శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు.
శ్రీగిరి క్షేత్రం భక్తుల శివన్మామస్మరణతో మారుమోగుతోంది.
శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు.
అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధనార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులనిచ్చారు.
మంగళవాయిద్యాలు మారుమోగగా, భక్తుల శివన్మామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు.


