క్యాలెండర్‌లో పేజీలు మారడం అనేది కేవలం కాలగమన సూచిక మాత్రమే కాదు.. అది మనిషి తనను తాను పునరావిష్కరించుకునేందుకు ఏర్పడిన ఒక అద్భుత అవకాశం. దానిని గుర్తు చేసేదే ‘మహాయాన నూతన సంవత్సరం’ నేడు(జనవరి 3) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ‘మహాయాన నూతన సంవత్సరం’ జరుపుకుంటున్నారు. ఈ రోజున వారంతా అంతర్గత మౌనం, ఆత్మపరిశీలనకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతిని, కరుణను బోధించే మహాయాన బౌద్ధులు నూతన సంవత్సర వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026, జనవరి 3వ తేదీన చైనా, జపాన్, టిబెట్, కొరియా తదితర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాయాన బౌద్ధులు ఆధ్యాత్మిక వెలుగుల మధ్య ఈ పర్వదినాన్ని చేసుకుంటున్నారు.
'మహాయాన'.. అందరికీ విముక్తి మార్గం
సంస్కృతంలో ‘మహాయాన’ అంటే ‘గొప్ప వాహనం’ అని అర్థం. కేవలం కొద్దిమందికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరికీ జ్ఞానోదయం పొందే అవకాశం ఉందని ‘మహాయాన’ సిద్ధాంతం బలంగా నమ్ముతుంది. సన్యాసులతో పాటు సామాన్య గృహస్థులు కూడా తమ దైనందిన జీవితంలోనే నిర్వాణాన్ని సాధించవచ్చని మహాయానశాఖ బోధిస్తుంది.
ఆత్మపరిశీలనతో..
బౌద్ధ నూతన సంవత్సరం అంటే కేవలం బాహ్య సంబరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది అంతర్గత శుద్ధికి ప్రతీక. గత ఏడాది చేసిన పొరపాట్లన్నింటినీ సమీక్షించుకుంటూ, కొత్త సంవత్సరంలో మరింత ఉత్తమమైన వ్యక్తిగా ఎదగాలని సంకల్పించడం ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. తనను తాను తెలుసుకోవడమే నిజమైన విజయమని చెప్పిన బుద్ధుని బోధనలను అతని అనుచరులు ఈ సందర్భంగా స్మరించుకుంటారు.
బౌద్ధ విహారాల్లో ఆధ్యాత్మిక కోలాహలం
ఈ పర్వదినాన బౌద్ధ విహారాలు భక్తులతో నిండిపోతాయి. దేవతామూర్తుల విగ్రహాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేయడం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించడం ఒక ముఖ్యమైన ఆచారంగా వస్తోంది. కొవ్వొత్తుల వెలుగులో ఆధ్యాత్మిక గీతాలను ఆలపిస్తూ, లోకంలోని అజ్ఞాన చీకట్లు తొలగిపోవాలని భక్తులు ప్రార్థిస్తారు.
అదృష్టానికి చిహ్నంగా గృహాలంకరణ
మహాయాన నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బౌద్ధులు తమ ఇళ్లను శుభ్రం చేసి, రంగురంగుల దీపాలతో, అలంకరణలతో ముస్తాబు చేస్తారు. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూలతను ఆహ్వానిస్తుందని వారు నమ్ముతారు. స్నేహితులు, బంధువులు కానుకలను ఇచ్చిపుచ్చుకుంటారు. తద్వారా తమలోని ప్రేమను, ఐక్యతను చాటుకుంటారు.
సంప్రదాయ విందులు
ఈ పండుగలో భక్తితో పాటు వినోదం కూడా తోడవుతుంది. బౌద్ధ అనుచరులు రాత్రి వేళ కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు ఆరగిస్తారు. అర్ధరాత్రి వేళ ఆకాశంలో బాణసంచా వెలుగులు విరజిమ్ముతుండగా, సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
చారిత్రక వారసత్వం
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లుంబినిలో సిద్ధార్థుడు జన్మించాడు. క్రీ.పూ. 528లో బోధగయలో జ్ఞానోదయం పొందిన ఆయన ‘బుద్ధుడు’గా అవతరించాడు. అశోక చక్రవర్తి హయాంలో ఆసియా ఖండమంతటా విస్తరించిన బౌద్ధ జీవన విధానం.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శాంతిని అందించే మార్గదర్శిగా నిలిచింది.
మతం కాదు.. జీవన విధానం
ప్రస్తుత ఆధునిక కాలంలో బౌద్ధాన్ని ఒక మతంగా కంటే ఒక సైకాలజీగా (మనస్తత్వ శాస్త్రం) ప్రపంచం గుర్తిస్తోంది. ఆడంబరాలకు దూరంగా, కేవలం మానసిక ప్రశాంతత, అహింస, కరుణ ప్రాతిపదికన ఈ పండుగ చేసుకుంటారు. ఏ దేశానికి ఉన్న ఆచారాల ప్రకారం వారు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నా, దాని పరమార్థం మాత్రం ఒక్కటే.. అదే శాంతియుత జీవనం విధానం.
శాంతి మంత్రమే రక్ష
ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న నేటి తరుణంలో, మహాయాన నూతన సంవత్సరం శాంతి సందేశాన్ని అందరికీ అందిస్తోంది. ‘అప్పో దీపో భవ’ (నీకు నీవే కాంతివి కావాలి) అన్న బుద్ధుడి మాటలను స్మరించుకుంటూ, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జ్ఞానమనే జ్యోతిని తమలో వెలిగించుకోవాలని బౌద్ధ మతం మనకు చెబుతోంది.
ఇది కూడా చదవండి: తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా..


