కొనసాగుతున్న పోలీసుల సోదాలు
లండన్: సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలతోపాటు అధికార దుర్వినియోగం, దు్రష్పవర్తన కేసులో అరెస్టయిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్–విండ్సర్ శుక్రవారం విడుదలయ్యారు. థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆయనను 11 గంటలపాటు ప్రశ్నించారు. విడుదలైన అనంతరం ఆండ్రూ నార్‌ఫోక్‌లోని వుడ్‌ఫామ్ హోమ్‌కు చేరుకున్నారు. మరోవైపు అండ్రూపై దర్యాప్తు కొనసాగుతోంది.
విండ్సర్ రాజప్రాసాదంలో ఆయన గతంలో నివాసం ఉన్న రాయల్ లాడిŠజ్‌లో పోలీసులు శుక్రవారం సైతం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ కీలక సమాచారాన్ని, కొన్ని ట్రేడ్ రిపోర్టులను ఎప్‌స్టీన్‌కు చేరవేసిన కేసులో ఆండ్రూను గురువారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 66వ పుట్టిన రోజునాడే అరెస్టయ్యారు. ఆండ్రూకు సంబంధించిన ఒక నివాసంలో సోదాలు పూర్తయ్యాయని, మరో నివాసంలో ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
గత కొన్ని శతాబ్దాల్లో బ్రిటిష్ రాజకుటుంబంలో ఒక సభ్యుడు అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 1554లో అప్పటి రాణి ఎలిజబెత్–1(ఎలిజబెత్ ట్యూడర్) తోబుట్టువు అరెస్టయ్యారు. మరోవైపు అధికార దుర్వినియోగం కేసులో మాజీ యువరాజు ఆండ్రూపై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టు తర్వాత ఆండ్రూ ఇంకా స్పందించలేదు.


