ప్రపంచంలోని వివిధ దేశాలలో జరుగుతున్న భీకర యుద్ధాలతో మానవాళి వినాశనం అంచునకు చేరింది. తాజాగా వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులకు దిగిన దరిమిలా ఈ యుద్ధ భయాలు తారా స్థాయికి చేరాయి. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాదక ద్రవ్యాల ఉగ్రవాదానికి నాయకుడంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలా రాజధాని కారకాస్ సిటీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇదే కోవలో పలు దేశాల్లో ప్రస్తుతం భీకరంగా జరుగుతున్న యుద్ధాలు, వాటి పరిణామాలపై ప్రత్యేక కథనం ఇది..
అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) విడుదల చేసిన ‘ఎమర్జెన్సీ వాచ్‌లిస్ట్ 2026’ వాస్తవాలను కళ్లముందు ఉంచుతూ, ప్రపంచ దేశాలను మరింతగా భయపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత దారుణమైన మానవీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్న పలు దేశాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. అంతర్జాతీయ సహాయం తగ్గుముఖం పట్టడం, యుద్ధాలు పెచ్చుమీరడం కారణంగా కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని, ప్రపంచ శాంతికి ఇది పెను సవాల్ అని ‘ఎమర్జెన్సీ వాచ్‌లిస్ట్ 2026’నివేదిక స్పష్టం చేసింది.
సూడాన్: ఆగని మారణహోమం
వరుసగా మూడవ ఏడాది కూడా ‘సూడాన్’ అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సైనిక దళాల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. 1.5 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, దేశంలోని 40 శాతం జనాభా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోంది. విదేశీ శక్తులు ఆయుధాలు సరఫరా చేస్తూ, యుద్ధాన్ని పెంచి పోషిస్తుండటంతో సూడాన్‌లో శాంతి అనేది ఎండమావిలా మారింది.
పాలస్తీనా: శిథిలాల కుప్పగా గాజా..
గడచిన రెండేళ్లుగా పాలస్తీనాలో సాగుతున్న యుద్ధం గాజాను శ్మశాన వాటికగా మార్చేసింది. 70 వేల మందికి పైగా జనం మరణించగా, 90 శాతం మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2025, అక్టోబర్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో హింస నిరంతరం కొనసాగుతూనే ఉంది. కనీస వైద్య సదుపాయాలు లేక, ఆహారం అందక గాజా నగరంలో కరువు తాండవిస్తోంది. లక్షలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో మృత్యువుతో పోరాడుతున్నారు.
దక్షిణ సూడాన్: ముంచుకొస్తున్న అంతర్యుద్ధం
దక్షిణ సూడాన్ మరోసారి అంతర్యుద్ధం కోరల్లో చిక్కుకోనుంది. 2018 శాంతి ఒప్పందం విఫలం కావడంతో పాటు, పొరుగున ఉన్న సూడాన్ యుద్ధం కారణంగా చమురు ఎగుమతులు నిలిచిపోయి, ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారింది. దీనికి తోడు ఆరేళ్లుగా సంభవిస్తున్న వరదలు వ్యవసాయాన్ని దేశంలోని వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుతం 28 వేల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందని ‘ఎమర్జెన్సీ వాచ్‌లిస్ట్ 2026’ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
ఇథియోపియా-హైతీ: గ్యాంగ్ వార్‌ల బీభత్సం
ఇథియోపియాలో ప్రాంతీయ విభేదాలు, అగ్రరాజ్యాల నిధుల కోత కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైతీలో ప్రభుత్వం అంటూ ఏదీ లేకపోవడంతో సాయుధ ముఠాల రాజ్యం భయోత్పాతాలను సృష్టిస్తోంది. రాజధాని పోర్ట్-అవు-ప్రిన్స్‌లో విపరీతంగా పెరిగిన లైంగిక దాడులు అక్కడ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి.
మయన్మార్- కాంగో: సహజ వనరుల కోసం రక్తపాతం
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ దేశంలో హింసాయుత ఘటనలు తగ్గుముఖం పట్టలేదు. 2025 నాటి భారీ భూకంపం మయన్మార్‌ను మరింతగా కుంగదీసింది. ఇక డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అరుదైన ఖనిజాల కోసం సాయుధ ముఠాలు నిరంతరం ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా ఆహార లేమితో దేశంలోని 82 లక్షల మంది గర్భిణులు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వివిధ దేశాలకు అవసరమైన ఖనిజ సంపద ఇక్కడి నుండే వెళ్తున్నా, కాంగోలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
లెబనాన్: ఆర్థిక పతనం- యుద్ధ భయం
ఒకప్పుడు పశ్చిమ ఆసియాలో ఆర్థిక పరిపుష్టి కలిగిన లెబనాన్ నేడు దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది. కరెన్సీ విలువ 98 శాతం మేరకు పడిపోవడంతో ఇక్కడి సామాన్యుల బతుకు భారంగా తయారయ్యింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఎప్పుడు యుద్ధానికి దారితీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఐఆర్‌సీ (ఐఆర్‌సీ) అభయం: ప్రాణాలను పణంగా పెట్టి..
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) వివిధ దేశాలకు ఆశాకిరణంలా కనిపిస్తోంది. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వైద్యం, ఆహారం, రక్షణ కల్పిస్తూ లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. మానవత్వమే పరమావధిగా ఈ దేశాల్లోనూ ఐఆర్‌సీ తన సహాయక చర్యలను కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి: Republic Day: ‘పరేడ్’ టిక్కెట్ల బుకింగ్ షురూ.. రేట్లు ఎంతంటే?


