసు కమిషనర్, హిందూ ధార్మిక సంస్థల శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కోర్టు కొట్టివేస్తూ, ఆ ప్రదేశంలో దీపం వెలిగించకుండా ఆపేందుకు అప్పీల్దార్లు తగిన ఆధారాలు చూపలేకపోయారని పేర్కొంది.

ఇది కూడా చదవండి: ‘ఏఐ ఉత్త బడుద్దాయి’.. నిగ్గు తేల్చిన గణిత శాస్త్రవేత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement