న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తన తీవ్ర వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచారు. ‘ఐపీఎల్- 2026’ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎంపిక చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించడంపై శశి థరూర్ మండిపడ్డారు. క్రీడాపరమైన నిర్ణయాలను రాజకీయం చేయడం అత్యంత విచారకరమని థరూర్ అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్ యాజమాన్యాన్ని థరూర్ సమర్థించారు. బీసీసీఐ ఆమోదించిన ఆటగాళ్ల జాబితా నుండే ఫ్రాంచైజీలు ప్లేయర్లను ఎంచుకుంటాయని.. అటువంటప్పుడు ఒక ఆటగాడిని ఎంపిక చేసిన జట్టును లేదా దాని యజమానిని విమర్శించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశం పూర్తిగా క్రీడలకు సంబంధించిన విషయమని, ఇందులో మతం లేదా జాతీయతను తీసుకురావడం సరికాదని థరూర్ అభిప్రాయపడ్డారు. ఒక క్రీడాకారుడిని దేశంలో జరుగుతున్న పరిణామాలకు బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.
‘బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ కాదని, బంగ్లాదేశ్ తన సరిహద్దుల గుండా ఉగ్రవాదులను పంపడం లేదు’ అని థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో మనకున్న దౌత్యపరమైన విభేదాలు వేరని, బంగ్లాదేశ్‌తో ఉన్న సంబంధాలు వేరని ఆయన గుర్తుచేశారు. పొరుగు దేశాలను క్రీడల పరంగా ఒంటరిని చేయడం వల్ల భారత్‌కు ఒరిగేదేదీ లేదని, ఇలాంటి విషయాల్లో విశాల దృక్పథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు ఆందోళనకరమేనని, ఆ దేశ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని థరూర్ కోరారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో ‘అహింసా మంత్రం’.. తోడుగా భారత్ ‘అలోక’


