తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే ‘మకరవిళక్కు’ మహోత్సవానికి కేరళ ప్రభుత్వం భారీగా రవాణా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పంబకు వచ్చే భక్తుల రాకపోకల కోసం 900 బస్సులను సిద్ధం చేసినట్లు రవాణా శాఖ మంత్రి కె.బి. గణేష్ కుమార్ వెల్లడించారు.
శ్రీరామసాకేతం హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గణేష్ కుమార్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని అనుసరించి డిమాండ్ పెరిగిన పక్షంలో మరో 100 బస్సులను అదనంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బస్సు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నందున పంబ హిల్‌టాప్ వద్ద అదనపు పార్కింగ్ వసతులను కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడాది శబరిమల యాత్ర సీజన్ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రశాంతంగొ కొనసాగుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పంబలోని అయ్యప్ప భక్తులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్టీసీ)అందిస్తున్న సేవల పట్ల భక్తులు పూర్తి సంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి రహదారి ప్రమాదాలు చోటుచేసుకోకపోవడం ఊరటనిచ్చే అంశమని గణేష్ కుమార్ అన్నారు. రవాణా శాఖ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా రోడ్డు ప్రమాదాలను నివారించగలిగామని, భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రవాణా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.
జనవరి 14న ‘మకరవిళక్కు’
శబరిమలలో మకరవిళక్కు వేడుకలు 2026, జనవరి 14న జరగనున్నాయి. ఈ సందర్భంగా మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నదని, అందుకే అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 36 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్ 30న ఆలయాన్ని తిరిగి తెరిచినప్పటి నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: ‘రెహమాన్ తప్పేంటి?’.. బీసీసీఐపై శశి థరూర్ నిప్పులు


