ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లోని ప్రజలు జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. ఆరోజు విందు వినోదాలతో వేడుకలు చేసుకుంటారు. అయితే అన్ని దేశాల్లోనూ జనవరి ఒకటి నూతన సంవత్సర ఆరంభం కాదు. కొన్ని దేశాల్లో తమ సంస్కృతులు, ప్రాచీన క్యాలెండర్లు, చంద్రుని గమనం (లూనార్ సైకిల్స్) ఆధారంగా వేర్వేరు తేదీలలో కొత్త ఏడాదిని స్వాగతిస్తారు. నూతన సంవత్సర వేడుకలు వందల ఏళ్ల నాటి సంప్రదాయాలకు ప్రతిరూపాలు.
డ్రాగన్ డ్యాన్స్‌ల హోరు
చైనీస్ నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 3 మధ్య వస్తుంది. ఏకంగా 15 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఆ రోజుల్లో డ్రాగన్ డ్యాన్స్‌లు, ఎరుపు రంగు లాంతర్లు, కుటుంబ విందులతో చైనా కళకళలాడుతుంది. ప్రతి ఏటా ఒక జంతువును ‘రాశి’ (Zodiac Animal) గా పరిగణించడం వీరి ప్రత్యేకత.
రైస్ కేక్ సూప్ తింటే..
కొరియాలో 'సోల్లాల్' (Seollal) పేరుతో మూడు రోజుల పాటు నూతన సంవత్సర వేడుక నిర్వహిస్తారు. 2026, ఫిబ్రవరి 17న ఇది మొదలుకానుంది. ఈ సందర్భంగా అక్కడి వారంతా ‘టెక్‌గుక్’ (tteokguk) అనే రైస్ కేక్ సూప్‌ను సేవిస్తారు. ఇది తింటే వయస్సు ఒక ఏడాది పెరుగుతుందని వారు నమ్ముతారు.
దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్
థాయిలాండ్‌లో ఏప్రిల్ 13 నుండి 15 వరకు 'సోంగ్‌క్రాన్' (Songkran) పేరిట నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటారు. దేశవ్యాప్తంగా వాటర్ ఫైట్ నిర్వహిస్తారు. ఇది చెడును కడిగివేస్తుందని వారు భావిస్తారు.
నిశ్శబ్ధ స్వాగతం
బాలిలో 'న్యేపి' (Nyepi) అనే నిశ్శబ్ద వేడుక జరుగుతుంది. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో భాగంగా 24 గంటల పాటు ద్వీపం మొత్తం నిశ్శబ్ధంగా మారుతుంది. విమానాలు, ట్రాఫిక్, లైట్లు, శబ్దం ఏమీ ఉండవు. ప్రజలంతా ప్రశాంతంగా మెలుగుతూ ధ్యానంలో కాలం గడుపుతారు.
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ)
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రతి ఏటా మారుతూ ఉంటుంది (2026లో జూన్ 16-17 తేదీలలో రావచ్చు). చంద్రుని గమనం ఆధారంగా ఏటా సుమారు 11 రోజులు ముందుకు జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉండే అట్టహాసాలు, పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆ రోజున ప్రశాంతత పాటిస్తూ, ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు.
ఇది కూడా చదవండి: New Year 2026: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు


