Republic Day: ‘పరేడ్‌’ టిక్కెట్ల బుకింగ్‌ షురూ.. రేట్లు ఎంతంటే? | How to buy Republic Day Parade 2026 tickets | Sakshi
Sakshi News home page

Republic Day: ‘పరేడ్‌’ టిక్కెట్ల బుకింగ్‌ షురూ.. రేట్లు ఎంతంటే?

Jan 5 2026 1:00 PM | Updated on Jan 5 2026 1:03 PM

How to buy Republic Day Parade 2026 tickets

న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. 2026 జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌తో పాటు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు జనవరి 5 (సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ టికెట్లు జనవరి 14 వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి ఆ రోజుకు కేటాయించిన కోటా ముగిసే వరకు అందుబాటులో ఉండనున్నాయి. జనవరి 26న ప్రధాన పరేడ్, జనవరి 28న బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్,  జనవరి 29న అధికారిక బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టికెట్ ధరల వివరాలు
సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం టికెట్ ధరలను నిర్ణయించింది. రిపబ్లిక్ డే పరేడ్ కోసం రూ. 100, రూ. 20 ధరల్లో టికెట్లు లభిస్తాయి. అలాగే జనవరి 28న జరిగే బీటింగ్ రిట్రీట్ రిహార్సల్ టికెట్ ధర రూ. 20 కాగా, జనవరి 29న జరిగే ప్రధాన కార్యక్రమానికి రూ. 100 గా నిర్ణయించారు. ఆసక్తి కలిగినవారు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ‘ఆమంత్రణ్’ (Aamantran) పోర్టల్ www.aamantran.mod.gov.in ద్వారా డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో ఉపయోగించిన ఆధార్, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డును వేడుకకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో వీలుపడని వారి కోసం న్యూఢిల్లీలోని ఆరు  ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి జనవరి 5 నుండి 14 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయనున్నాయి. సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్ రిసెప్షన్, రాజీవ్ చౌక్, కశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్లలో ఈ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి.

వేడుకల విశిష్టత
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని  గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కర్తవ్య పథ్‌లో జరిగే ఈ ప్రధాన పరేడ్‌లో భారత రాష్ట్రపతితో పాటు ఒక విదేశీ ముఖ్య అతిథి పాల్గొంటారు. సైనిక దళాల విన్యాసాలు, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జనవరి 29న విజయ్ చౌక్ వద్ద జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకతో  గణతంత్ర ఉత్సవాలు ముగుస్తాయి. బీటింగ్ రిట్రీట్‌లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ బ్యాండ్ల ప్రదర్శనలు భారత సాయుధ దళాల క్రమశిక్షణను, శౌర్యాన్ని తెలియజేస్తాయి.

ఇది కూడా చదవండి: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ‘మకరవిళక్కు’కు 900 బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement