breaking news
Bouddists
-
అమెరికాలో ‘అహింసా మంత్రం’
‘‘రెండు యుద్ధాల మధ్య విరామమే... శాంతి’’.. అప్పుడెప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్ దౌత్యవేత్త జార్జ్ క్లెమెన్స్కూ అన్నాడట. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూండగానే ఇజ్రాయెల్ - గాజాపై దాడులకు తెగబడటం.. ఇంతలోనే ఇరాన్ - అమెరికా, అమెరికా -వెనిజులాల మధ్య తరచూ ఘర్షణలు, మినీ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మాట వాస్తవమే అనిపిస్తుంది. అయితే.. శాంతి అనేది రెండు యుద్ధాల మధ్య విరామ సమయంగా కాకుండా... శాశ్వతంగా ఉండిపోవాలని ఆకాంక్షిస్తూ... అమెరికాలో ఇప్పుడో నిశ్శబ్ధ విప్లవం మొదలైంది. ప్రేమ, శాంతి సందేశాలతో మానవాళిని ఏకం చేసేందుకు మరో మహా ప్రయత్నం మొదలైంది. ‘వాక్ ఫర్ పీస్’ పేరుతో సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేస్తూ అమెరికా పొడవునా ఒక శాంతి ప్రదర్శన మొదలైంది. పోరు నష్టాలు, మనిషి కష్టాలతో చలించిపోయి సర్వం పరిత్యజించి ప్రపంచానికి శాంతి సందేశాన్ని వినిపించిన బుద్ధుడి అనునాయిలు సుమారు 19 మంది ఈ మహా ప్రయత్నానికి నేతృత్వం వహిస్తూండటం... ప్రపంచానికి పెద్దన్నలా అందరిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించే అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతూండటం సహజంగానే ఆసక్తికరంగా మారింది. 2025, అక్టోబర్ 26న టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో ప్రారంభమైన ఈ యాత్ర కనీసం పది రాష్ట్రాల గుండా సుమారు 2300 మైళ్ల దూరం కొనసాగనుంది. మొత్తం 120 రోజులపాటు జరిగే ఈ శాంతి యాత్ర ఈ ఏడాది ఫ్రిబవరిలో వాషింగ్టన్లో ముగియనుంది. ఇప్పటికే హ్యూస్టన్లోని హాంగ్కాంగ్ సిటీ మాల్లో ఘన స్వాగతం అందుకున్న బౌద్ధ సన్యాసుల బృందం, జార్జియాలోని షార్ప్స్బర్గ్, పీచ్ట్రీ సిటీ, ఫయేట్విల్లే వంటి నగరాల గుండా ప్రయాణిస్తూ శాంతి సందేశాన్ని వ్యాపింపజేస్తోంది. ఈ పాదయాత్రలో అందరి దృష్టిని ఆకర్శిస్తున్న విషయం మరోటి ఉంది. అదే ‘అలోక’. భారతదేశంలో పుట్టి అమెరికా చేరిన ఈ శూనకమిప్పుడు ‘పీస్ డాగ్’గా ప్రపంచం మన్ననలు పొందుతోంది. సన్యాసులతో కలిసి అడుగులు వేస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో బౌద్ధ సన్యాసులు బుద్ధుని బోధనల స్ఫూర్తితో, అపారమైన సహనంతో యాత్రను కొనసాగిస్తున్నారు. దారిపొడవునా అమెరికాలోని వివిధ వర్గాల ప్రజలు వారికి ఘన స్వాగతం పలుకుతూ, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. శాంతి అంటే నినాదం కాదని, అది ఒక జీవన విధానం అని వారు చెబుతున్నారు. జీవితంలో కరుణను పంచుతూ, ద్వేషాన్ని వీడనాడాలని బౌద్ధ సన్యాసులు పిలుపునిస్తున్నారు. -
నేడు మరో నూతన సంవత్సరం.. కోలాహలానికి భిన్నంగా..
క్యాలెండర్లో పేజీలు మారడం అనేది కేవలం కాలగమన సూచిక మాత్రమే కాదు.. అది మనిషి తనను తాను పునరావిష్కరించుకునేందుకు ఏర్పడిన ఒక అద్భుత అవకాశం. దానిని గుర్తు చేసేదే ‘మహాయాన నూతన సంవత్సరం’ నేడు(జనవరి 3) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ‘మహాయాన నూతన సంవత్సరం’ జరుపుకుంటున్నారు. ఈ రోజున వారంతా అంతర్గత మౌనం, ఆత్మపరిశీలనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని, కరుణను బోధించే మహాయాన బౌద్ధులు నూతన సంవత్సర వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026, జనవరి 3వ తేదీన చైనా, జపాన్, టిబెట్, కొరియా తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాయాన బౌద్ధులు ఆధ్యాత్మిక వెలుగుల మధ్య ఈ పర్వదినాన్ని చేసుకుంటున్నారు.'మహాయాన'.. అందరికీ విముక్తి మార్గంసంస్కృతంలో ‘మహాయాన’ అంటే ‘గొప్ప వాహనం’ అని అర్థం. కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని ‘మహాయాన’ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. సన్యాసులతో పాటు సామాన్య గృహస్థులు కూడా తమ దైనందిన జీవితంలోనే నిర్వాణాన్ని సాధించవచ్చని మహాయానశాఖ బోధిస్తుంది.ఆత్మపరిశీలనతో..బౌద్ధ నూతన సంవత్సరం అంటే కేవలం బాహ్య సంబరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అంతర్గత శుద్ధికి ప్రతీక. గత ఏడాది చేసిన పొరపాట్లన్నింటినీ సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరంలో మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగాలని సంకల్పించడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. తనను తాను తెలుసుకోవడమే నిజమైన విజయమని చెప్పిన బుద్ధుని బోధనలను అతని అనుచరులు ఈ సందర్భంగా స్మరించుకుంటారు.బౌద్ధ విహారాల్లో ఆధ్యాత్మిక కోలాహలంఈ పర్వదినాన బౌద్ధ విహారాలు భక్తులతో నిండిపోతాయి. దేవతామూర్తుల విగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ, లోకంలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోవాలని భక్తులు ప్రార్థిస్తారు.అదృష్టానికి చిహ్నంగా గృహాలంకరణమహాయాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బౌద్ధులు తమ ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ముస్తాబు చేస్తారు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆహ్వానిస్తుందని వారు నమ్ముతారు. స్నేహితులు, బంధువులు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా తమలోని ప్రేమను, ఐక్యతను చాటుకుంటారు.సంప్రదాయ విందులు ఈ పండుగలో భక్తితో పాటు వినోదం కూడా తోడవుతుంది. బౌద్ధ అనుచరులు రాత్రి వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో బాణసంచా వెలుగులు విరజిమ్ముతుండగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.చారిత్రక వారసత్వంక్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సిద్ధార్థుడు జన్మించాడు. క్రీ.పూ. 528లో బోధగయలో జ్ఞానోదయం పొందిన ఆయన ‘బుద్ధుడు’గా అవతరించాడు. అశోక చక్రవర్తి హయాంలో ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధ జీవన విధానం.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శాంతిని అందించే మార్గదర్శిగా నిలిచింది.మతం కాదు.. జీవన విధానంప్రస్తుత ఆధునిక కాలంలో బౌద్ధాన్ని ఒక మతంగా కంటే ఒక సైకాలజీగా (మనస్తత్వ శాస్త్రం) ప్రపంచం గుర్తిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, కేవలం మానసిక ప్రశాంతత, అహింస, కరుణ ప్రాతిపదికన ఈ పండుగ చేసుకుంటారు. ఏ దేశానికి ఉన్న ఆచారాల ప్రకారం వారు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నా, దాని పరమార్థం మాత్రం ఒక్కటే.. అదే శాంతియుత జీవనం విధానం.శాంతి మంత్రమే రక్షప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న నేటి తరుణంలో, మహాయాన నూతన సంవత్సరం శాంతి సందేశాన్ని అందరికీ అందిస్తోంది. ‘అప్పో దీపో భవ’ (నీకు నీవే కాంతివి కావాలి) అన్న బుద్ధుడి మాటలను స్మరించుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జ్ఞానమనే జ్యోతిని తమలో వెలిగించుకోవాలని బౌద్ధ మతం మనకు చెబుతోంది.ఇది కూడా చదవండి: తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా.. -
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?
అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్! విచిత్రం! మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’ ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88) -
బౌద్ధుల గుడిలో.. బోధనలకు బడి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని బాదన్కుర్తి నుంచే ఆసియాలోని చాలా దేశాలకు బౌద్ధం వ్యాపించిందనే దానికి ఆధారాలు దొరుకుతున్న తరుణంలో బౌద్ధం పరంగా ఈ ప్రాంతం అంతర్జాతీయ శోభను సంతరించుకోబోతోంది. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ విద్యాలయం, బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చే బౌద్ధారామం ఏర్పాటు కాబోతున్నాయి. వీటి నిర్మాణాలకు తైవాన్, మలేసియా సహా పలు దేశాలు ముందుకొచ్చాయి. పూర్తిగా ఆయా దేశాలకు చెందిన సంస్థల నిధులతోనే విద్యాలయం, బౌద్ధారామం రూపుదిద్దుకోనున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో.. ఆచార్య నాగార్జునుడు రూపొందించిన మహాయాన బౌద్ధాన్ని ఆరాధిస్తున్న దేశాలు బుద్ధవనంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. నాగార్జున కొండను కేంద్రంగా చేసుకుని ఆచార్య నాగార్జునుడు తన బోధనలను విశ్వవ్యాప్తం చేయటమే ఇందుకు కారణం. దీంతో బుద్ధవనంలో ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బుద్ధ అండ్ ఆచార్య నాగార్జున’పేరుతో అంతర్జాతీయ బౌద్ధ విద్యాసంస్థను స్థాపించేందుకు ప్రతిపాదించాయి. బౌద్ధ భిక్షువులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచ స్థాయి బౌద్ధారామాన్ని కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాయి. ఇప్పటికే తమ ప్రతిపాదనలను అందజేశాయి. అధికారికంగా ఆ రెండు సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన వెంటనే ఆయా దేశాల ప్రతినిధులు వచ్చి ఒప్పందం చేసుకోనున్నారు. బెంగళూరులోని మహాబోధి సంస్థ, లోటస్ గ్రూపు హోటల్స్ యాజమాన్యం కూడా వీటి ఏర్పాటుకు సహకరించనున్నాయి. ఏం చేస్తారంటే..? చైనా, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో బౌద్ధ విశ్వవిద్యాలయాలున్నాయి. వాటిల్లో ప్రత్యేక విద్యను బోధిస్తున్నారు. ఆధునిక విద్య ఉన్నత శిఖరాలను తాకుతున్నా విద్యార్థుల్లో ప్రశాంతత కరువైంది. దీంతో విద్యావిధానంలో మార్పు రావాలంటూ చాలా దేశాలు నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భూటాన్లో విద్యా వ్యవస్థకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రతిపాదించగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఇలా అశాంతిని దూరం చేసేలా గొప్ప విద్యావిధానానికి బౌద్ధ విద్యాసంస్థలు సానబడుతున్నాయి. ఇదే తరహా విద్యావిధానంతో బుద్ధవనంలో విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక శాస్త్రం, తర్కం, చరిత్ర, మనోశాస్త్రం, శిల్పశాస్త్రం ఇలా అన్ని అంశాలు ఉంటాయి.. కానీ అన్నీ బౌద్ధంతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి విద్యా సంస్థలకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ ఆ తరహా విద్యాలయం ఏర్పాటైతే చాలా దేశాల నుంచి విద్యార్థులు వస్తారని అంచనా. బౌద్ధ సన్యాసులకు శిక్షణ, బోధనలు, ధ్యానం వంటి వాటికి సంబంధించి బౌద్ధారామం ఏర్పాటు కానుంది. పర్యాటకులు పెరిగే అవకాశం చాలా దేశాలు తమ భౌగోళిక ప్రాంతంలో ఉన్న చిన్నచిన్న బౌద్ధ ఆధారాలను కూడా గొప్పగా అభివృద్ధి చేసుకుని పర్యాటకానికి దోహదం చేసుకునేలా తీర్చి దిద్దాయి. వాటితో పోలిస్తే తెలంగాణలో బౌద్ధం జాడలు స్పష్టంగా, గొప్పగా ఉన్నా.. ఆరామాలు, చైత్యాలు, బౌద్ధ స్థూపాలు వెలుగు చూసినా పట్టించుకునే దిక్కులేదు. బుద్ధుడిని కలిసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన బావరి నివసించిన బాదన్కుర్తి.. తెలంగాణలోని ప్రాంతమే. కానీ ఇప్పటి వరకు అక్కడ తవ్వకాలు కూడా జరిపించలేదు. ఫలితంగా తెలంగాణలోని బౌద్ధం జాడలపై అవగాహనే లేకుండా పోయింది. అయితే ఇటీవల నగరంలో బౌద్ధంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కొందరు విదేశీ బౌద్ధ భిక్షువులు ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున కొండల్లోని బౌద్ధ జాడలు చూసి అబ్బురపడ్డారు. అప్పటి నుంచే బుద్ధవనంపై ఇతర దేశాల్లో అవగాహన మొదలైంది. తాజా ప్రతిపాదనలు ఫలవంతమైతే విదేశీ పర్యాటకులు క్యూ కడతారని అధికారులు భావిస్తున్నారు. -
నాగార్జునకొండలో మయన్మార్ బౌద్ధులు
విజయపురి సౌత్: నాగార్జునకొండను గురువారం మయన్మార్ దేశానికి చెందిన 8 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన వివిధ కళారూపాలను వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధిమొక్క వద్ద ప్రార్థన చేశారు. తరువాత పునర్నిర్మిత మహా స్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను సందర్శించారు. అనంతరం సాగర్ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు.


