ఒకప్పుడు నూతన సంవత్సరం వేళ ప్రతి ఇంట్లోనూ సందడి చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే.. 80, 90వ దశకాల్లో గ్రీటింగ్ కార్డ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఒకరికొకరు కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. ఈ గ్రీటింగ్ కార్డుల విప్లవం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. రోడ్డు పక్కన పోస్టర్లు అమ్ముకునే ఒక సామాన్య యువకుడు.. కేవలం ఐదు వేల రూపాయల అప్పుతో భారతదేశంలో గ్రీటింగ్ కార్డుల విస్తృత వినియోగానికి నాంది పలికాడు. తద్వారా వందల కోట్ల కంపెనీని కూడా నెలకొల్పాడు.
గ్రీటింగ్ కార్డ్ పుట్టుక.. లండన్ నుండి భారత్‌కు..
గ్రీటింగ్ కార్డుల చరిత్ర 182 ఏళ్ల నాటిది. 1843లో లండన్‌కు చెందిన ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ కోల్.. క్రిస్మస్ సందర్భంగా తనకు వచ్చే వందలాది లేఖలకు సమాధానం ఇవ్వలేక ఒక కొత్త ఆలోచన చేశారు. తన స్నేహితుడు, ఆర్టిస్ట్ జాన్ కాల్‌కాట్ హార్స్లీచేత ఒక చిత్రాన్ని గీయించి, దానిపై ‘క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాయించారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ గ్రీటింగ్ కార్డ్. బ్రిటీష్‌వారు భారత్‌ను పరిపాలిస్తున్న సమయంలో గ్రీటింగ్ సంస్కృతి భారత్‌లో ప్రవేశించింది. 1979లో అనిల్ మూల్‌చందాని అనే యువకుడు ‘ఆర్చీస్’ (Archies) సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులను సామాన్యులకు చేరువ చేశారు.
అప్పుతో మొదలైన ‘ఆర్చీస్’ ప్రస్థానం
ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అనిల్ మూల్‌చందాని, ఒకవైపు తన తండ్రికి చీరల దుకాణంలో సాయం చేస్తూనే, మరోవైపు పోస్టర్లు అమ్మేవారు. 1981లో ఆయన ఢిల్లీలోని కమలా నగర్‌లో కేవలం రూ. ఐదు వేల పెట్టుబడితో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. అనిల్ అమోఘ కృషితో ‘ఆర్చీస్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రీటింగ్ కార్డులు ప్రతి మధ్యతరగతి ఇంటికీ చేరాయి. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది. నేటి సోషల్ మీడియా యుగంలోనూ ఈ సంస్థ సుమారు రూ. 70 కోట్ల విలువతో తన ఉనికిని చాటుకుంటోంది.
డిజిటల్ యుగంలోనూ జ్ఞాపకాలు
ప్రస్తుత స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా కాలంలో వాట్సాప్ సందేశాలు ప్రాచుర్యం పొందినప్పటికీ, గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోలేదు. ఆన్‌లైన్ గిఫ్టింగ్ పోర్టల్స్ ద్వారా నేటికీ కార్డుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చేతితో చక్కగా రాసిన సందేశం అందించే ఆత్మీయత డిజిటల్ మెసేజ్‌లలో కనిపించదని కొందరు నమ్ముతుంటారు. వారు ఇప్పటికీ శుభాకాంక్షలను తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులనే ఎంచుకుంటున్నారు. అందుకే గ్రీటింగ్ కార్డుల యుగం ముగిసిందని చెప్పలేం.. అది కేవలం తన రూపాన్ని మార్చుకున్నదని మాత్రమే అనగలం.
ఇది కూడా చదవండి: ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే..


