‘‘రెండు యుద్ధాల మధ్య విరామమే... శాంతి’’.. అప్పుడెప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్ దౌత్యవేత్త జార్జ్ క్లెమెన్‌స్కూ అన్నాడట. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూండగానే ఇజ్రాయెల్ - గాజాపై దాడులకు తెగబడటం.. ఇంతలోనే ఇరాన్ - అమెరికా, అమెరికా -వెనిజులాల మధ్య తరచూ ఘర్షణలు, మినీ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మాట వాస్తవమే అనిపిస్తుంది. అయితే..
శాంతి అనేది రెండు యుద్ధాల మధ్య విరామ సమయంగా కాకుండా... శాశ్వతంగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ... అమెరికాలో ఇప్పుడో నిశ్శబ్ధ విప్లవం మొదలైంది. ప్రేమ, శాంతి సందేశాలతో మానవాళిని ఏకం చేసేందుకు మరో మహా ప్రయత్నం మొదలైంది. ‘వాక్ ఫర్ పీస్’ పేరుతో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేస్తూ అమెరికా పొడవునా ఒక శాంతి ప్రదర్శన మొదలైంది.
పోరు నష్టాలు, మనిషి కష్టాలతో చలించిపోయి సర్వం పరిత్యజించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని వినిపించిన బుద్ధుడి అనునాయిలు సుమారు 19 మంది ఈ మహా ప్రయత్నానికి నేతృత్వం వహిస్తూండటం... ప్రపంచానికి పెద్దన్నలా అందరిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించే అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతూండటం సహజంగానే ఆసక్తికరంగా మారింది.
2025, అక్టోబర్ 26న టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో ప్రారంభమైన ఈ యాత్ర కనీసం పది రాష్ట్రాల గుండా సుమారు 2300 మైళ్ల దూరం కొనసాగనుంది. మొత్తం 120 రోజులపాటు జరిగే ఈ శాంతి యాత్ర ఈ ఏడాది ఫ్రిబవరిలో వాషింగ్టన్‌లో ముగియనుంది. ఇప్పటికే హ్యూస్టన్‌లోని హాంగ్‌కాంగ్ సిటీ మాల్‌లో ఘన స్వాగతం అందుకున్న బౌద్ధ సన్యాసుల బృందం, జార్జియాలోని షార్ప్‌స్‌బర్గ్, పీచ్‌ట్రీ సిటీ, ఫయేట్‌విల్లే వంటి నగరాల గుండా ప్రయాణిస్తూ శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తోంది.
ఈ పాదయాత్రలో అందరి దృష్టిని ఆకర్శిస్తున్న విషయం మరోటి ఉంది. అదే ‘అలోక’. భారతదేశంలో పుట్టి అమెరికా చేరిన ఈ శూనకమిప్పుడు ‘పీస్ డాగ్’గా ప్రపంచం మన్ననలు పొందుతోంది. సన్యాసులతో కలిసి అడుగులు వేస్తోంది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో బౌద్ధ సన్యాసులు బుద్ధుని బోధనల స్ఫూర్తితో, అపారమైన సహనంతో యాత్రను కొనసాగిస్తున్నారు. దారిపొడవునా అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలుకుతూ, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. శాంతి అంటే నినాదం కాదని, అది ఒక జీవన విధానం అని వారు చెబుతున్నారు. జీవితంలో కరుణను పంచుతూ, ద్వేషాన్ని వీడనాడాలని బౌద్ధ సన్యాసులు పిలుపునిస్తున్నారు.


