ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రపంచాన్ని ఏలుతోంది. అన్ని రంగాలనూ అది ఆక్రమించింది. జనం కూడా ఏఐని విరివిగా వినియోగించుకుంటూ, అన్నింటికీ దానిపైననే ఆధారపడే రోజులు వచ్చాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఏఐ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
అమెరికాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన లాజిక్ ప్రొఫెసర్, ప్రముఖ గణిత శాస్త్రవేత్త జోయెల్ డేవిడ్ హామ్కిన్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గణిత పరిశోధనల్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎంఎస్)కు ఏఐ ఏమాత్రం ఉపయోగపడటం లేదని, అవి ఇచ్చే సమాధానాలు పరమచెత్త(Garbage)గా ఉంటున్నాయని విమర్శించారు. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన జోయెల్ డేవిడ్ హామ్కిన్స్.. తాను అనేక పెయిడ్ ఏఐ మోడల్స్‌తో ప్రయోగాలు చేశానని, అయితే గణితంలో అవి ఏమాత్రం ఖచ్చితత్వాన్ని పాటించడం లేదని స్పష్టం చేశారు.
గణితంలో ఏఐ వ్యవస్థలు తప్పులు చేయడమే కాకుండా, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసినప్పుడు అవి ప్రవర్తించే తీరు మరింత విస్మయానికి గురిచేసిందని హామ్కిన్స్ పేర్కొన్నారు. గణిత తర్కంలో స్పష్టమైన పొరపాట్లు ఉన్నాయని ఏఐకి తెలియజేసినా, అవి ఎంతో ఆత్మవిశ్వాసంతో ‘అదంతా సరిగ్గానే ఉంది’ అంటూ మొండిగా సమాధానమిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఒక వ్యక్తితో సంభాషిస్తున్నప్పుడు వారు ఇలాంటి తప్పుడు వాదనలు చేస్తే, తాను ఇకపై వారితో మాట్లాడేందుకు నిరాకరిస్తానని జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ అన్నారు. ఏఐ ఇచ్చే తప్పుడు సమాధానాలు పరిశోధకుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గణిత ప్రపంచంలో ఏఐ సామర్థ్యంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది పరిశోధకులు ‘ఎర్డోస్’ లాంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో ఏఐ సహాయపడుతుందని అంటుండగా, మరికొందరు ఏఐ ఇచ్చే నిరూపణలు (Proofs) పైకి చూడటానికి బాగున్నా, వాటిలో మానవ మేధస్సు కూడా పసిగట్టలేనంతటి సూక్ష్మమైన పొరపాట్లు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రామాణిక పరీక్షల్లో ఏఐ అద్భుతమైన మార్కులు సాధించినంత మాత్రాన, పరిశోధకులకు అది ఉపయోగపడుతుందని చెప్పలేమని హామ్కిన్స్ విశ్లేషించారు. మొత్తంగా చూస్తే గణితంలో ఏఐ ఉత్త బడుద్దాయి(పనికిమాలిన వ్యక్తి) అని జోయెల్ డేవిడ్ హామ్కిన్స్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రపంచ వినాశనానికి కౌంట్‌డౌన్?


