భారత్‌లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య | Madras High Court Considers Assistance For Evidence Collection In Joho Co Founder Sridhar Vembu Divorce Case | Sakshi
Sakshi News home page

భారత్‌లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య

Feb 11 2026 1:48 PM | Updated on Feb 11 2026 2:06 PM

Zoho Sridhar Vembu divorce case now reached Madras High Court

జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య సాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. అమెరికా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ విచారణకు సంబంధించి భారతదేశంలో ఉన్న సాక్ష్యాలను సేకరించేందుకు న్యాయపరమైన సహాయం కావాలని కోరుతూ ప్రమీల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మద్రాస్ హైకోర్టులో పిటిషన్

కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ‘లెటర్స్ రోగేటరీ’(లెటర్స్ రోగేటరీ అనేది అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో ఒక దేశపు కోర్టు, మరొక దేశపు కోర్టుకు పంపే అధికారిక అభ్యర్థన పత్రం)ను గౌరవించి దాన్ని అమలు చేసేలా భారత అధికారులను ఆదేశించాలని ప్రమీలా శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సరిహద్దు వ్యాజ్యాల్లో మరో దేశంలోని సాక్ష్యాలను లేదా సాక్షుల స్టేట్‌మెంట్లను సేకరించడానికి ఉపయోగించే అధికారిక అభ్యర్థనే ఈ లెటర్స్ రోగేటరీ.

ఈ కేసులో శ్రీధర్ వెంబుతో సహా పలువురు కీలక సాక్షులు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నందున వారి నుంచి సాక్ష్యాలను సేకరించి అమెరికా కోర్టుకు సమర్పించడానికి స్థానిక కోర్టు కమిషనర్‌ను నియమించాలని ఆమె కోరారు.

వివాదం నేపథ్యం..

1993లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య 2020 నుంచి విభేదాలున్నాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగుతున్న ఈ విడాకుల విచారణలో ప్రమీల కొన్ని ఆరోపణలు చేశారు. కంపెనీలో తన వాటాను తగ్గించే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు జోహో సంస్థకు చెందిన ఆస్తులను తన కుటుంబ సభ్యులకు అక్రమంగా బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. 2020లో భారతదేశానికి మకాం మార్చిన తర్వాత తనకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబు గతంలోనే బహిరంగంగా ఖండించారు. ఆస్తుల వివరాలను దాయడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆస్తుల బదిలీ జరగలేదని వాదిస్తున్నారు.

సాక్ష్యాల సేకరణ ఎందుకు కీలకం?

వీరి విడాకుల ప్రక్రియలో భాగంగా వైవాహిక ఆస్తుల పంపకం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు సంక్లిష్టంగా మారాయి. భారతదేశంలో నివసిస్తున్న సాక్షుల స్టేట్‌మెంట్లు లేకుండా కాలిఫోర్నియా కోర్టు ఒక నిర్ణయానికి రావడం కష్టమని ప్రమీల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో కూడా భారత న్యాయస్థానాలు అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఇటువంటి విదేశీ అభ్యర్థనలను అంగీకరించిన సందర్భాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

హైకోర్టు స్పందన

ప్రమీలా శ్రీనివాసన్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ శ్రీధర్ వెంబుకు నోటీసులు జారీ చేసింది. భారతీయ చట్టాలకు లోబడి సాక్ష్యాల నమోదుకు స్థానిక కమిషనర్‌ను నియమించవచ్చా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement